February 25, 2013

రేపల్లెలో బాబుకు నీరాజనం

వస్తున్నా మీ కోసం యాత్రలో భాగంగా రేపల్లె వచ్చిన చంద్రబాబుకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇసుకపల్లి నుండి రేపల్లెలో ఏర్పాటు చేసిన సభకు వరకు బారులు తీరి స్వాగతించారు. పోటెత్తిన జనానికి అభివాదం చేస్తూ రెండు కిలోమీటర్ల మేర ముందుకు సాగడానికి బాబుకు రెండు గంటల సమయం పట్టింది. పెద్ద సంఖ్యలో మహిళలు తమ అభిమాన నేతను తిలకించేందుకు, వారి కష్టాలు చెప్పుకునేందుకు, మనస్సును తేలిక పరుచుకునేందుకు, సాయం పొందేందుకు రహదారి వెంట వేచిచూశారు.

ఆయన రాక వారి కళ్లలో కొత్త వెలుగులు తెచ్చింది. వారిని పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ బాబు ముందుకు సాగారు. ఈ సమయంలో కొందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి కొందరు అమాంతం బాబు పాదాలపై పడి తమను గట్టెక్కించాలని వేడుకున్నారు. తమ కుటుంబంలో ఒక్కడు అనుకుంటూ వారి బాధలు వెళ్లబోసుకున్నారు. అలాంటి అభాగ్యులందరికీ అండగా తానున్నానని, భరోసా ఇస్తూ బాబు సభా స్థలికి చేరుకున్నారు.

నగరంలోని ప్రకాశం రోడ్డులో ఉన్న నెహ్రూ విగ్రహం వద్ద ప్రజలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు. వారి కష్టసుఖాలు గుర్తు చేస్తూ ఉపన్యసించారు. అసమర్థ కాంగ్రెస్ వల్ల, ఆ పార్టీ నాయకుల అవినీతి వల్ల ప్రజల జీవితాలు కష్టాల్లోకి నెట్టబడ్డాయని పేర్కొన్నారు. ప్రజలకు అండగా ఉండే నాయకులు, ప్రజల మనుషులు ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటారని అందుకు రేపల్లె టిడిపి ఇన్‌ఛార్జి అనగాని సత్యప్రసాదే నిదర్శనమన్నారు. ఆయన మీకు అండగా ఇప్పుడు ఇక్కడే ఉన్నాడన్నారు. మీకు అండగా ఉంటానని మాట ఇచ్చి, ఎన్నికల్లో గెలిచి, మంత్రి పదవి పొంది, వాన్‌పిక్ భూముల కేటాయింపు ద్వారా ప్రజల సొమ్మును దిగమింగిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ అందరికీ తెలుసునని అన్నారు.

ప్రజలకు అండగా ఉంటూ సేవ చేసే మనిషిని గుర్తించి అలాంటి వారికి అధికారం కల్పించాలని కోరారు. తెలుగు దేశం హయాంలోనే పులిగడ్డపెనుమూడి వారథి నిర్మాణం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. దీని వల్ల కలిగే ప్రయోజనాన్ని వివరించారు. ఇప్పుడు తాను ఆ వంతెన మీద గుండా కృష్ణాజిల్లాలోకి ప్రవేశించడం సంతోషంగా ఉందన్నారు. ఇదో చారిత్రాత్మక సంఘటనగా అభివర్ణించారు. అదే విధంగా రేపల్లె సైకిల్‌ను అసెంబ్లీకి పంపితే ఇప్పుడున్న సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

ప్రజలు విన్నవించిన తెనాలిరేపల్లె రోడ్ డబుల్ లైన్‌గా విస్తరణ, రైల్వే స్టేషన్ విద్యుతీకరణ, అర్హులైన వారికి ఇళ్ల స్థలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం, 24 గంటల పాటు విద్యుత్, తాగు నీటి సౌకర్యాలు కల్పిస్తానన్నారు. అదే మాదిరి మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా చూస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు దాసరి నాగరాజు, పంతాని మురళీధర్, జీవి నాగేశ్వరరావు, కె.రమాశాంతాదేవి, దున్నా జయప్రద, మేకా పూర్ణచంద్రరావు, కేసన వాసు, మాగంటి సాంబశివరావు, జీపి రామారావు, మద్రాసు సాంబశివరావు, అనగాని శ్రీనివాసమూర్తి, వేములపల్లి సుబ్బారావు, డాక్టర్ పూర్ణానంద్, డాక్టర్ ప్రభాకర్‌రావు, ఆలూరి డానియేల్, గుర్రం మురహరిరావు, బెల్లంకొండ చిట్టిబాబు, మండవ తాతాజీ, వెంకటేశ్వరరావు, షేక్ ఖాదర్ బాషా, పరుచూరి రవిబాబు, తాతా ఏడుకొండలు, మాన్యం శివమ్మ, దాసరి కృష్ణకుమారి, గోగినేని శ్రీనివాసరావుపాల్గొన్నారు.