February 25, 2013

ఖబడ్దార్..

రైతులు, గీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై చంద్రబాబు కన్నెర్ర చేశారు. డెల్టా రైతాంగానికి సాగునీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రభుత్వాన్ని కబడ్దార్... అంటూ హెచ్చరించారు. రైతు, చేనేత, గీత కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని..ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్‌పై తిరగబడాలని పిలుపునిచ్చారు. రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు, మోర్లవారిపాలెం, బేతపూడిలో చేనేత, గీత కార్మికుల కష్టాలను చూసి చలించిన చంద్రబాబు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆపార్టీని భూస్థాపితం చేయాలంటూ పిలుపిచ్చారు.

రేపల్లె నియోజకవర్గంలోని పేటేరు నుంచి చంద్రబాబు ఆదివారం పాదయాత్రను కొనసాగించారు. పేటేరు, మోర్లవారిపాలెంలో నేత, కల్లుగీత కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను విని చలించిపోయారు. కాంగ్రెస్ నాయకులు దుర్మార్గులని, ఎవడబ్బ సొమ్మని వైఎస్ తన కుమారుడు జగన్‌కు రూ. లక్ష కోట్లు దోచి పెట్టాడని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వాన్‌పిక్ పేరుతో పేదల భూములను కారుచౌకగా ఎకరం రూ. లక్షకు బలవంతంగా లాక్కొని అవే భూములను నేడు రూ. 30 లక్షలకు విక్రయించే పరిస్థితికి వచ్చారన్నారు. రేపటి రోజున వాటి ధర రూ. కోటికి చేరుతుందన్నారు.

కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ దొంగలు బాధితులకు వచ్చిన సాయాన్ని దోచేశారని ఆరోపించారు. ప్రజలు చైతన్యవంతులు కాకపోతే ఆడబిడ్డల నెత్తిన ఉన్న శిరోజాలు కూడా లేకుండా చేస్తారని హెచ్చరించారు. మీరు మోపిదేవి వెంకటరమణను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన మంత్రి అయి వాన్‌పిక్‌లో అక్రమాలకు పాల్పడి చంచల్‌గూడ జైలుకు వెళ్ళాడని, అదే తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్ ప్రజల మధ్యన ఉన్నాడు. రెండు పార్టీల మధ్యన తేడాని గమనించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు

పేదలకు కిలో రూపాయి బియ్యం అమలు చేయాలని, అలా కాకుండా నగదు బదిలీ పథకం కింద రూ. 13 ఇస్తామంటే కుదరదన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రేషన్‌కార్డుదారులందరికీ బియ్యమే ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ 'కసాయి' నమ్మారు 'గొర్రె ఎప్పుడూ కసాయి వాడినే నమ్ముతుంది. వాడే తన ప్రాణాలను బలిగొంటాడని దానికి ఏమాత్రం తెలియదు. అలానే మీరు తొమ్మిదేళ్లుగా కాంగ్రెస్ పార్టీని నమ్మి బలైపోతున్నారని' చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మీరు దొంగల చేతికి తాళాలిచ్చారు. నా చేతిలో ఏమి లేదు. ఎన్నికల ఒక్క రోజున నన్ను గుర్తు పెట్టుకొంటే ఐదేళ్లు మీ బాగోగులు చూసుకొంటానని హామీ ఇచ్చారు.

ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ స్తంభింప చేస్తాం రబీలో ఆరుతడి పంటలు వేసిన రైతాంగానికి భగవంతుడు దయతలచి అకాలవర్షం రూపంలో ఒక తడి ఇచ్చాడు. ఇప్పుడు మరో తడి కావాలి. అది కనక ప్రభుత్వం ఇవ్వకపోతే కబడ్దార్..అంటూ హెచ్చరించారు. లేకుంటే ఎక్కడికక్కడ పరిపాలనను స్తంభింప చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

బాబుతో స్వరం కలిపిన ప్రజలు ప్రభుత్వం పెడుతోన్న కష్టాలతో విసిగి వేసారిపోయామని పేటేరు, మోర్లవారిపాలెంలో పలువురు చంద్రబాబు స్వరానికి జత కలిపారు. 'పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అంటూ ప్రభుత్వం మమ్మల్ని నిలువునా మోసం చేసింది. రూ. లక్ష అప్పు తీసుకొంటే రూ. మూడు లక్షలు కట్టాల్సి వస్తోంది. ఇదేనా వడ్డీ లేని రుణాలంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగారం తిరిగి ఇప్పిస్తామన్న హామీకి విశేష స్పందన వ్యవసాయం కోసం బ్యాంకుల్లో ఆడబిడ్డల బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ల రుణాలను మాఫీ చేస్తానని చంద్రబాబు ఇస్తోన్న హామీకి జిల్లా ప్రజానీకం నుంచి విశేష స్పందన కనిపిస్తోంది. చాలామంది మహిళలు బంగారు నానుతాడు, గొలుసు వంటి ఆభరణాలను తాకట్టు పెట్టి రుణాలు తెచ్చుకొన్నారు. దాంతో వారు మెడలో పసుపుతాడు, కొమ్ము ధరిస్తున్నారు. పాదయాత్రలో ఈ విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఒక అన్నగా, తమ్ముడిగా ఆడవాళ్ల మెడలను తిరిగి బంగారు నగలతో నింపుతానని ఇస్తోన్న హామీకి మహిళలు నీరాజనాలు పడుతున్నారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబు, యరపతినేని శ్రీనివాసరావు, మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, జేఆర్ పుష్పరాజ్, రేపల్లె ఇన్‌చార్జ్ అనగాని సత్యప్రసాద్, పార్టీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, తెనాలి శ్రావణ్‌కుమార్, నిమ్మకాయల రాజనారాయణ, కందుకూరి వీరయ్య, వేములపల్లి శ్రీరామ్‌ప్రసాద్, ముత్తినేని రాజేష్, ములకా సత్యవాణి తదితరులు నడిచారు.