February 17, 2013

నిజాం సుగర్స్ వ్యవహారంలో 'నార్కో'కు సిద్ధం: టీడీపీ

  టీడీపీ హయాంలో నిజాం సుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారం పారదర్శకంగా జరిగింది. దీనిని నిరూపించేందుకు నార్కో పరీక్షకైనా నేను సిద్ధం. నిన్న మొన్నటి దాకా రాష్ట్రాన్ని పాలించింది మీరే. మీరు చేసిన పాపాలు మాపై ఎందుకు రుద్దుతారు? దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమేనా? ' అంటూ జగన్ పార్టీ నేతలను టీడీపీ ఉపాధ్యక్షుడు పెద్దిరెడ్డి సవాల్ విసిరారు. శనివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నిజాం సుగర్స్ అమ్మకం వ్యవహారంలో టీడీపీ హయాంలో ఏం జరిగిందో...వైఎస్ హయాంలో ఏం జరిగిందో బహిరంగంగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చేతనైతే జగన్ పార్టీ నేతలు ముందుకు రావాలని ఆయన సవాల్ విసిరారు.

ఈ సంస్ధలో వాటాలు కొనుక్కొన్న గోకరాజు రంగరాజు ఆనాటి టీడీపీ ప్రభుత్వంలో ఎవరికైనా ముడుపులు ఇచ్చారేమో తెలుసుకోవడానికి ఆయనకు నార్కో పరీక్ష చేయించాలని, నాడు మంత్రిగా పనిచేసిన తనకూ ఆ పరీక్ష చేస్తానన్నా సిద్ధమేనని ఆయన ప్రకటించారు. దీని సేల్ డీడ్ లావాదేవీలను ఆ తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వమే పూర్తి చేసిందని, ఇందులో ఏదైనా తప్పు జరిగింద నుకొంటే ఎందుకు సేల్ డీడ్ చేశారని ప్రశ్నించారు. 'ఆ పాలేరు సుగర్స్‌ను కూడా బహిరంగ వేలంలోనే అధిక ధర కోట్ చేసిన మధుకాన్ కంపెనీకి ఇచ్చామని, అప్పటికి ఆ కంపెనీ యజమాని నామా నాగేశ్వరరావు టీడీపీలో లేరని ఆయన చెప్పారు.