March 1, 2013

నిజంగా ఎంత పెద్ద మనసు!

పరీక్షలనేవి ఏదో ఒక పాఠ్యాంశానికి పరిమితం. కానీ, పిల్లల భవిష్యత్తుకు ఇది పరీక్షా కాలం. పేద పిల్లలు..ఆడపిల్లలు.. బడి దాకా రావడమే కష్టం. ఇంటా బయట సమస్యలు ఎదుర్కొంటూనే పదో తరగతి దాకో, ఇంటర్ దాకో చేరుకున్న వీరికి దారి చూపించాల్సిన వారే.. ఇప్పుడు ఆ దారిలో దీపం ఆర్పేస్తున్నారు. వారి ప్రయాణాన్ని అంధకారం చేసేస్తున్నారు. కన్నవారికి, ఉన్న ఊరికి వెలుగులు తీసుకువద్దామని ఆశపడుతున్న ఈ పిల్లలను గుడ్డి దీపాల కిందకు నెట్టేస్తున్నారు. ఎప్పుడు వస్తుందో తెలియని కరెంటులాగే..వీళ్ల ఉజ్వల జీవితాన్ని డోలాయమానంలో పడేస్తున్నారు. ఏ అపరాత్రో వచ్చే కరెంటు కోసం పొలంలో ఆ తండ్రి.. దీపం బుడ్డి ముందు కునికిపాట్లు పడుతూ ఆ కొడుకు.. వారిద్దరి కోసం కళ్లు పత్తికాయలు చేసుకొని ఆ తల్లి.. కొడాలి ప్రాంతంలోని ఆ చీకటి పల్లెల్లో నేను ఎక్కిన ప్రతి గడపలో కనిపించిన దృశ్యమిదే!

మొవ్వ చేరుకోగానే మొదట ఆ వృద్ధుడే నన్ను ఆకర్షించాడు. బాగా నడుం వంగిపోయి కనిపించాడు. ఆయన చేతికి కర్ర.. ఆ కర్రపై రెపరెపలాడుతున్న మా పార్టీ జెండా.. సహజంగానే ఆసక్తి కలిగింది. దగ్గరకు వెళ్లాను. వృద్ధాప్య పింఛను దగ్గర నుంచి వృద్ధ శరణాలయం దాకా.. ఆ వయసులో ఉండే సమస్యలన్నీ ఏకరువు పెట్టాను. కుటుంబంలో కొడుకూకోడళ్ల ఆదరణ గురించీ ఆరా తీశాను. కానీ, అవేవీ ఆయనను ఉత్సాహపరచలేదు. ఇప్పటిదాకా నాకు వినిపించిన ఈ సమస్యలేవీ ఆయనను బాధిస్తున్నట్టు కనిపించలేదు. కానీ, కాస్త బెంగయితే కనిపించింది. అడగ్గా అడగ్గా మనసులో కోరిక బయటపెట్టాడు. " నాకేం వద్దయ్యా.. మన పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే చాలు.. అన్ని సమస్యలూ అవే తీరిపోతాయి'' అని చెప్పుకొచ్చాడు. నిజంగానే ఎంత పెద్ద మనసు!