October 23, 2012

తెలంగాణను వ్యతిరేకించలేదు, అఖిలపక్షం ఏర్పాటుకు లేఖ రాశా...21వ రోజు పాదయాత్రలో చంద్రబాబు

తెలంగాణను వ్యతిరేకించలేదు

అఖిలపక్షం ఏర్పాటుకు లేఖ రాశా

అయినా కాంగ్రెస్ నాటకాలాడుతోంది

తెలంగాణలో ఎవరెక్కువ అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమా?

 తెలంగాణ ఏర్పాటును తాను గానీ, టీడీపీ గానీ ఎన్నడూ వ్యతిరేకించ లేదని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినా కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని దుయ్యబట్టారు. ఈ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెస్సేనని, అందరం కలిసి ఆ పార్టీపై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. పాదయాత్ర 21వ రోజైన సోమవారం ఆయన కర్నూలు జిల్లా సి.బెళగల్ నియోజకవర్గంలోని కొత్తకోట నుంచి ప్రారంభించారు. కొత్తకోటలో మునెప్ప, మల్లమ్మ సాగు చేసిన వరి పంట వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కర్నూలు జిల్లాలో తొమ్మిది రోజుల పాదయాత్రను ముగించుకుని, సోమవారం సాయంత్రం 5.40 గంటలకు మహబూబ్‌నగర్ జిల్లా రాజోలిలో అడుగు పెట్టారు. జిల్లా సరిహద్దులో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎంఆర్‌పీఎస్ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వివిధ సందర్భాల్లోనూ, రాజోలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలోనూ చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ ప్రభుత్వమే ఎక్కువ అభివృద్ధి చేసిందని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో ఎవరు ఎక్కువ అభివృద్ధి చేశారో చర్చకు సిద్ధమేనా అని కాంగ్రెస్‌కు సవాల్ విసిరినా స్పందించలేదని విమర్శించారు.

తెలంగాణ ఇచ్చే శక్తి టీడీపీకి లేదని, దీనికి సంబంధించి కాంగ్రెస్‌పై ఒత్తిడి తెద్దామని పిలుపునిచ్చారు. ఈ పిలుపునకు అందరూ ఆమోదం తెలుపాలని చంద్రబాబు కోరగా సభకు వచ్చిన వారు తమ ఆమోదాన్ని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే వరద ముంపునకు గురై మూడేళ్లు గడిచినా, రాజోలిలో ఇప్పటికీ ఇళ్లు పూర్తి కాలేదని విమర్శించారు. కేంద్రం నగదు బదిలీ పథకాన్ని తెరపైకి తెచ్చి రూపాయికి కిలో బియ్యం పథకాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తోందని, దీన్ని అందరం వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు.

వైఎస్ చనిపోయినా చేనేత కార్మికులకు ఆయన ప్రకటించిన రుణమాఫీ ఇప్పటికీ అమలు కాలేదని దుయ్యబట్టారు. వైఎస్, రోశయ్య, కిరణ్‌ల హయాంలో ప్రజల సమస్యలు పెరిగాయి తప్ప తగ్గలేదని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను సుప్రీం కోర్టు కొట్టివేస్తే.. దాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పాలకులు ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. పేద విద్యార్థులను చదివించే బాధ్యత తాను తీసుకుంటానని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

ఒకవేళ అది చేయలేకపోతే నిరుద్యోగ భృతి అందజేస్తానన్నారు. బీసీలు అభివృద్ధిలో వెనకబడ్డారని, అందుకే తాను బీసీ డిక్లరేషన్ ప్రకటించానని చెప్పారు. పెత్తందారులను ఎదిరించినప్పుడే బడుగు వర్గాలకు అధికారం వస్తుందని, పరిపాలనలో భాగ్యస్వామ్యం వస్తుందని అన్నారు. పాదయాత్రలో భాగంగా సుంకేసుల గ్రామం, రిజర్వాయర్‌ను సందర్శించారు. వరదలతో నేలమట్టమైన ఇళ్లను పరిశీలించి బాధితులతో మాట్లాడారు. సుంకేసుల వరద బాధితులకు ఆసరా కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రజలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని, వరద, కరువుతో కన్నీళ్లే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈసమస్యలపై కలెక్టర్‌కు లేఖ రాయనున్నట్టు చెప్పారు. సాయంత్రం 5.40కు మహబూబ్‌నగర్ జిల్లా రాజోలి గ్రామంలోకి అడుగుపెట్టారు. గ్రామం వెనక వరదలో కూలిపోయిన ఇళ్ల మీదుగా వస్తూ.. మార్గమధ్యలో బాధితుల వద్దకు వెళ్లి పలకరించారు. మద్దిలేటి అనే వికలాంగుడు చంద్రబాబును కలిసేందుకు కూలిపోయిన ఇంటివద్ద వేచి ఉండగా, అతడికి చేయి ఊపుతూ నవ్వుతూ వెళ్లిపోయారు.

ఆ తర్వాత మరో బాధితుడు టీచర్ రమేష్, సావిత్రమ్మ ఇంటి లోపలికి వెళ్లి పలకరించారు. అంతకుముందు మసీదులో మైనార్టీలతో మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వస్తే మీకు రూ.2500 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని, 8 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని, రాజకీయాల్లో 15% సీట్లను కేటాయిస్తామని, పెళ్లి చేసుకొనే నిరుపేద మహిళలకు రూ.50 వేలు, మసీదులకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.
No comments :

No comments :