July 12, 2013

లెఫ్‌‌టతో లాభం లేదన్న భావనలో టీడీపీ

బాబు + మోడి = 25
ఉభయ పార్టీలలో అంచన
అంతర్గత సర్వేల ప్రభావం
ఆ దిశగా ప్రయత్నాలు?
థర్‌‌డ ఫ్రంట్‌లోకి వైకాపా చేరుతుందన్న భయం
ఎన్డీఏలోచేరితే గెలుపు తథ్యమన్న అంచనా?
25 ఎంపీ సీట్లు గెలువ వచ్చన్న వ్యూహం

  రాజకీ యాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువు లు అంటూ ఉండరు...ఇప్పటికి అనేక సందర్భాలలో ఇది రుజువైంది. గతంలో భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి, ఎన్డీయే అధికారంలో ఉన్నప్పుడు చెట్టాపట్టాలు వేసుకు తిరిగిన తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత కమలనాథులకు కటీఫ్ చెప్పేసింది. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవటం కోసం తెలుగుదేశం పార్టీ పంథా మారనున్నదా?. గుజరాత్ ముఖ్య మంత్రి నరేంద్రమోడీ ప్రచార సారథిగా సార్వత్రిక ఎన్నికల సమర శంఖారావం పూరించిన భారతీయ జనతా పార్టీతో మళ్ళీ దోస్తీకి చంద్రబాబు ప్రయత్నించి సఫలమవుతారా?...అదే జరిగితే రాష్ట్రంలో కాంగ్రెస్, వైకాపా భారీగా దెబ్బ తిని తద్వారా తెలుగుదేశం పార్టీలబ్ధి పొందనున్నదా? ఈ వ్యూహం ఫలిస్తే రెండుపార్టీలు కలిపి కనీసం 25 లోక్‌సభ స్థానాలు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయా?... దేశ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలు జరిపిన సర్వేలు, ఇటు టీడీపీ, అటు బీజేపీ అంతర్గతంగా జరిపిన సర్వేలు ఈ దోస్తీపై సంకేతాలు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి యూపీఏ కూటమి కన్న కాస్త ముందంజలో ఉంటుందని ఇప్పటికి అనేక సర్వేలలో తేలింది. అయితే ఈ తేడాను మరింత పెంచుకోవాలంటే దక్షిణాదిలో కీలకమైన రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో గట్టి పునాది పడాలన్న వ్యూహంతో బీజేపీ నాయకత్వం పని చేస్తున్నట్టు సమాచారం. అందుకోసం తెలుగుదేశం పార్టీ నాయకత్వం కనుక కలసి వస్తే అది ఉభయత్రా లాభసాటిగా ఉంటుందన్న ప్రతిపాదనలు రెండు పార్టీలలోనూ కాస్త వేగంగానే ముందుకు వస్తున్నట్టు తెలుస్తోంది.

ఉభయత్రా లాభమే
ఒకవేళ ఈ ప్రతిపాదన వాస్తవరూపం దాలిస్తే అటు తెలుగుదేశం పార్టీ, ఇటు బీజేపీ సైతం లాభపడే సూచనలున్నాయంటున్నారు. ఎన్నికలలో స్థానాలు సాధించేంత స్వంత బలం అంటూ లేకపోయినా అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం దాకా ప్రతి నియోజకవర్గంలోనూ భారతీయ జనతాపార్టీకి అంతో ఇంతో కార్యకర్తల బలం ఉంది. గత శాసనసభ ఎన్నికలలో పోటీ చేసిన అన్ని స్థానాలలో కనీసం మూడు నుంచి నాలుగు వేల వోట్ల వరకూ బీజేపీ చీల్చగలిగింది. తెలుగుదేశం పార్టీ అనేక స్థానాలలో అదే తేడాతో ఓటమిపాలయింది. ఒకవేళ రెండు పార్టీలూ కలసి సార్వత్రిక ఎన్నికల సమరంలోకి దిగితే ఎలాగ ైనా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరాలన్న చంద్రబా బు ఆకాంక్ష, కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం లో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావాలన్న బీజేపీ కోరికా నెరవేరుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

