March 1, 2013

రాష్ట్రాన్ని వాటాలేసుకుని తినేశారు

వైఎస్ అవినీతి పాలసీని కిరణ్ అమలు చేస్తున్నారు
వైఎస్ కొడుకు, అల్లుడు, బావమరిది అందరూ దోచుకున్నారు
నేడు అదే బాటలో కిరణ్ తమ్ముళ్ళు : చంద్రబాబు

కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వాటాలేసుకుని తింటున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రాన్ని దోచుకుతినటం వైఎస్ నేర్పగా, కిరణ్ ఆ పాలసీని చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ కాంగ్రెస్ నాయకులు వాటాలుగా దోచుకుతింటున్నారని అన్నారు.

'వస్తున్నా... మీకోసం' పాదయాత్ర 151వ రోజు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో శుక్రవారం జరిగింది. గురువారం రాత్రి వేములపల్లిలో బస చేసిన చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అక్కడి నుంచి ఘంటసాల మండలం కొడాలి సెంటర్ వరకు 3.3 కిలోమీటర్ల పాదయాత్ర చేసి అక్కడ జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇద్దరు తమ్ముళ్ళు రాష్ట్రాన్ని చోరోపక్క నుంచి దోచుకుంటున్నారన్నారు. డబ్బులు వారికి ఇవ్వనిదే ఏ ఫైలూ కదలటంలేదన్నారు. మురుగుకాల్వల్లో ఉండే గుర్రపుడెక్క తొలగించటం ఎంత కష్టమో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని అరికట్టడం అంత కష్టమని ఆయన తెలిపారు.

వైఎస్ బంధువులు దేశంలో పడ్డారన్నీ, కులాన్ని, మతాన్ని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని చంద్రబాబు నాయుడు చెప్పారు. క్యారెక్టర్ లేని అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారనీ, బయ్యారం గనులు, హైదరాబాద్‌లో వందల కోట్లు విలువైన భూములు కబ్జాచేయటం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. వైఎస్ బావమరిది, మాజీ మేయర్ కడపలో అరాచకాలు చేస్తున్నారనీ, ఫోర్జరీ సంతకాలు చేసిన కేసులో ఆయనను పోలీసులు విచారిస్తున్నారని తెలిపారు. వైఎస్ బతికి ఉండగానే భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత ఆయనదన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకూ చేయని అరాచకాలు వైఎస్ తనయుడు చేశారన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగ కన్నీళ్ళు పెట్టి జనం సొమ్ము దోచుకున్నారని అన్నారు.

పెట్రోలు ధరలను మళ్ళీ పెంచటం దారుణమనీ, ఫలితంగా నిత్యావసర ధరలు పెరిగి సామాన్యులు కష్టాలు పడాల్సి వస్తుందని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏప్రిల్ నెలలో సర్‌ఛార్జీల భారాన్ని ప్రజలనెత్తిన వేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో టీడీపీకి 42 మంది ఎంపీలను గెలిపిస్తే గ్యాస్ ధరలను తగ్గిస్తామని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు.