June 5, 2013

ఫాం హౌస్‌లో నిద్ర పట్టకపోయినా మాదే తప్పా?: సోమిరెడ్డి

టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కెసిఆర్‌కు ఫాం హౌస్‌లో నిద్ర పట్టకపోయినా అది ఆంధ్రావాళ్ళదే తప్పా అని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘రాజకీయాల్లోంచి రిటైరైన కేశవరావు, ప్రతి ఎన్నికకూ ఒక పార్టీ మార్చే మందా జగన్నాధం, తాత ముత్తాతల కాలం నాటి వారిని చేర్చుకొని కెసిఆర్ ఎందుకు జబ్బలు చరుచుకొంటున్నారో మాకు అర్ధం కావడం లేదు. చేర్చుకొంటే చేర్చుకో...కాని ప్రతిదానికీ ఆంధ్రావాళ్ళను తిట్టడం ఎందుకు? తెలంగాణలో పేదరికం ఉందంటావు.

రాష్ట్ర ఆదాయంలో 75 శాతం తెలంగాణ నుంచే వస్తుందంటావు. అభివద్ది అయితేనే కదా అంత ఆదాయం వచ్చేది. నీ అక్రమాలను రఘునందనరావు బయట పెడితే ఆంధ్రా వాళ్ళ కుట్ర. నీ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్ళినా అది ఆంధ్రావారి కుట్రేనా’ అని ఆయన అన్నారు. మందా పోయిన ఎన్నికల సమయంలో నోటుకు...ఇప్పుడు రెండు సీట్లకు అమ్ముడుపోయారని, ఇలాంటి ఫిరాయింపుదారులను చేర్చుకొని వారికి త్యాగమూర్తులని కితాబులు ఇవ్వడం కెసిఆర్ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన విమర్శించారు.