November 1, 2012

వారి అవినీతిని ఆపితే రుణమాఫీ ఎంతో ఈజీ ,సంక్షేమ పథకాలను నిలిపివేయనక్కరలేదు.(పాదయాత్ర 30వ రోజు) .

వారి అవినీతిని ఆపితే రుణమాఫీ ఎంతో ఈజీ
సంక్షేమ పథకాలను నిలిపివేయనక్కరలేదు..
సీఎంకు చంద్రబాబు జవాబు

కాంగ్రెస్ పాలనలో రైతులు దివాలా..
సమస్యలను పరిష్కరించలేని ఇందిరమ్మ బాటలెందుకు
పత్రికల్లో ఫొటోలతో ప్రజలను ప్రభావితం చేయలేరు..
రుణమాఫీ అమలు చేసి తీరతాం
నా పాదయాత్రలో పాల్గొనండి.. మీ పాలన గురించి తెలుస్తుంది..
కిరణ్‌కు సవాల్
  మీ(కాంగ్రెస్ నాయకుల) అవినీతిని నియంత్రిస్తే రుణమాఫీ అమలు కష్టమేమీ కాదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రుణమాఫీ అమలు కోసం ఏ సంక్షేమ పథకాన్నీ నిలిపి వేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రుణమాఫీ అమలు ఎలా చేస్తావంటూ చంద్రబాబునుద్దేశించి ముఖ్యమంత్రి కిరణ్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానమిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర 30వ రోజు.. మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో బుధవారం కొనసాగింది.

ఈ సందర్భంగా చిన్నచింతకుంట, వడ్డెమాన్‌లలో నిర్వహించిన సభల్లో చంద్రబాబు ప్రసంగించారు. రుణాలు మాఫీ చేయాలని గత ఎన్నికల ముందు తాము డిమాండ్ చేస్తే, అది ఎలా సాధ్యమంటూ అప్పటి సీఎం వైఎస్ కూడా ఇలాగే ప్రశ్నించారని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు చేసిన ప్రకటనపై.. రుణమాఫీ ఎలా సాధ్యం అంటూ కిరణ్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రుణమాఫీ అమలు చేస్తే బ్యాంకులు దివాలా తీస్తాయంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించారు.

కాంగ్రెస్ పాలనవల్లే రైతులు దివాలా తీశారని ధ్వజమెత్తారు. మీ దోపిడీ సొమ్మును రికవరీ చేస్తే రుణ మాఫీ అమలు ఒక్కటే కాదు.. రాష్ట్రంలోని పేద పిల్లలందరికీ ఉచితంగా చదువు చెప్పడం కూడా సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం ఇందిరమ్మ బాటపై మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు పరిష్కరించలేని బాటలెందుకని విమర్శించారు. పత్రికల్లో ఫొటోలతో ప్రజలను ప్రభావితం చేయలేరని ఎద్దేవా చేశారు. వైఎస్, కిరణ్ ఇద్దరూ రైతు వ్యతిరేకులే అని ఆరోపించారు. అవినీతిని ముఖ్యమంత్రే పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. సీఎం, కాంగ్రెస్ నేతలు తన పాదయాత్ర వస్తే వారి పాలన ఎలా ఉందో తెలస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులకు రూ. 600 పింఛన్ ఇచ్చి తీరుతామని పేర్కొన్న చంద్రబాబు... ఒక వేళ కేంద్ర ప్రభుత్వం సహకరిస్తే ఇంకా ఎక్కువ పింఛన్ ఇస్తామని ప్రకటించారు. జైల్లో కూర్చున్న వ్యక్తులు అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేలు కూడా పశువుల కంటే హీనంగా అమ్ముడు పోతుండడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమౌతుందోనని ఆందోళన కలుగుతోందన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు ప్యాకేజీలకు అమ్ముడు పోతున్నారని చంద్రబాబు ఆరోపించారు.

తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని పదేపదే స్పష్టం చేసినా, అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కేంద్రానికి లేఖ రాసినా, కొంత మంది తన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడం శోచనీయమన్నారు. సీఎం కిరణ్ తెలంగాణ జిల్లా పర్యటనను ఎవరూ అడ్డుకోలేదని, పిల్ల కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బోనగిరిలో సభ ఏర్పాటు చేసుకున్నా ఎవరూ అడ్డుకోలేదని, పేదల కష్టాలు తెలుసుకొని, వారిని పరామర్శించేందుకు వచ్చిన తనను అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

టీడీపీ వచ్చాకే తెలంగాణ ప్రాంతంలో విద్యా, తాగునీరు, రోడ్లు వంటి అభివృద్ధి పనులపై చర్చలో తానే పాల్గొంటానని దీనిపై కాంగ్రెస్ నేతలు సిద్ధమేనా అని చంద్రబాబు సవాల్ విసిరారు. టీడీపీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసింది కూడా కాంగ్రెస్సేనని అన్నారు.

బీజేపీ నిరసన
చంద్రబాబు చేపట్టిన పాదయాత్రను వ్యతిరేకిస్తూ బుధవారం ఉదయం మహబూబ్‌నగర్ జిల్లా సీసీ కుంటలో బీజేపీ నాయకులు నల్లజెండాలు కట్టి నిరసన తెలిపారు. విషయం తెలుసుకున్న ఆత్మకూర్ సీఐ మహేశ్వర్, ఎస్ఐలు దానం, రాజు సీసీకుంటకు చేరుకొని, బీజేపీ నాయకులను అరెస్టు చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు.. బాబు పాదయత్రను నిరసిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు బస్టాండ్ ముందున్న రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని వారిని అక్కడినుంచి పంపించారు.

ప్రసంగాలతో ఆకట్టుకుంటున్న బాబు
పాదయాత్రలో భాగంగా చంద్రబాబు తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పినప్పుడల్లా రైతులు చప్పట్లు కొట్టి మద్దతిచ్చారు. అధికారంలోకి రాగానే బెల్టుసాపుల రద్దు కోసం రెండో సంతకం చేస్తానని చెప్పగా మహిళలు హర్షం వ్యక్తం చేశారు.
No comments :

No comments :