June 5, 2013

పల్లెలను తాకుతున్న బాబు రుణమాఫీ హామీ 40 శాతం రుణాలు పెండింగ్‌ రుణాలు చెల్లించని వారు 32 లక్షలు

బ్యాంకులకు బాబు మాఫీ సెగ
బాబు మాఫీపై విశ్వాసంతోనే అగిన చెల్లింపులు?
నమ్మకపోతే రికవరీ శాతం పెరిగేదే
అధికారంలోకి రావాలంటే కోటి ఒట్లు అవసరం
బాబు హామీనే కారణమంటున్న బ్యాంకర్లు
సహకార ఎన్నికల్లో సీరియస్‌గా పనిచేయకున్నా రెండో స్థానంలో టీడీపీ
రుణమాఫీ హామీనే కారణమా?


టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన రైతు రుణాల మాఫీ బ్యాంకులకు షాక్‌ నిస్తోంది. తాను అధికారంలోకి వస్తే రుణ మాఫీ, వడ్డీలేని రుణాలు ఇస్తామని బాబు ప్రకటించిన నేపథ్యంలో బ్యాంకుల రికవరీలు పడకేశాయి. దాదాపు 40 శాతం రికవరీలు నిలిచిపోయాయి. మొత్తం 85 లక్షల మంది రైతులు రుణాలు తీసుకుంటే, వారిలో 32 లక్షల మంది రైతులు రుణాలు చెల్లించేందుకు సుముఖంగా లేరు. ఎలాగూ చంద్రబాబునాయుడు అధికారంలోకి వస్తే, బాబు రుణాలు మాఫీ చేస్తారన్న భరోసాతో రుణాలు చెల్లించడం లేదు.

ఈ ప్రకారం.. వీరంతా రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఇప్పుడే నికర ఓటు బ్యాంకుగా మారినట్లు బ్యాంకర్ల వ్యాఖ్యలతో స్పష్టమవుతోంది. రానున్న ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా కోటి ఓట్లు అవసరం. ప్రస్తుతం ఉన్న త్రిముఖ, చతుర్ముఖ పోటీ వాతావరణంలో అది 70-80 లక్షలకు చేరుకున్నా ఆశ్చర్యపడ వలసిన పనిలేదు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ఇచ్చిన రైతు రుణాల మాఫీ రైతు హృదయాలను తాకినట్లు నిన్న జరిగిన ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో దాని చైర్మన్‌, ఆంధ్రాబ్యాంక్‌ ఎండీ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. 40 శాతం మంది రైతులు రుణాలు కట్టేందుకు సిద్ధంగా లేరని, కొన్ని పార్టీలు రుణమాఫీ ప్రకటన ఇవ్వడమే దానికి కారణమని వ్యాఖ్యానించారు. అంటే దీన్ని బట్టి.. చంద్రబాబునాయుడు ప్రకటించిన రుణాల మాఫీ హామీ పల్లెసీమల్లో ప్రభంజనం సృష్టించే అవకాశాలు కనిపిస్తుండగా, బ్యాంకులకు మాత్రం ముచ్చెమటలు పట్టిస్తున్నాయన్న సంకేతాలు వెల్లడవుతున్నాయి.

ఈ ప్రకారంగా.. బాబు రైతు రుణమాఫీ హామీ ఇంకాస్త ఎక్కువ స్థాయిలో గ్రామీణ ప్రాంతాలకు చేరితే అది ఆ పార్టీకి మరింత ఉపయోగపడి, అది అధికారానికి ద గ్గర దారిగా మార్చవచ్చన్న అభిప్రాయం, నమ్మకం వ్యక్తమవుతోంది. అంటే.. బ్యాంకర్ల గణాంకాల ప్రకారం మొత్తం 85 లక్షల మంది రైతుల్లో 32 లక్షల మంది రుణాలు చెల్లించేందుకు సిద్ధపడటం లేదు.

ఈ చెల్లింపులకు మరో ఏడాది గడువు ఉంది. అటు బాబు కూడా రుణాలు చెల్లించాల్సిన పనిలేదని, తాను అధికారంలోకి వస్తే తొలి సంతకం రుణమాఫీ ఫైల్‌ మీదే పెడతానని హామీలిస్తున్నారు. ఈ లెక్కన.. 32 లక్షల మంది రైతులు తెలుగుదేశం పార్టీకి ఇప్పటికే ఓటు బ్యాంకులుగా మారినట్టేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దానితోపాటు, ఒక్కో రైతు కుటుంబంలో రుణమాఫీ హామీ ఇచ్చిన టీడీపీకి రెండు ఓట్లు వేసినప్పటికీ కనీసం 70 లక్షల ఓట్లు టీడీపీ ఖాతాలో కలిసినట్టేనంటున్నారు. బాబును ఎవరూ నమ్మరని, ఆయనకు విశ్వసనీయత లేదని కాంగ్రెస్‌-జగన్‌ పార్టీలు ఎంత విమర్శిస్తున్నప్పటికీ, రుణ వ్యవహారాలు పర్యవేక్షించే బ్యాంకర్ల మాటలు మాత్రం అందుకు విరుద్ధంగా ఉండటం ఆసక్తికలిగిస్తోంది. రుణమాఫీ హామీ వల్ల 32 లక్షల మంది రైతులు వాటిని చెల్లించేందుకు సిద్ధంగా లేరని స్వయంగా ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్‌ ప్రకటించడం బట్టి.. బాబు రుణ మాఫీని రైతులు విశ్వసిస్తున్నారని, అందుకే రుణాలు చెల్లించడం లేదని స్పష్టమవుతోంది. కాంగ్రెస్‌-జగన్‌ పార్టీ విమర్శలే నిజమయితే రైతులు బాబును నమ్మకుండా మిగిలిన 60 శాతం మంది మాదిరిగా రుణాలు చెల్లించేవారన్న విశ్లేషణ తెరపైకి వస్తోంది.

ఇటీవల జరిగిన సహకార సంఘ ఎన్నికల్లో జిల్లాలో టీడీపీకి సరైన నాయకత్వం లేకపోయినా, నేలతంతా బాబు పాదయాత్రపై దృష్టి సారించి, ఎన్నికలను వదిలేసినా రెండు జిల్లాలను కైవసం చేసుకోవడంతోపాటు, రెండవ స్థానంలో నిలవడానికి ప్రధాన కారణం.. బాబు ఇచ్చిన రైతు రుణాల మాఫీయేనని, అందుకే ఆ స్థాయిలో ఫలితాలు వచ్చాయంటున్నారు.