October 23, 2012

కాంగ్రెస్, వైఎస్సార్, టీఆర్ఎస్ పార్టీలు దోమల్లాంటివని, ఇవి కుడితే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తుంది -చంద్రబాబు (22వ రోజు మంగళవారం రాత్రి )

రాష్ట్రంలో మొండెద్దు ప్రభుత్వం సాగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఎన్ని ఆందోళనలు చేసినా నిరసనలు చేసినా స్పందించడం లేదని, ప్రజలు సమస్యల సుడిగుండంలో ఉన్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్, వైఎస్సార్, టీఆర్ఎస్ పార్టీలు దోమల్లాంటివని, ఇవి కుడితే డెంగీ, చికెన్‌గున్యా, మలేరియా వస్తుందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రతి రెండో శనివారం పారిశుధ్యం, పరిశుభ్రత నిర్వహించేవారమని, ఇప్పుడు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో పారిశుధ్యం అధ్వాన్నంగా మారిందన్నారు.

సమర్థ, బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఉంటే ఈ దుస్థితి ఉండేది కాదని అన్నారు. వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా చంద్రబాబు మంగళవారం రాత్రి అయిజ మండలం వెంకటాపురం స్టేజీ వద్ద ప్రజలతో మాట్లాడారు. ఈ సందర్భంగా చాలా మంది రైతులు ఆర్డీఎస్ నీటి సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు గంటల కరెంటు కూడా ఉండడం లేదన్నారు. వీటిపై స్పందించిన చంద్రబాబు ఈ ప్రభుత్వాన్ని చూస్తే తనకూ కోపం వస్తుందని ఏం చేద్దామో చెప్పండంటూ వారినే కోరారు. ఇద్దరమూ కలిసి ప్రభుత్వంపై పోరాడుదామని స్థానిక యువకులు చంద్రబాబుకు బదులివ్వడంతో ఆయన వారికి కృతజ్ఞతలు తెలిపారు.

తాము అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల పాటు ఉచిత, నాణ్యమైన విద్యుత్ వ్యవసాయానికి ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు, ఢీజిల్ ధరలతో పాటు మద్యం ధరలు కూడా పెంచిందని గుర్తు చేశారు. దొరికినదంతా దోచుకొని రాష్ట్రాన్ని స్మశానంలా మార్చారని దుయ్యబట్టారు. రాష్ట్రానికి ఆధాయం పెరిగినా ప్రజలు మాత్రం అప్పుల్లో కూరుకుపోయారని అన్నారు. త్వరలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం జరుగుతుందని చంద్రబాబు ఆరోపించారు.
No comments :

No comments :