February 25, 2013

పరుల మేలు కోసం తలో చేయి!

సొంత లాభం కొంత మానుకొని పరుల మేల్ తలపెట్టవోయ్.. అన్నారు గురజాడ. ఆ మహాకవి స్ఫూర్తిని అందిపుచ్చుకున్నదా అన్నట్టు ఉంది ఆ గ్రామం. సంపాదనలోనే కాదు.. సంస్కారంలోనూ ముందుగా నల్లూరిపాలెం పేరు చెప్పాల్సిందే. తింటే నేల పాలు.. పంచితే పరుల పాలు అన్నట్టు..తమకు ఉన్నంతలో ఊరి బాగు కోసం గ్రామస్తులు ఆలోచిస్తున్నారు. వాళ్ల ఆలోచన వికసించడానికి దోహదపడిన అనేకానేక విషయాల్లో నాకూ భాగం ఉండటం సంతృప్తినిచ్చింది. ఇప్పుడు ఇది ఆదర్శగ్రామం.

ఆ విషయం ఊళ్లో అడుగుపెట్టగానే అర్థమయిపోతుంది. డ్రైనేజీ వ్యవస్థ నుంచి కొళాయి సదుపాయం దాకా.. ప్రతిదాన్నీ సొంత చైతన్యంతో సమకూర్చుకున్నారు. మెజారిటీ ఉన్నత విద్యావంతులే. అంతేకాదు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలో పెద్ద హోదాల్లో ఉన్నారు. ఏనాడూ మాకిది కావాలని చెయ్యి చాపిన చరిత్ర కనిపించదు. కుటుంబ సమస్యల నుంచి ఊరి సమస్యల వరకు, తలా చెయ్యి వేయడమే వారికి తెలుసు. అలాంటి ఊరికి ఊతం ఇవ్వడానికి సర్కారుకు చేతులెందుకు రావో!

ఎంత విచిత్రం..! నల్లూరిపాలేన్ని చూసిన కళ్లతో అరవపల్లిని చూసినప్పుడు కలిగిన భావన ఇది. ఊరూవాడా సమస్యల్లోనే ఉంది. మాదిగవాడలో రోడ్డు కొట్టుకుపోయి రాళ్లుపైకి తేలితే.. కాపుల బజారులో డ్రైనేజీ లీకయి ఇళ్ల ముందుదాకా మురుగు కాలువ ప్రవాహాలే. చిన్నపాటి వర్షాలకు కూడా గ్రామాలు గోదారులవుతున్నాయట.. అదేసమయంలో మంచినీళ్ల కోసం బిందెల పోరూ తప్పడం లేదట. ఎంత విచిత్రమిది! ఊళ్లో పడిన చినుకుని వడిచి పట్టుకొనే సమగ్ర వ్యవస్థ, వ్యూహమేది? ఇంకుడుగుంతల వ్యవస్థ గురించి ఊరిజనం గుర్తు చేశారు. ఈ మాత్రం జ్ఞానం, జ్ఞాపకం హైదరాబాద్‌లో కూర్చున్న మహానుభావులకుంటే పల్లెలిలా వెల్లకిలా పడేవి కావు కదా!