March 1, 2013

సాగు,తాగునీరు వెంటనే విడుదల చేయాలి


రైతులకు పంటలు చేతికి అందే సమయంలో సాగునీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో మొక్కజొన్న, పసుపు వంటి వాణిజ్య పంటలకు ప్రస్తుతం నీటి అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటిని విడుదల చేయకపోతే పంట నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్దికి కారణమైన విద్యుత్ రంగాన్ని దివాలా తీయించారన్నారు. ముందు చూపు లేకుండా అప్పటి వైయస్, ప్రస్తుత కిరణ్‌ల నిర్వాహకమే దీనికి కారణమన్నారు. అవినీతి, అసమర్దులు రాజ్యమేలితే ఎలా ఉంటుందో చూస్తున్నామన్నారు.

మాజీ మంత్రి జె ఆర్ పుష్పరాజ్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో ర్రాష్టానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్స్ క్యాపిటల్ ఆప్ ఇండియాగా మార్చారన్నారు. తక్షణమే పంటలకు సరిపడా నీరు అందజేసి విద్యుత్ కోతలను ఎత్తివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ముక్త కంఠంతో తీర్మానించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఆలపాటి, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు యరపతినేని శ్రీనివాసరావు, జీ వియస్ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీ శాసనసభ్యులు ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఎస్ ఎం జియావుద్దీన్, నియోజక వర్గ ఇన్‌చార్జిలు తెనాలి శ్రావణ్‌కుమార్, అనగాని సత్యప్రసాద్, కందుకూరి వీరయ్య, చుక్కా ఏసురత్నం, దాసరి రాజా మాస్టర్, బోనబోయిన శ్రీనివాస యాదవ్, గుంటుపల్లి నాగేశ్వరరావు, కార్యదర్శులు వెన్నా సాంబశివారెడ్డి, తాతా జయప్రకాశ్ నారాయణ, దామచర్ల శ్రీనివాసరావు, చిట్టాబత్తిన చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.