July 12, 2013

పంచాయితీ పోరుపై దేశం దిశా నిర్దేశం

రానున్న సాధారణ ఎన్నికలలో అధికార సాధన దిశగా అడుగులు వేస్తున్న తెలుగుదేశం పార్టీ మూడు దశలలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పకడ్బందీ వ్యూహరచన చేస్తోంది. సహకార ఎన్నికలలో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా దిద్దుబాటు చర్యలకు దిగిన పార్టీ నాయత్వం సాధారణ ఎన్నికలకు ముందే పటిష్టమైన పునాది వేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవలే ప్రాంతీయ సదస్సులను నిర్వహించిన బాబు పార్టీకి జవసత్వాలు కలిగించారు. మరో అడుగు ముందుకు వేసి శాసన సభ్యులకు, నియోజకవర్గాల ఇంచార్జిలకు లక్ష్యాలను నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మెజారిటీ సర్పంచ్ స్థానాలు దక్కేలా చొరవ తీసుకున్న వారికి టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇస్తామని చంద్రబాబు చేసిన ప్రకటన సత్ఫలితాలు రాబట్టేలా కనిపిస్తోంది.

పార్టీలో ఉత్సాహం కలిగించిన చంద్రబాబు ఇటీవలే తెలంగాణ ప్రాంతంలోని రంగారెడ్డి, వరంగల్ జిల్లాలలో ప్రాంతీయ సదస్సులను నిర్వహించారు. అదే విధంగా రాయలసీమ సదస్సును తిరుపతిలో, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సును విశాఖపట్నంలో, కోస్తాంధ్ర జిల్లాల సదస్సును విజయవాడలో నిర్వహించి పార్టీ కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. నాయకులు, కార్యకర్తలలో రెట్టింపు ఉత్సాహాన్ని కలిగించారు. గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోరాదని, వచ్చే సా«ధారణ ఎన్నికలకు రెఫరెండంగా సర్పంచ్, ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి, జిల్లా పరిషత్, మునిసిపల్ ఎన్నికలను పరిగణించాలని పేర్కొన్నారు. కాగా ఇటీవలే ముగిసిన సహకార ఎన్నికలలలో పార్టీ పరంగా సీరియస్‌గా తీసుకోని ఫలితంగానే చేదు అనుభవం ఎదురైందని బాబు అంచనాకు వచ్చారు. ప్రతి నియోజకవర్గంలో అరవై శాతానికి తగ్గకుండా తెలుగు దేశం పార్టీ సర్పంచ్ పదవులు దక్కించుకోవడం చారిత్రక అవసరం అని నొక్కి చెబుతున్న చంద్రబాబునాయుడు ఆ దిశగా ఫలితాలు రాబ ట్టేందుకు కేడర్‌ను పురమా యించారు.

నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడంలో సఫలీకృతం కావడం తథ్యమని భావిస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత రానున్న సాధారణ ఎన్నికలలోనూ విజయబావుటా ఎగురవేయడం ద్వారా అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో వున్నారు. జులై నాలుగు అనంతరం తెలంగాణలో అడుగు పెట్టనివ్వబోమని జాయింట్ యాక్షన్ కమిటీ హెచ్చరించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలోనూ కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి అనుసరిస్తున్న విధానాలను బట్టి వ్యూహం మార్చే దిశగా చంద్రబాబు పయనిస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు సంబంధించి నిర్వహించిన సభ విజయవంతం కావడాన్ని స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సమీక్షించారు. తాము కూడా తెలంగాణకు వ్యతిరేకం కాదనే సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇచ్చారు. అదే విధంగా ఈ సందేశాన్ని నిర్మాణాత్మకంగా ప్రజలలోకి, గామీణ ప్రాంతాలలోకి తీసుకువెళ్ళాల్సిందిగా హితబోధ చేశారు.

మెజారిటీ స్థానాలను గె లిస్తేనే సాధారణ ఎన్నికలకు మంచి పునాది ఏర్పడుతుందని చంద్రబాబు ఆదేశించిన నేపథ్యంలో నిరంతరం వీడియో కాన్ఫరెన్స్‌లు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌లో టి.ఆర్.ఎస్. విలీనం ప్రచారంపై, రెండు పార్టీలు దోబూచులాడుతున్న వైనంపై ప్రజలకు విడమరిచి చెప్పాలని బాబు సూచించారు. ఇదిలా వుండగా మెజారిటి స్ధానాలు సాధించాల్సిందిగా పార్టీ అధినేత నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు నియోజకవర్గాల ఇంచార్జిలు, శాసనసభ్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రాంతీయ సదస్సుల నేపథ్యంలో పార్టీ బాధ్యులంతా గ్రామాలలో మకాం వేశారు. పార్టీల కతీతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ, స్థానికంగా పరిస్థితి పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులకు అన్ని విధాలా సహక రించేందుకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేకమైన ఏర్పాటు చేశారు.