March 1, 2013

టీడీపీ శ్రేణుల విజయనాదం

జీడీసీసీ, డీసీఎంఎస్‌ల ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సా హం ఉరకలేస్తోంది. శుక్రవారం జిల్లా కేంద్రంలో జరిగిన ఎన్నికల్లో ఒక్క డైరెక్టర్ మినహా అన్ని స్థానాల్లోనూ టీడీపీ అభ్యర్థులే విజయదుందుబి మోగించడంతో నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సాహాలు అంబరాన్నంటాయి. గెలుపు పరిపూర్ణం కాగానే అందరూ ఎన్‌టీఆర్ భవన్‌కు చేరుకొని విజయానందాన్ని పరస్పరం పంచుకొన్నారు.

పార్టీ అభ్యర్థుల గెలుపులో కీలక పాత్ర పోషించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావును నాయకులు, కార్యకర్తలు అభినందించారు.

సహకార ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన రోజు నుంచి ఎలాగైనా సరే జీడీసీసీ, డీసీఎంఎస్‌లపై తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేలా చేసేందుకు పార్టీ జిల్లా అధ్యక్షుడు పుల్లారావు నాయకత్వంలో పకడ్బందీగా వ్యూహాలు రూపొందించి నేతలు విజయవంతంగా అమలు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌లో జారీ చేసిన ఆదేశాలను ఎప్పటికప్పుడు ఆచరణలో పెట్టారు. తరచుగా నేతలంతా సమావేశమౌతూ లోపాలను సవరించారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలను ఎండగట్టారు.

అక్రమాలపై రాష్ట్ర స్థాయిలో 'కోడెల' పోరాటం

సహకార ఎన్నికల్లో మంత్రి కాసు కృష్ణారెడ్డి అక్రమాలకు మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు పెద్ద ఉద్యమమే చేశారు. నరసరావుపేటలో మంత్రి కాసు కృష్ణారెడ్డి ఇంటిని ముట్టడించిన ఉదంతం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఆ సంఘటనలో కోడెలతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు లాఠీలు ఝుళిపించడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమైంది.

ఆ సంఘటనతో నాయకులంతా ఒక్కటయ్యారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పుల్లారావు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జే ఆర్ పుష్పరాజ్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి ఉద్యమించి కార్యకర్తల్లో స్ఫూర్తి నింపారు.

ఒకవైపు పాదయాత్ర... మరోవైపు సహకారం

సహకార ఎన్నికలు జరిగే నాటికి చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర జిల్లాలోకి ప్రవేశించింది. దాంతో పుల్లారావుతో సహా ఇతర నాయకులు చంద్రబాబు వెంట నడుస్తూనే మరోవైపు విరామ సమయంలో జిల్లా కేంద్రానికి చేరుకొని సహకార ఎన్నికల పర్యవేక్షించారు. చంద్రబాబు ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, సహకార అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో సమావేశం నిర్వహించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని నిర్దేశించి. ఆ ప్రకారం వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించడంలో ప్రత్తిపాటి, కోడెల, ఆలపాటి, ధూళిపాళ్ల, యరపతినేని కీలకభూమిక పోషించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ క్యాంపు బాధ్యతలను తీసుకొని సమర్థవంతంగా నిర్వర్తించారు.

చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన నాయకులు

జీడీసీసీ, డీసీఎంఎస్ ఎన్నికల్లో గెలుపొందిన వెంటనే పార్టీ జిల్లా నాయకులు కృష్ణాజిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు ఫోన్ చేసి సమాచారం చేరవేశారు. తొలుత పుల్లారావు ఫోన్‌లో మాట్లాడి అందరం సమష్టిగా పని చేసి విజయం సాధించామన్నారు. చంద్రబాబు ఫోన్‌లోనే పార్టీ విజయానికి కృషి చేసిన నాయకులందరిని అభినందించారు. రా బోయే ఎన్నికలకు ఇదే నాంది అని చెప్పా రు. ఇదే పోరాట స్ఫూర్తిని రానున్న ప్రతీ ఎన్నికల్లో గెలిపించాలని సూచించారు.

నేడు 'బాబు' వద్దకు నాయకులు, సొసైటీల అధ్యక్షులు తెనాలి సెంట్రల్ బ్యాంక్‌లో శనివారం ఉదయం ఉదయం 9 గంటలకు జరిగే సమావేశానికి టీడీపీ జిల్లా నాయకులు, సహకార సంఘాల అధ్యక్షులు తప్పక హాజరు కావాలని ఛైర్మన్ పదవి అభ్యర్థి ముమ్మనేని వెంకట సుబ్బయ్య విజ్ఞప్తి చేశారు. సమావేశం తర్వాత అందరూ కలిసి కృష్ణా జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తోన్న చంద్రబాబు వద్దకు వెళ్ళాల్సి ఉంటుందన్నారు. తన విజయానికి కృషి చేసిన నేతలందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.