July 12, 2013

శేరిలింగం పల్లి బరిలో బాబు

తెలుగుదేశం పార్టీలో ఊహాగానాల జోరు
విభజన రాద్దాంతం నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ
వ్యూహరచనలో అంతర్గత విభాగం


 
రాష్ట్ర విభజన అనివార్యమని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు పోటీ చేయనున్న నియోజవకవర్గంపై ఉత్కంఠ నెలకొంది. ప్రత్యేకించి బాబుతో పాటు తనయుడు నారా లోకేష్ సాధారణ ఎన్నికలలో పోటీ చేస్తే విషయమై పార్టీలో సర్వత్రా ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రం సమైక్యంగా వున్న పక్షంలో చంద్రబాబు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నుంచే తిరిగి పోటీ చేసే అవకాశాలు వున్నాయని పార్టీ వర్గాల అంచనా.

రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యోచనలో వున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. రాయల తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన పక్షంలో అనంతపురం జిల్లా హిందూపూర్ నియోజవర్గం నుంచి పోటీ చేయాలన్నది చంద్రబాబు యోచనగా భావిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజవకవర్గం నుంచి చంద్రబాబు లేదా తనయుడు నారా లోకేష్ పోటీ చేసేందుకు దాదాపు రంగం సిద్దమైంది. ముందస్తు వ్యూహంతో వున్న టి.డి.పి. అధినేత ఎప్పడు ఎన్నికలు వచ్చినా మూడు నియోజకవర్గాలలోనూ పార్టీ బలీయంగా వుండేలా జాగ్రత్త పడుతున్నారు.

శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి పార్టీకి గట్టి పునాది వుంది. ఫలితంగానే నారా కుటుంబం నుంచి ఒకరు పోటీ చే యడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు శేరిలింగంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని మదీనాగూడ ఫాంహౌస్ వద్ద చంద్రబాబు ఇంటిని నిర్మిస్తున్నట్టుగా సమాచారం. నారా చంద్రబాబునాయుడు, నారా లోకేష్‌లు పోటీ చేసే అవకాశాలున్నందువల్లనే కుప్పం, శేరిలింగంపల్లి, హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి అంతర్గత చర్చలు జరుగుతున్నాయి.

తెలుగుదేశం పార్టీలోని ఐ.టి. విభాగం ఇందుకు సంబంధించి మూడు న ఇయోజకవర్గాల నుంచి నిరంతరం సమాచారం సేకరించే పనిలో నిమగ్నమై వుంది. ఆయా నియోజవర్గ నాయకులతో, పార్టీ శ్రేణులతో నిరంతరం టచ్‌లో వుంటున్న ఐ.టి. విభాగం టి.డి.పి.కి అనుకూల, ప్రతికూల అంశాలను బేరీజు వేస్తోంది. అవసరమైన పక్షంలో దిద్దుబాటు చర్యలకు దిగే పనిలో నిమగ్నమై వుంది. పార్టీ శ్రేణులతోనే కాకుండా రాజకీయాలతో సంబంధం లేని సగటు ఓటర్లతో సైతం చంద్రబాబు నాయుడు, లోకేష్‌లు పోటీ చేస్తే పరిస్థితి ఎలా వుంటుందనే దిశగా ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. ఐ.టి. విభాగం మూడు నియోజకవర్గాల కేడర్‌తో నిరంతరం సత్సంబంధాలు కొనసాగిస్తుండడం ఆ పార్టీలో నూతన ఉత్సాహం ఏర్పడింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినా, సమైక్యంగా వున్నా శేరిలింగంపల్లి, కుప్పం నియోజకవర్గాలు నారా కుటుంబం ఖాతాలోకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా రాయల తెలంగాణ ఏర్పడితే అనంతపురం జిల్లాలోని హిందూపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే యత్నాలకు ప్రత్యేక కారణాలు వున్నాయి. అక్కడ నుంచి విజయం సాధించిన పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టి. రామారావు ముఖ్యమంత్రిగా పనిచేశారు. స్థానికంగా హిందూపూర్‌లో పార్టీకి పటిష్టమైన పునాదితో పాటు విజయావకాశాలు సంపూర్ణంగా వుండటం బాబు పోటీ చేయాలనే యోచనకు దారి తీసిందని అంటున్నారు.

గత సాధారణ ఎన్నికలలో హిందూపూర్ లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలు రెండింటినీ టి.డి.పి. గెలుచుకుంది. అదే విధంగా పార్టీ బలంగా వున్న నియోజకవర్గాలలో రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి నియోజకవర్గం ఒకటి. స్థానిక పార్టీ నాయకత్వం ఈ నియోజకవర్గం నుంచి నారా లోకేష్‌ను పోటీ చేయాల్సిం దిగా కోరడం జరిగింది.కాగా బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ప్రజలతో నారా లోకేష్ మమేకమయ్యారు. నియోజకవర్గం సమస్యలపై దృష్టి సారించిన లోకేష్ స్థానికంగా మంచి పట్టు సంపాదించారు. ఇప్పటికే తెలుంగాణ, సీమాంధ్రప్రదేశ్, రాయల తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుపై ఎలాంటి నిర్ణయం జరగ నప్పటికీ ముందస్తు వ్యూహరచనలో తెలుగుదేశం పార్టీ ఐ.టి. విభాగం మాత్రం లక్ష్య సాధనలో భాగంగా తన ప్రక్రియను వేగవంతం చేసింది.