February 17, 2013

ఈ సీఎంకు ఏమీ చేతకాదు

రుణమాఫీ చేసి చూపిస్తా!
కేంద్రంలో వచ్చేది మా మద్దతున్న సర్కారే
అప్పుడు డిమాండ్ చేసి పనులు చేయించుకుంటా
సిలెండర్ ధరలూ దించుతా
గుంటూరు పాదయాత్రలో మహిళలకు బాబు వరం

రుణమాఫీపై మరోసారి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. " ఏ పథకం నిలిపివేసి రుణమాఫీ పథకం అమలు చేస్తా''రన్న కిరణ్ ప్రశ్నపై టీడీపీ అధినేత దీటుగా స్పందించారు. ఈ చేతగానీ సీఎంకు రుణమాఫీ చేసి చూపిస్తానని దీటుగా జవాబు ఇచ్చారు. "ఈసారి మా మద్దతు ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు ఢిల్లీని డిమాండ్ చేసి.. రుణమాఫీ పథకం సాధిస్తా. అలాగే రాష్ట్రానికి అవసరమైన పనులూ చేయించుకుంటా''నని వెల్లడించారు. రైతుకు ఇచ్చిన మాటను నిలుపుకొని తీరతానని పునరుద్ఘాటించారు. ఆదివారం మధ్యాహ్నం గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చినరావూరు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. జగడిగుంటపాలెం, పెదరావూరు మీదుగా కూచిపూడి చేరుకొని రాత్రి బస చేశారు.

ప్రజలను కలుసుకున్నప్పుడు, పెదరావూరు బహిరంగ సభలోనూ సీఎం కిరణ్‌పై నేరుగా విరుచుకుపడ్డారు "ఈ సీఎంకి పరిపాలనేమి తెలుసు? నా పరిపాలన తీరును అధ్యయనం చేసేందుకు నాడు బిల్ క్లింటన్ వారి దేశ గవర్నర్లను పంపించారు. దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టుకోవాలన్న యావతో కిరణ్ సాగుతున్నారు. ఇద్దరు తమ్ముళ్లతో దుకాణం తెరిచారు. నీలం తుపాను వస్తే ఇప్పటివరకు రైతాంగానికి సాయం అందించలేదు. తొమ్మిదిన్నర ఏళ్ల పాటు కుటుంబాన్ని కూడా వదిలేసి ర్రాష్టాభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమించాను. ఈ రోజున కుక్కల చింపిన విస్తరిలా మారిపోవడంతో మీకంటే ఎక్కువ నాకు భాదేస్తోంది'' అని భావోద్వేగంతో పలికారు. అకాలవర్షంతో మిర్చి రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలిందని బాధితులు వాపోతుంటే వారిని ఓదార్చుతూ ముందుకు సాగారు. "కాంగ్రెస్ హయాంలో రైతులు రెండు విధాలుగా దెబ్బతింటున్నారు. ఒకవైపు పంటలు సాగు చేసుకొనేందుకు ప్రభుత్వం కాలువలకు నీళ్లు ఇవ్వకుండా కన్నీరు పెట్టిస్తుంది.

మరోవైపు ప్రకృతి వైపరీత్యాలు ముప్పేట దాడి చేస్తూ కోలుకోకుండా చేస్తున్నాయ''ని ఆవేదన వ్యక్తం చేశారు. గజదొంగలు, దోపిడి దొంగలను ప్రజల్లోకి వదిలిన కాంగ్రెస్, వైసీపీలను చిత్తుచిత్తు చేయాలని పిలుపునిచ్చారు. తమ పార్టీకి 42 మంది ఎంపీలను అందిస్తే ఢిల్లీలో చక్రం తిప్పి మహిళల కష్టాలు తీరుస్తానని హామీఇచ్చారు. ఏడు వేలుగా ఉన్న కొత్త కనెక్షన్‌ను ఉచితంగా అందిస్తానని, సిలెండర్ ధరను కూడా తగ్గిస్తానని వాగ్దానం చేశారు. అలాగే.. ఆధునిక పనిముట్లు, మగ్గాలు ఇప్పించి చేనేత వృత్తిని లాభసాటి చేస్తామని చేనేతలకు భరోసా ఇచ్చారు. బీసీ-బీలో ఉన్న సగర కులాలను ఎస్‌టీల్లోకి చేర్చి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

రుణ మాఫీపై పట్టుబడదాం: టీడీపీ ఎంపీల వ్యూహాం
హైదరాబాద్ : రైతుల రుణాలను మాఫీ చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీడీపీ నిర్ణయించింది. దీనిపై పార్లమెంటు సమావేశాల్లో ఒకరోజుపాటు సభని స్థంభింపచేసి, ఆ వైపుగా కేంద్రం నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలని ఆదివారం గుంటూరులో జరిగిన టీడీపీ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా రైతుల రుణాలను మాఫీ చేసేలా కేంద్రంపై పోరాడాలని, ఈ విషయంలో కలిసి వచ్చే భావసారుప్యంగల పార్టీలతో సమన్వయం చేసుకోవాలని అభిప్రాయపడ్డారు. కరువు, ఇటీవల కురిసిన అకాల వర్షాల వల్ల పీకల్లోతూ అప్పుల్లో కూరుకుపోయిన రైతులు గత్యంతరంలేక రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయాన్ని పార్లమెంటుల్లో ప్రస్తావించాలని సమావేశంలో నిర్ణయించారు. ఇదిలాఉండగా, ఆరోగ్యాన్ని దృష్టిలో పాదయాత్రని కుదించు కోవాలని చంద్రబాబుకు ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అయితే, శ్రీకాకుళం జిల్లా వరకు తన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.