January 2, 2013

ఉరేయాల్సిందే..! రేపిస్టులను వదలొద్దు


వరంగల్ జిల్లా విద్యార్థినుల ముక్తకంఠం
చంద్రబాబు సమక్షంలో ఆవేదన
"రేపిస్టులను వదలొద్దు. ఉరితీయాలి''
"ఢిల్లీ సంఘటనతో మా వాళ్లు కలవరపడుతున్నారు సార్.. బడి మాన్పిస్తారేమోనని భయంగా ఉంది''
"మా అమ్మనాన్నలు భయపడుతున్నారు. నన్ను, మా చెల్లెల్ని బయటకు పంపడానికే భయపడుతున్నారు''..
ఢిల్లీ సామూహిక అత్యాచారం ఘటన ఆడపిల్లలను కలవరపెడుతున్న తీరుకు.. తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేగుతున్న వైనానికి అద్దం పడుతున్నాయి ఈ వ్యాఖ్యలు.. ఢిల్లీ ఘటనతో చెదిరిన మనసులను ఊరడించి భరోసా ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నానికి వరంగల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినుల నుంచి అనూహ్య స్పం దన లభించింది.

"బడికి పోలేకపోతున్నాం.. బయటకు రాలేకపోతున్నాం'' అనే భీతి నుంచి "రేపిస్టులను ఉరి తీయాల్సిందే''నన్న సడలని పట్టుదల దాకా విద్యార్థుల గొంతులో బలంగా పలికింది. ఆడపిల్లలకు పూర్తి రక్షణ లభించినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పాదయాత్రలో భాగంగా మంగళవారం చంద్రబాబు వరంగల్ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. కొత్త సంవత్సరం సందర్భంగా విద్యార్థినులతో సుమారు ఆరగంట పాటు గడిపారు. అయితే.. నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పేందుకు గానీ, స్వీకరించేందుకుగానీ ఆయన విముఖత చూపారు.

ఢిల్లీ ఘటన నేపథ్యంలో ఈసారి తాను న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం లేదని వారికి నచ్చజెప్పారు. శుభాకాంక్షలు చెప్పకపోయినా, అందరూ బాగుండాలని ఆశీర్వదిస్తున్నట్టు తెలిపారు. అనంతరం చర్చను ఢిల్లీ అత్యాచార ఘటనపైకి మళ్లించి..విద్యార్థినుల స్పందనలను రాబట్టారు. అలాగే.. వారి సామాజిక స్థాయిని, వారి తల్లిదండ్రుల వృత్తి వివరాలను ఆరా తీశారు. భవిష్యత్తు ఆలోచనలను, ఆకాంక్షలను తెలుసుకొని భుజం తట్టారు. ఒక సమయంలో.. అం దరూ డాక్టర్లయితే రోగులెవరుంటారంటూ చమత్కరించారు.

అంతకుముందు.. వరంగల్ జిల్లా శాయంపేట, పరకాల మండలాల్లోని పెద్దకోడెపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరెపల్లి, తిరుమలగిరి గ్రామాల మీదుగా ఆయన 17.3 కిలోమీటర్లు నడిచారు. రాత్రి కామారంలో బస చేవారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు చంద్రబాబు సర్వమత ప్రార్ధనల్లో పాల్గొన్నారు. బస చేసిన ప్రాంతంలో చంద్రబాబు రాష్ట్ర యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన సకల అభ్యుదయ హోమం, మృత్యుంజయ హోమంలో పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు పరకాల క్రాస్ రోడ్ నుంచి బాబు తన పాదయాత్రను ప్రారంభించారు.

మార్గ మధ్యలో పలువురు రైతులను, మహిళా కూలీలను కలిసారు. పెద్దకోడెపాక గ్రామంలో సైకిల్ ఎక్కి కొద్ది దూరం తొక్కారు. పెదకోడెపాక, జోగంపల్లి గ్రామాల్లో ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభల్లో, యువతకు ఉపాధి కల్పించని సర్కారు తీరును ఘాటుగా విమర్శించారు. రాజీవ్ ఉద్యోగ శ్రీ, యువశక్తి, రాజీవ్ యువ కిరణాల పేరుతో ఏర్పాటు చేసిన పథకాలన్నీ మోసపూరితమైనవేనని చంద్రబాబు దుయ్యబట్టారు. తాము అధికారంలో ఉండగా, సీఎంఈవై లాంటి పథకాలతో యువతను ఆదుకున్నామని గుర్తుచేశారు.

"హైదరాబాద్ నగరంలో సైబరాబాద్ ఏర్పాటు చేసి హైటెక్ సిటీ ద్వారా లక్షలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాం. వైఎస్ అధికారంలోకి రాగానే సైబరాబాద్ చుట్టుపక్కల ఉన్న వేలాది కోట్ల రూపాయల విలువైన భూములను అమ్ముకున్నారు'' అన్నారు. తాము అధికారంలోకి వస్తే 'టెట్'ని రద్దు చేసి, బీఈడీ విద్యార్థులకూ ఎస్‌జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్లు) పోస్టులకు అర్హత కల్పిస్తామని హామీఇచ్చారు.

నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. కాగా, ఎడాపెడా చార్జీలు, సర్‌చార్జీలు విధిస్తూ కిరణ్ ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని ధ్వజమెత్తారు. అవినీతి ఉన్న చోట సంక్షేమం ఉండదని, అభివృద్ధి జరగదన్నారు. అవినీతి రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ వైసీపీపై ధ్వజమెత్తారు. జగన్ పార్టీ జైల్లో ఉండి రాజకీయాలు చేస్తోందని ఎద్దేవా చేశారు. అఖిలపక్షంపై టీఆర్ఎస్ వైఖరినీ దుయ్యబట్టారు. " సీట్లు రావాలి. దానిని అడ్డంపెట్టుకొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. ఇదీ టీఆర్ఎస్ సిద్ధాంతం'' అని విమర్శించారు.

విద్యార్థినుల మాట..
చంద్రబాబు: ఏం జరిగింది? ఎక్కడ జరిగింది?
విద్యార్థినులు: అత్యాచారం.. ఢిల్లీలో బస్సులో జరిగింది.

చంద్రబాబు: ఆమె ఎక్కడ చనిపోయింది?
విద్యార్థినులు: సింగపూర్‌లో

బాబు: ఈ సంఘటనపై మీరేమనుకుంటున్నారు?
విద్యార్థినులు: రేపిస్టులను ఉరితీయాలి (ముక్తకంఠంతో)

చంద్రబాబు: నిజమే.. రేపిస్టుల్లో ఒకరిద్దరికి ఉరిశిక్ష వేస్తే ఇలాంటి సంఘటనలు తిరిగి జరగవు.