November 1, 2012

ఎర్రన్నాయుడు జీవిత విశేషాలు ,ఉత్తరాంధ్ర నుంచి తొలి క్యాబినెట్ మంత్రి ఎర్రన్నాయుడు



ఎర్రన్నాయుడు జీవిత విశేషాలు

న్యాయవాదిగా జీవితాన్ని ఆరంభించి రాజకీయాలలో ప్రవేశించి కేంద్ర మంత్రి స్థాయి వరకు ఎదిగిన ఎర్రన్నాయుడు చూడడానికి కాస్త భారీగా కనబడతారు కాని, ఆయన వయసు కేవలం ఏభై ఐదేళ్లే. ఇంకా ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశం ఉన్న ఎర్రన్నాయుడు ఆకస్మికంగా మరణించడం తెలుగుదేశం పార్టీకి పెద్ద లోటుగానే చెప్పవచ్చు. ఆయన జీవిత విశేషాలను ఒక సారి చూస్తే ఎర్రన్నాయుడు కోటబొమ్మాళి మండలం నిమ్మాడలో 1957, ఫిబ్రవరి 23న వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. కళావతమ్మ, దాలినాయుడు ఆయన తల్లిదండ్రులు. ఏడుగురు పిల్లలలో ఆయన మొదటివారు. గార గ్రామంలో ఉన్నతవిద్య, టెక్కలీ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్య అభ్యసించారు. విశాఖ వీఎస్ కృష్ణా కళాశాలలో బీఎస్సీ చదివారు. ఆంధ్రా యూనివ ర్సిటీలో ఎల్‌ఎల్‌బీ చేశారు. 1982, మే 28న విజయకుమారిని వివాహమాడారు. ఆయనకు కుమార్తె, కుమారుడు ఉన్నారు.
1983లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1983లో హరిశ్చంద్రపురం ఎమ్మెల్యేగా పోటీ చేశారు. హరిశ్చంద్రపురం నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1983 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. 1995-96 మధ్య కాలంలో చీఫ్ విప్‌గా సేవలందించారు.1996, 98, 99, 2004లో శ్రీకాకుళం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ పార్లమెంటరీ నేతగానూ పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ క్యాబినెట్ మంత్రిగా ఆయన పనిచేశారు.

   

ఉత్తరాంధ్ర నుంచి తొలి క్యాబినెట్ మంత్రి ఎర్రన్నాయుడు

ఆయన రాజకీయ జీవితంలో తొలిసారి ఓటమిని చూసింది రెండువేల తొమ్మిదిలోనే. ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి క్యాబినెట్ స్థాయిలో కేంద్ర మంత్రి అయిన తొలి వ్యక్తి ఎర్రన్నాయుడు.ఆయన 1994లో తెలుగుదేశం పార్టీ పక్షాన హరిశ్చంద్ర పురం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాక మంత్రి పదవిని ఆశిస్తే, ఛీఫ్ విఫ్ పదవి మాత్రమే దక్కింది. ఆ తర్వాత ఎన్.టి.ఆర్.పై తిరుగుబాటు జరిగిన సందర్భంలో ఈయన చంద్రబాబు పక్షాన నిలిచారు.ఆ తర్వాత 1996 నాటికి లోక్ సభ ఎన్నికలు రావడంతో శ్రీకాకుళం నుంచి టిడిపి అభ్యర్దిగా బలమైన వ్యక్తి ఉండాలని ఈయనను బరిలో దించారు.ఎన్.టి.ఆర్. అప్పటికే చనిపోగా , ఆయన రెండో భార్య లక్ష్మీపార్వతి ఆద్వర్యంలో ఎన్.టి.ఆర్.టిడిపి ఆవిర్భవించింది. ఆ పార్టీ తరపున ఎన్.టి.ఆర్.పెద్ద కుమారుడు జయకృష్ణ పోటీచేశారు.ఆయనను ఎదుర్కుని ఎర్రన్నాయుడు మొదటి సారి సంచలన విజయం సాధించారు. దాంతో ఆయన దశ తిరిగింది. అదే సమయంలో కేంద్రంలో అనిశ్చితి పరిస్థితి ఏర్పడగా, కాంగ్రెస్,బిజెపి యేతర పక్షాలు కలిసి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు కేంద్రంలో కూడా చక్రం తిప్పేవారు. ఆ తరుణంలో దేవెగౌడ ప్రధాని అయ్యారు.ఆయన మంత్రి వర్గంలో ఎర్రన్నాయుడు క్యాబినెట్ హోదాలో చేరడం విశేషం.గ్రామీణాభివృద్ది శాఖ మంత్రిగా ఆయన ఆ తర్వాత వచ్చిన గుజ్రాల్ ప్రభుత్వంలో కూడా కొనసాగారు.ఆ తర్వాత ఎన్.డి.ఎ. హయాంలో టిడిపి కేంద్రంలో చేరలేదు. లేకుంటే మళ్లీ మంత్రి అయి ఉండేవారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తొలిసారి ఒ కేంద్ర మంత్రి అయిన ఘనత ఎర్రన్నాయుడుకు దక్కింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర కు చెందిన కిషోర్ చంద్రదేవ్ 1979లో చరణ్ సింగ్ క్యాబినెట్ లో సహాయ మంత్రిగా ఉండేవారు.ఇప్పుడు మాత్రమే ఆయన క్యాబినెట్ మంత్రి అయ్యారు. శ్రీకాకుళం జిల్లాలో బొడ్డేపల్లి రాజగోపాలరావు అనే సీనియర్ నాయకుడు ఆరు సార్లు లోక్ షభకు ఎన్నికైనా రాని మంత్రి పదవి , తొలిసారి ఎన్నికైన ఎర్రన్నాయుడుకు దక్కడం విశేషం. 
No comments :

No comments :