August 29, 2013

కూర్చోబెట్టి మాట్లాడితే సమస్యలకు పరిష్కారం కుట్ర కోణంలోనే విభజనపై నిర్ణయం

గ్రామ పెద్దలకున్న తెలివి లేదా!


 "ఒక కుటుంబంలో వచ్చే తగాదాల విషయంలో గ్రామ పెద్దలు ప్రదర్శించేపాటి తెలివి కూడా కాంగ్రెస్ చూపలేకపోయింది. విభజన నిర్ణయం వల్ల ప్రభావితమయ్యే వర్గాల వారిని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నదీ జలాలు, ఉపాధి అవకాశాలు, విద్యావకాశాలు, హైదరాబాద్ తదితర అంశాలపై ప్రజల్లో ఆందోళన ఉంది. వాటిపై చర్చించండి. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం అన్వేషించండి'' అని కాంగ్రెస్‌కు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు.

గురువారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకొన్న తీరు రాజకీయ కుట్రను సూచిస్తోందని ఆరోపించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. "పంచాయితీ ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా చడీచప్పుడు లేదు. కాంగ్రెస్ గెలవదని సర్వేలు రావడం, పంచాయితీ ఎన్నికల్లో పది జిల్లాల్లో టీడీపీ గెలవడంతో చిచ్చు రగిల్చారు. ఇక్కడ టీఆర్ఎస్‌ను, అక్కడ వైసీపీని కలుపుకొన్నారు. ఇక్కడ విలీనం ప్యాకేజీ. అక్కడ బెయిల్ ప్యాకేజీ. కేసీఆర్ ఇక్కడ రెచ్చగొడతారు. ఢిల్లీ వెళ్లి వాళ్లు చెప్పగానే అందరూ సంయమనం పాటించాలని పిలుపు ఇస్తారు.

కడప పౌరుషానికి, ఢిల్లీ పెత్తనానికి పోటీ అని పిలుపులు ఇచ్చిన వాళ్లు ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీ సౌజన్యంతో ఇంట్లో మాదిరిగా జైల్లో కూడా దీక్షలు జరుగుతున్నాయి. ఫోన్లలో చర్చలు, పార్టీ కార్యకలాపాలు జైల్లో కూడా సాగిపోతున్నాయి'' అని చంద్రబాబు ఆరోపించారు. జగన్ అక్రమాస్తుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎందుకు వేగం తగ్గించిందని ప్రశ్నించారు. ఇవన్నీ ఈ కుట్రలో కోణాలని, విభజన వల్ల తమకు సీట్లు వస్తున్నాయని, రాజకీయ ప్రయోజనం కోసమే ఈ నిర్ణయం తీసుకొన్నామని దిగ్విజయ్ సింగ్ ఘనంగా బెంగుళూరులో చెప్పుకొన్నారని తెలిపారు.

"ప్రజల కోసం విభజన చేస్తే... వారిని ముందుగానే విశ్వాసంలోకి తీసుకొని అందరితో మాట్లాడి ఆమోదయోగ్య నిర్ణయం చేస్తే మేం తప్పుబట్టం. ఇవే విషయాలు ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వారికి వాస్తవాలు వివరిస్తాం'' అని ఆయన పేర్కొన్నారు. గుంటూరు జిల్లా నుంచి తన యాత్ర మొదలవుతోందని ఆయన చెప్పారు. లగడపాటిని అడ్డుకున్నట్లుగా తన యాత్రను అడ్డుకుంటారనే ఆందోళన ఏదీ లేదన్నారు. రాష్ట్రం నాశనం చేసిన పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆ పరిస్ధితి ఎదురైందని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు.


విభజన విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇదేదో సొంత పార్టీ వ్యవహారంలా చూస్తోందని చంద్రబాబు విమర్శించారు. ఏపీఎన్జీవోలను ఆంటోనీ కమిటీ వద్దకు వెళ్లాలని ప్రధాని ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. 30 రోజుల నుంచి ప్రజలు రోడ్లపై ఉంటే ఎలా చేతులు దులుపుకొంటారని ఆయన విస్మయం వ్యక్తం చేశారు.

రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా రాష్ట్రాల విభజనపై ఆర్టికల్ 3 కింద నిర్ణయం తీసుకోవడానికి పూర్తి అధికారాలు ఉన్నాయని వైసీపీ లేఖ రాసిచ్చిందని... ఏ కత్తితో పొడవవచ్చో కూడా రాసిచ్చిన పార్టీకి తమను విమర్శించే నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. తమ పార్టీ 2008లో చేసిన తీర్మానంలోనే సమన్యాయం గురించి ప్రస్తావించిందని ఆయన చెప్పారు. మూడేళ్లుగా తెలంగాణను అస్థిరత్వంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీమాంధ్రలో కూడా అదే పరిస్థితి సృష్టిస్తోందన్నారు. తమ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులున్నాయా అని ప్రశ్నించారు.