February 18, 2013

బాబుకు ఇచ్చిన ఎన్నికల కమిషన్ నోటీస్‌పై వివరణ


గుంటూరు : తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో గుంటూరు జిల్లాకు చెందిన వారు జిల్లాలో ఉండవద్దంటూ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీస్‌పై జిల్లా టిడిపి అధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు వివరణ ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టర్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు నేతృత్వంలో ప్రతినిధి బృందం డి ఆర్‌వోను కలిసి ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటీసుపై వివరణ ఇచ్చారు. చంద్రబాబు ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే పాదయాత్ర ప్రారంభించారని వివరించారు. అక్టోబర్ 2వ తేదీన అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు టీడీపీ తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పోలింగ్ జరిగే సమయంలో చంద్రబాబు గ్రామాలకు దూరంగా పోలింగ్ స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల దూరంగా బస చేస్తున్నారన్నారు.

కావున ఈ సమయంలో ఎవరిని కలిసే అవకాశం లేకపోవడం వలన ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉండవన్నారు. ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున 19వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 21వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు పాదయాత్ర నిలుపుదల చేస్తున్నామన్నారు. ఎన్నికలు జరిగే సమయానికి ముందే పాదయాత్ర నిలుపుదల చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రత్తిపాటి పుల్లారావు పంపిన లేఖను నిమ్మకాయల రాజనారాయణ, మానుకొండ శివ ప్రసాద్, చిట్టాబత్తిన చిట్టిబాబు, కలెక్టర్ కార్యాలయంలో డి ఆర్‌వో నాగబాబును కలిసి అందజేశారు.