January 2, 2013

సాగుకు చేటు కాలం!



డాక్టర్లు తమ పిల్లలను ఎంబీబీఎస్ చదివిస్తారు. రాజకీయ నాయకులు తమ సంతానానికి వారసత్వాన్ని అందిస్తారు. వ్యాపారి తన కుమారులకు వాణిజ్య మెళుకువలు నేర్పి రంగంలోకి దించుతాడు. కానీ, రైతు బిడ్డలు మాత్రం తండ్రి బాట తొక్కాలనుకోరు. ఎందుకు? పెద్దకోడెపాక గ్రామంలో ప్రవేశించగానే నన్ను కలవరపరిచిన ప్రశ్న ఇది. గ్రామంలోని ఒక ప్రభుత్వ పాఠశాలను సందర్శించాను. అక్కడ చదువుకుంటున్న పిల్లలంతా రైతులు, కూలీల పిల్లలే. "మీలో ఎంతమంది వ్యవసాయం చేయాలనుకుంటున్నా''రని వాళ్లను అడిగాను.



ఒక్కరంటే ఒక్కరూ చెయ్యి ఎత్తలేదు. వ్యవసాయం పరిస్థితి ఎంత దారుణంగా తయారయిందనేది ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ ఘటన నాకెంతగానో దోహదపడింది. వ్యవసాయం చేస్తున్నాడంటే 50 ఎకరాలు పొలమున్నా సరే పిల్లను ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదట. అన్నం పెట్టే అన్నదాతకు ఇంత దుస్థితా!

మైలారం వచ్చినప్పుడు కూడా ఇదే రకం అనుభవం నాకు ఎదురైంది. " మా కష్టాల గురించి అందరూ అడుగుతారు. కానీ, చేసేది మాత్రమేమీ ఉండదు'' అని గ్రామంలో ఓ రైతు నిష్ఠురమాడాడు. రైతులు పంటలు పండించకపోతే రూపాయలు తిని బతుకుతారా అని చాలా సూటిగానే ప్రశ్నించాడు. నన్నే కాదు.. ప్రతి ఒక్కరినీ పునరాలోచనలో పడేయగల ప్రశ్న అది. వ్యవసాయం లాభసాటిగా ఉండి ఉంటే ఈరోజున ఇలాంటి ప్రశ్నలు ఎదురు కాక పోవును కదా!

మైలారం వెళ్లేదారి పక్కన ఉన్న కోళ్లఫారం యజమానిని పలకరించాను. వ్యవసాయం నుంచి కోళ్ల ఫారానికి మారడం పెనం నుంచి పొయ్యిలో పడినట్టు ఉందని వాపోయాడు. "నేనూ ఒకప్పుడు రైతునే సార్. వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదని ఈ వ్యాపారంలోకి దిగాను. కానీ, కరెంట్ కోతలతో ఫారం నడిచే పరిస్థితి కనిపించడం లేదు. పూర్తిగా జనరేటర్ల మీద నడపడానికి శక్తి చాలడం లేదు. ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి'' అంటూ బాధపడ్డాడు. వ్యవసాయానికే కాదు..వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకూ ఇదెంత చేటు కాలం!