June 1, 2013

కేసీఆర్‌తో చెప్పిస్తేనే.......... రేవంత్ రెడ్డి


  : 'విలీనం'పై టీఆర్ఎస్ సవాల్‌కు తెలుగుదేశం పార్టీ కూడా అదే స్థాయిలో
స్పందించింది. మూడు షరతులకు ఒప్పుకొంటే టీఆర్ఎస్‌ను టీడీపీలో విలీనం చేస్తామంటూ టీఆర్ఎస్ పక్ష ఉపనేత హరీశ్‌రావు చేసిన ప్రతిపాదనను స్వీకరిస్తున్నట్టు టీడీపీ ప్రతినిధి రేవంత్ రెడ్డి ప్రకటించారు. హరీశ్ అభిప్రాయమే ఆయన పార్టీకీ ఉంటే..పొలిట్‌బ్యూరోలో తీర్మానించి.. కేసీఆర్‌తో ప్రకటన చేయించాలని రేవంత్ కోరారు. అప్పుడు తాము సానుకూలంగా స్పందిస్తామని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో శనివారం జరిగిన విలేకరుల సమా వేశంలో స్పష్టం చేశారు.
తాను ఈ ప్రతిపాదనను టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో, అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదేశాలమేరకే చేస్తున్నానని చెప్పారు. "పార్లమెంటులో బిల్లు పెడితే మద్దతు, తెలంగాణ రాష్ట్రానికి దళితుడే ముఖ్యమంత్రి వంటి షరతులకు అంగీకరిస్తే టీఆర్ఎస్‌ను మా పార్టీలో విలీనం చేస్తామని హరీశ్‌రావు చెప్పారు. ఆయన ప్రతిపాదనలపై మాకు కొన్ని అనుమానాలున్నాయి. వాటిని నివృత్తి చేయాలి. ఆ తర్వాతే విలీనం ఆలోచన'' అని పేర్కొన్నారు. ప్రణబ్‌ముఖర్జీ కమిటీకి 2008లో తామిచ్చిన లేఖను కేంద్రానికి మరోమారు ఇస్తే టీడీపీ కార్యాలయంలో చప్రాసీ పనిచేస్తానని హరీశ్‌రావు గతంలో చెప్పినా..మాట నిలుపుకోలేదని గుర్తు చేశారు.
' అసలు విలీన ప్రతిపాదన హరీశ్ వ్యక్తిగతమా ? లేక టీఆర్ఎస్ అభిప్రా యమా ? ఒకవేళ ఆ పార్టీ అభిప్రాయమే అయితే తక్షణమే పొలిట్‌బ్యూరో తీర్మానం చేసి, కేసీఆర్‌తో ప్రకటన చేయించండి. అప్పుడు మేం సానుకూలంగా స్పందిస్తాం' అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో ఇటీవలి పరిణామాలను గమనిస్తే హరీశ్ రావుకు పార్టీతో పూర్తిస్థాయిలో సంబంధాలున్నట్టు అనిపించడంలేదని వ్యాఖ్యానించారు. రఘునందన్‌రావు బయటకు వెళుతూ హరీశ్‌రావుపై చేసిన ఆరోపణలను కేసీఆర్ ఇంతవరకు ఖండించలేదని గుర్తుచేశారు. తెలంగాణ కోసం తమ పార్టీ చిత్తశుద్ధితో చేస్తున్న ప్రతి ప్రయత్నానికి టీఆర్ఎస్ నేతలు విపరీతార్థాలు తీస్తున్నారని మండిపడ్డారు."తెలంగాణ కోసం ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉంటామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు.
అది వదిలేసి ఈ ప్రాంత నేతలతో మాట్లాడిం చలేదు..ఆ ప్రాంత నేతలతో మాట్లాడించలేదంటూ ఆరోపిం చడం హాస్యాస్పదం' అని ధ్వజమెత్తారు. హరీశ్ ప్రతిపాదనలను తాము విమర్శించడం, ఆయనతో ప్రత్యారోపణలు చేయించుకోడానికి తాము సిద్ధంగా లేమని, ఉద్యమ సందర్భంగా సంయమనం పాటించడమే ఉత్తమమని అభిప్రాయపడ్డారు. "మీ ప్రతిపాదనలపైనే హరీశ్‌రావు స్పందించారు కదా' అన్న మీడియా ప్రశ్నకు.."అవును. ప్రధాని తోనో కేంద్ర హోం మంత్రితోనో లేఖను డ్రాఫ్ట్ చేయించి కేసీఆర్ తీసుకొచ్చినపక్షంలో ఒక్క అక్షరం కూడా మార్చకుండా మా అధినేతతో సంతకం పెట్టిస్తామని చెప్పాం. ఆ మరుక్షణమే టీఆర్ఎస్‌ను తెలుగుదేశం పార్టీలో విలీనం చేయాల్సి ఉంటుందని కూడా చెప్పాం. కేసీఆర్ మహా త్యాగ పురుషుడు కదా.
తెలంగాణ కోసం ఈ చిన్న త్యాగం చేయలేరా?''అని ప్రశ్నించారు. విలీనప్రక్రియ ఎలాగో తెలియకపోతే, కేంద్ర మంత్రి చిరంజీవి సలహా తీసుకున్నా తమకు అభ్యంతరం లేదని పేర్కొన్నారు. వంద సీట్ల కోసం వెయ్యి మందిని బలిపెట్టడమెందుకని కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. టీడీపీలో విలీనం చేస్తే 294 శాసనసభా నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రభావముంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ కోసం ప్రాణాలిస్తామన్న వారు ఈ చిన్నపాటి త్యాగానికి వెనుకడుగు వేస్తారని అనుకోవడంలేదని పేర్కొన్నారు.