August 29, 2013

సోనియా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు, ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింది: బాబు

  దేశానికి మేలు చేయవలసిన విధానాలను చిత్తశుధ్ధితో అమలు చేయవలసిన సమయంలో దేశాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తమైన విధానాలతో దేశాన్ని సర్వ నాశనం చేసిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు విరుచుకుపడ్డారు. ప్రధాని కీలుబొమ్మగా మారారని ఆక్షేపిస్తూ సోనియా చేతిలో అధికారం రిమోట్‌లా మారిపోయిందని ఆయన విమర్శించారు. సోనియా దేశాన్ని భ్రష్టు పట్టించారని ఆయన ఘాటుగా విమర్శించారు.
రోజురోజుకీ పతనమవుతున్న రూపాయి విలువను చూస్తుంటే ఎంతో బాధ కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసిన చంద్రబాబు ఆర్థిక సంస్కరణలను సవ్యంగా అమలు చేయడంలో మన్మోహన్ ప్రభుత్వం నిస్సత్తువ ప్రదర్శించిందని ఆయన నిప్పులు చెరిగారు. గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక సంస్కరణలకు ముందు నాటి పరిస్థితులు ఉత్పన్నం కావని చెప్పడం ద్వారా ప్రధానమంత్రి మన్‌మోహన్ సింగ్ 1991 నాటి ముందు పరిస్థితులు వస్తాయని పరోక్షంగానే చెబుతున్నారని విమర్శించారు. పరిస్థితులను చక్కదిద్దలేకపోతే ఆ పదవిలో ఉండడానికి అనర్హులని ఆయన ప్రధానిని ఉద్దేశించి నిష్కర్షగా వ్యాఖ్యానించారు.
అవినీతి ధనాన్ని హవాలా రూపంలో విదేశాలకు తరలించారని ఆయన నిప్పులు చెరుగుతూ మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రపంచంలో నమ్మకం పోయిందని, ఈ పరిస్థితులలో పెద్ద ఎత్తున పెట్టుబడుల
ను ఎలా తీసుకువస్తారని, దేశం అస్తవ్యస్తంగా మారిపోతే ఎవరైనా ఎందుకు పెట్టుబడులు పెడతారని ఆయన ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకత్వం లేదని తీవ్రంగా విమర్శిస్తూ భవిష్యత్తులో ఉద్యోగాలు సృష్టించే పరిస్థితి లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కుంభకోణాలు చోటుచేసుకుంటుంటే ఒక్క కేసు విషయంలోనైనా చర్యలు తీసుకున్నారా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం లోపభూయిష్టమైన విధానాలవల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని. ఈ పరిస్థితులు ఎప్పటికి చక్కబడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు