February 25, 2013

రైతు ప్రయోజనాల కోసం జైలుకైనా వెళతా

కేసులకు భయపడం
బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?
నేను రెచ్చగొట్టడం లేదు..
రైతుల కడుపుమంట చెబుతున్నా
ముఖ్యమంత్రిపై కేసు పెట్టాలి
పాదయాత్రలో కాంగ్రెస్‌పై చంద్రబాబు ఫైర్

కాంగ్రెస్ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి భగ్గుమన్నారు. రైతుల కడుపుమంటపై మాట్లాడితే కేసులు పెడతామని బెదిరిస్తారా? బ్లాక్‌మెయిల్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని, రైతుల ప్రయోజనాలు కాపాడటం కోసం జైలుకెళ్లేందుకూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ముందు రైతులకు సాగునీరు అందించి ఆ తర్వాత మాట్లాడాలని ఎద్దేవా చేశారు. రేపల్లె నియోజకవర్గంలోని అరవపల్లి నుంచి చంద్రబాబు తన 146వ రోజు 'వస్తున్నా... మీకోసం' పాదయాత్రను సోమవారం కొనసాగించారు.

నల్లూరుపాలెంలో ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర విగ్రహాలను ఆవిష్కరించిన చంద్రబాబు తనపై కేసులు పెడతామని కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు దీటుగా జవాబిచ్చారు. "రేపల్లె నియోజకవర్గంలోని మోర్లవారిపాలెంలో గీత కార్మికులు పడుతున్న కష్టాలు కన్నీళ్లు తెప్పించాయి. మొక్కజొన్న, మినుము, పెసర పంటలకు ఒక తడి నీళ్లు ఇవ్వకపోతే అవి ఎండిపోయే స్థితికి చేరుకున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాటవరసకు రైతులు వ్యవసాయానికి ఉపయోగించే కొడవలితో రోడ్డెక్కి నిరసన తెలియజేయమన్నాను. దానికి నేనేదో రెచ్చగొడుతున్నట్లు కాంగ్రెస్ నాయకులు గొంతు చించుకుంటున్నారు'' అని చంద్రబాబు ఆక్షేపించారు.

తొమ్మిదేళ్ల కాంగ్రెస్ రాక్షస పాలనలో కరెంటు లేక, సాగునీరు విడుదల కాక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా పశ్చిమ డెల్టాలో ఒక్క తడి నీళ్లు ఇస్తే ఆరుతడి పంటలు చేతికొచ్చి రైతులు గట్టెక్కే పరిస్థితి ఉంటుందన్నారు. సాగునీటి కోసం ప్రజలు తిరుగుబాటు చేయాలని తాను పిలుపునిస్తే రైతులకు మేలు చేయడం చేతగాని కాంగ్రెస్ పార్టీ తాను రెచ్చగొడుతున్నట్లు పేర్కొంటోందన్నారు. ఇది రెచ్చగొట్టడం కాదని, రైతు కడుపు మంట చెబుతున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినా తాను భయపడబోనని, రైతుల కోసం తాను ఏమైపోయినా ఫర్వాలేదని తేల్చిచెప్పారు. ఉగ్ర దాడిపై హెచ్చరికలు వచ్చినా నిర్లక్ష్యం చేసిన సీఎం కిరణ్‌పై ఏ కేసు పెడతారని చంద్రబాబు ప్రశ్నించారు.

బసవతారకం స్వగ్రామంలో...
టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత ఎన్టీఆర్ సతీమణి బసవతారకం స్వగ్రామం లో చంద్రబాబు పాదయాత్ర చేయనున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా అందులో పాల్గొంటారని సమాచారం. కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గంలోని కొమరవోలు గ్రామం చంద్రబాబు రెండో విడత యాత్రా మార్గంలో వస్తోంది. పామర్రు నుంచి గుడివాడ వెళ్లే దారిలో ఈ గ్రామం ఉంది. షెడ్యూలులో మార్పులేమీ లేకపోతే మార్చి 4న ఈ గ్రామం మీదుగా ఆయన వెళ్తారని టీడీపీ వర్గాలు వెల్లడించాయి.

బాబు వ్యాఖ్యలపై ఫిర్యాదు

హింసను ప్రేరేపించే విధంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీసీసీ మీడియా అధికార ప్రతినిధి ఎండీ హిదాయత్‌తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు సోమవారం పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లాలో వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా పేటేరు సభలో చంద్రబాబు "రైతులు, కత్తులు, కొడవళ్లతో... గీత కార్మికులు మోకులతో రోడ్డెక్కి తిరగబడాలి. రైతులను ఈ పరిస్థితికి తీసుకొచ్చిన కాంగ్రెస్‌ను చంపాలి'' అంటూ హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నేతలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.