June 1, 2013

ఇంటింటికీ టీడీపీ

(విజయనగరం టౌన్) :జిల్లాలో తెలుగుదేశం పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ఆ పార్టీ నేతలు నడుం బిగించారు. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, షెడ్యూల్ ప్రకారం అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్రంలో రా జకీయ పరిణామాలు టీడీపీకి అనుకూలంగా వున్నాయని, రానున్న ఎన్నికల్లో పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు నేతలు కృషిచేస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్ గజపతిరాజు, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ అన్ని నియోజవర్గాల ఇన్‌చార్జిలు పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వ నిర్వాకాన్ని జనం ముం దుకు తీసుకువెళ్లాలని నిశ్చయించారు. పాలకపక్ష నేతల అవినీతి కుంభకోణాలను కూడా ప్రజా క్షేత్ర ంలోకి తీసుకుని వెళ్లి వారిని ప్రజల ముందు దోషులుగా నిలిపే కార్యచరణను సిద్దం చేశారు. ఈ నెల పది నుంచి ఆగస్టు నెలఖరు వరకూ జిల్లాలో విస్తృతంగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అన్ని గ్రామాలు, వార్డులతో పాటు శివారు ప్రాంతాలను కూడా ఈ సందర్భంగా చుట్టిరావాలని నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. నాయకులంతా ఈ కార్యక్రమంలో సమన్వయంతో వ్యవహారించేలా జిల్లా నేతలు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా మండల, నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ విస్తృతస్తాయి సమావేశాలు నిర్వహిస్తారు. వెసులుబాటును బట్టి గ్రామస్థాయిలో కూడా ఈ కార్యక్రమాలను నిర్వహించే అవకాశం వుంది. టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని గ్రామ, గ్రామాన విన్పిస్తారు. అలాగే ఇప్పటి పాలకులు జిల్లాకు చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకుని వెళతారు. జనాకర్షక పథకాల ద్వారా ప్రజలను ఎలా మోసం చేస్తున్నది వివరిస్తారు. ఇదిలా వుండగా, తెలుగుమహిళా కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో తనవంతు బాధ్యతను నిర్వర్తించేందుకు సిద్ధమౌతుంది. ఇందులో భాగంగానే ఈ నెల 6 నుంచి జిల్లాలో బస్సుయాత్ర నిర్వహిస్తారు. కురుపాం నియోజకవర్గంతో ప్రారంభించి ఎస్‌కోటతో ముగించి ఆ తర్వాత విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారు. రాష్ట్ర తెలుగుమహిళా అధ్యక్షురాలు శోభా హైమావతీ దీనికి నేతృత్వం వహిస్తారు. జిల్లాలోని తెలుగుమహిళా విభాగం నేతలు, సభ్యులందరినీ ఈ యాత్రలో భాగస్వాములను చేస్తారు.
టీడీపీ హయాంలో మహిళలకు కలిగిన ప్రయోజనాన్ని వివరించడమే కాకుండా, ఈ ప్రభుత్వం మహిళలను ఏ విధంగా అణిచివేస్తున్నదీ? ప్రజల్లోకి తీసుకుని వెళతారు. ప్రధానంగా ఈ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని విషయాన్ని ఉదాహరణలతో సహా జనంలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేస్తారు. కాగా, పార్టీ అనుబంధ విభాగాలన్నింటిని కూడా ఈ రెండు నెలల కాలంలోనే మరింత క్రీయాశీలం చేసి బాధ్యతలను వికేంద్రీకరించనున్నారు. దీని వలన ఎన్నికల్లో సానుకూల ఫలితాలు రాగలవని విశ్వసిస్తున్నారు. విశేషం ఏమంటే, పాదయాత్ర జరగని జిల్లాల్లో బస్సుయాత్ర చేపడతామని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో ఆ యాత్ర విజయవంతం అవ్వడానికి ఇప్పటి కార్యచరణ ప్రణా
ళిక మరింత దాహోదపడుతుందని భావిస్తున్నారు. ఇంటింటికి టీడీపీ కార్యక్రమం జరుగుతున్న సమయంలోనే బస్సుయాత్ర కూడా వుండడం వలన మంచి ఫలితాలు రాగలవని ఆశాభావంతో వున్నారు. మొత్తమ్మీద ఎన్నికల సమీపిస్తున్న వేళ.. టీడీపీ నాయకులు పకడ్భందీ వ్యూహాంతో ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేయడం క్యాడర్‌లో కొత్త ఉత్సాహన్ని నెలకొల్పుతుంది.
4న చీపురుపల్లిలో ధర్నా : ఆర్టీసీలో ఆన్‌లైన్ టిక్కెట్ల బుకింగ్‌లో కుంభకోణాన్ని నిరసిస్తూ టీడీపీ నేతలు ఈ నెల 4న మంత్రి బొత్స నియోజకవర్గ కేంద్రమైన చీపురుపల్లిలో భారీ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈ కుంభకోణం చీపురుపల్లి కేంద్రంగా జరిగిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు రవాణా మంత్రి బొత్స సమాధానం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.