లెఫ్ట్‌తో లాభం లేదు
గత ఎన్నికలలో వామపక్షాలు, టీఆర్ఎస్‌తో కలిపి మహాకూటమిగా బరిలోకి దిగినప్పటికీ తెలుగుదేశం పార్టీకి కాలం కలసి రాలేదు. ఈ అనుభవం ఆధారంగా వామపక్షాలతో కలసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఫలితం ఉంటుందన్న విశ్వాసం తెలుగుదేశం పార్టీలో చాలామందికి కలగటం లేదంటున్నారు. రాష్ట్రం మొత్తంలో వామపక్షాల బలం కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితం కావటం, తమకు బలం ఉన్న చోట ఆ పార్టీ నేతలే పోటీ చేయటం, మిగిలిన చోట్ల వామపక్షాల నుంచి అందాల్సిన సహకారం అందకపోవటం వంటి అనుభవాలు టీడీపీ నాయకత్వానికి గతంలో ఎదురయ్యాయి. అలాంటప్పుడు వామపక్షాలతో దోస్తీ చేసి కొన్ని స్థానాలు పోగొట్టుకోవటం ఎందుకన్న అభిప్రాయం టీడీపీ నేతల్లో కలుగుతున్నట్టు తెలుస్తోంది.

కూటమిలో వైకాపా చేరితే?...
అన్నిటికీ మించి వైకాపా జాతీయ రాజకీయాలలో ఎటువైపు మొగ్గు చూపుతుందన్నది టీడీపీ నాయకత్వం ముందున్న మరో అనుమానం....చిట్ట చివరి సమయంలో వైకాపా ఎటు తిరిగీ కాంగ్రెస్‌కే జై అంటుందన్న అభిప్రాయాలు, వ్యాఖ్యలు ఈ నిముషం వరకూ ఉన్నప్పటికీ రెండు పార్టీల మధ్య సంబంధాలు ఏమాత్రం మెరుగు పడకపోతే, ఆ పరిస్థితిలో వైకాపా తృతీయ కూటమి లేదా ఫెడరల్ ఫ్రంట్ వైపు దృష్టి సారిస్తే ఇక తమ పరిస్థితి రెంటికీ చెడిన రేవడి అవుతుందన్న అభిప్రాయం, అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నట్టు చెబుతున్నా రు. ఆకూటమిలో వైకాపా ఒకవేళ నిజంగా చేరితే ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ అటువైపు కన్నెత్తి చూసే ప్రసక్తే ఉండదు. అలాంటప్పుడు నరేంద్ర మోడీ ప్రచార సారథిగా ఉన్న బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి వైపు అడుగులు వేస్తే రాష్ట్రంలో అధికారంలోకి రావటంతో పాటు కనీసం 25 లోక్‌సభ స్థానాలు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుందన్నది ఒక వ్యూహం అంటున్నారు.

గడచినదంతా గతం...
బీజేపీ మతతత్వ పార్టీ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అనేక సందర్భాలలో విమర్శలు చేయటం, తెలంగాణ విషయం వచ్చేసరికి చంద్రబాబు అడ్డుకోవటం వల్లనే అప్పట్లో రాష్ట్రం ఇవ్వలేకపోయామని బీజేపీ నాయకత్వంఎదురుదాడికి దిగటం వంటివన్నీ చాలా కాలం నుంచీ సాగుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు జరగటానికి ఇక ఎనిమిది, తొమ్మిది మాసాల గడువు ఉన్న స్థితిలో దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీయే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్ళటం, మమతా బెనర్జీ చొరవ తీసుకుని ఫెడరల్ ఫ్రంట్ లేదా తృతీయ కూటమిఅంటూ కొత్త నినాదం లేవదీయటం, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ కొత్త మిత్రులను ఎంపిక చేసుకునే పనిలో పడటం వంటివి ఎప్పటికప్పుడు శరవేగంగా జరిగిపోతున్నాయి. ఇదే పరిస్థితి రాష్ట్రంలోనూ సంభవించే అవకాశాలు ఉన్నాయా?....రాష్ట్ర విభజన అంశంపై రెండు రోజుల్లో కాంగ్రెస్ వైఖరి ఏమిటో బయటపడనుండటం, వైకాపా దోస్తీ ఎటువైపు అనేదానిపై చర్చలు సాగుతుండటం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ అనుసరించనున్న వ్యూహం ఏమిటన్న దానిపై ఆసక్తికర చర్చకు తెర తీసినట్టయింది. అన్ని పరిస్థితులనూ జాగ్రత్తగా గమనిస్తే చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ జట్టు కడితే రెండు పార్టీలకు లబ్ధి చేకూరుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తంఅవుతున్నాయి.