June 5, 2013

షర్మిలపై రేవంత్ ఫైర్!

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర అబద్దపు ప్రచారంతో చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రేవంత్ రెడ్డి బుధవారం మండిపడ్డారు. షర్మిల ఊకదంపుడు ప్రచారానని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదని, నమ్మే పరిస్థితి కూడా లేదని ఆయన అన్నారు.

జైలులోని జగన్‌ను విడిపించేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెసు పార్టీతో కుమ్మక్కయిందని ఆరోపించారు. వైయస్ జగన్ ములాకత్‌లను వ్యతిరేకించిన అధికారిని ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జగన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జగన్ వ్యతిరేకుల పైన ముఖ్యమంత్రి ప్రతీకారచర్యలకు దిగుతున్నారని ఆరోపించారు.

సునీర్ రెడ్డి ఎందుకు బెయిల్ పిటిషన్ వేయలేదో చెప్పాలన్నారు. జగన్‌ను బయటకు తీసుకు వచ్చేందుకు జైలు గోడలు పగులగొట్టాలని విజయమ్మ, షర్మిల చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతన్న వారిని ముఖ్యమంత్రి పదవుల నుండి తొలగించడం వాస్తవం కాదా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

జగన్‌కు వ్యతిరేకంగా పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాట్లాడితే లిక్కరే కేసులు పెట్టారని ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితిలు కాంగ్రెసును వదిలేసి ప్రతిపక్షాన్ని విమర్శిస్తున్నాయన్నారు. కాంగ్రెసుతో ఆ పార్టీలు కుమ్మక్కయ్యాయనేందుకు ఇదే మంచి ఉదాహరణ అన్నారు.

జగన్‌తో కలిసి అక్రమాలకు పాల్పడిన వారిని ఒకే జైలులో ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. అందర్నీ ఒకే జైలులో పెట్టడమంటే కిరణ్ సహకరిస్తున్నట్లే కదా అన్నారు. జగన్ సహాయకుడు సునీల్ రెడ్డి జైల్లో సహాయకుడిగా ఉన్నందునే ఆయన బెయిల్ పిటిషన్ వేయడం లేదన్నారు. టిడిపి హయాంలో పని చేసిన అధికారులు ఉన్నత పదవుల్లో ఉంటే, వైయస్ హయాంలో పని చేసిన వారు జైళ్లలో ఉన్నారన్నారు.