March 1, 2013

వైఎస్ దోపిడీ వారసుడు కిరణే!

గుర్రపుడెక్కలు.. ఆ నేతలు!
ఎప్పటికీ ఆ మురుగ్గుంటలోనే...
వాటాలుగా రాష్ట్రం స్వాహా
ఫైళ్లను శాసిస్తున్న ఆయన తమ్ముళ్లు
కృష్ణాజిల్లా పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు
పార్టీకి నష్టం తెస్తే సహించను
జగయ్యపేట కార్యకర్తల సమీక్షలో హెచ్చరిక

కాంగ్రెస్ నేతలు రాష్ట్రాన్ని వాటాలేసుకుని తింటున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుతినటం వైఎస్ నేర్పగా, కిరణ్ ఆ పాలసీని చక్కగా అమలు చేస్తున్నారని విమర్శించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం వేములపల్లి వద్ద పాదయాత్రను ఆయన ప్రారంభించారు.

కొడాలి, మొవ్వ, కూచిపూడి వరకు నడిచారు. ఈ సందర్భంగా కొడాలి సెంటర్‌లో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ నేతలను తూర్పారపడ్డారు. మురుగుకాల్వల్లోని గుర్రపుడెక్క తొలగించటం ఎంత కష్టమో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని అరికట్టడం అంత కష్టమని తెలిపారు. మండల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వాటాలుగా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ఇద్దరు తమ్ముళ్లు రాష్ట్రాన్ని చెరోపక్క నుంచి దోచుకుంటున్నారని విమర్శించారు. వారికి డబ్బులు ఇవ్వనిదే ఏ ఫైలూ కదలటంలేదన్నారు. వైఎస్ బంధువులు దేశంపై పడ్డారని మండిపడ్డారు. "కేరెక్టర్ లేని అనిల్ కుమార్ క్రైస్తవ మతాన్ని కించపరుస్తున్నారు. బయ్యారం గనులు, హైదరాబాద్‌లో వందల కోట్లు విలువైన భూములు కబ్జాచేశారు. వైఎస్ బావమరిది, మాజీ మేయర్ కడపలో అరాచకాలు చేస్తున్నారు.

ఫోర్జరీ సంతకాలు చేసిన కేసులో ఆయనను పోలీసులు విచారిస్తున్నారు. వైఎస్ బతికిఉండగానే భారీగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేసిన ఘనత ఆయనదే. ఏ ముఖ్యమంత్రి కొడుకూ చేయని అరాచకాలు జగన్ చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దొంగ కన్నీళ్లు పెట్టి జనం సొమ్ము దోచుకున్నారు'' అని దుమ్మెత్తిపోశారు. పెట్రోలు ధరలను మళ్ళీ పెంచటం దారుణమన్నారు. కాగా, రోజువారీ సమీక్షల్లో భాగంగా శుక్రవారం విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట నియోజకవర్గ కార్యకర్తలను కలిశారు. పార్టీకి నష్టం చేసే పరిస్థితికి ఎవరైనా వస్తే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యకర్తలంతా సంవత్సరంపాటు కష్టపడి పనిచే స్తే, వారి అభివృద్ధి తాను చూస్తానని భరోసానిచ్చారు.

అనంతరం మొవ్వలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు రాయబారాలు నడుపుకుంటూ చీకటి ఒప్పందాలకు సిద్ధమయ్యాయని, నేడో...రేపో ఏదో ఒకరోజు కలవటం తథ్యమని పేర్కొన్నారు. వైకుంఠపాళిలో తన కుమారుడిని నిచ్చెన ఎక్కించి ప్రజలను పాములకు పట్టించిన ఘనుడు వైఎస్ అని ఈ సందర్భంగా దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీకి హైకమాండ్ అనేది లేదనీ, ప్రజలే హైకమాండ్ అని తెలిపారు. ఆ తరువాత పార్టీ బీసీ విభాగం నిర్వహించిన చైతన్య సదస్సులో ఆయన పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీ నేతలు చంద్రబాబుకు కత్తీ డాలును బహూకరించారు.