February 17, 2013

జోరువానలో జనయాత్ర

జోరు వానలో చంద్రబాబు పాదయాత్ర హోరెత్తుతూ కొనసాగింది. కుండపోత వర్షం కురుస్తున్నా తెనాలి పుర వీధులు జనసంద్రమయ్యాయి. వర్షంలోనే తడుస్తూ అలుపెరగని పాదచారి రాక కోసం భారీ సంఖ్యలో ప్రజలు ఎదురు చూశారు. తమ అభిమాన నేతకు అభివాదాలు చేస్తూ, సమస్యలు విన్నవిస్తూ, దీవెనలు అందజేస్తూ ముందుకు సాగనంపారు. శనివారం తెనాలి నియోజకవర్గంలోని అంగలకుదురు, తెనాలి పట్టణాల్లో కొనసాగిన చంద్రబాబు పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు.జిల్లాలో పదో రోజు పాదయాత్రను శనివారం ఉదయం అంగలకుదురు గ్రామం శివారు నుంచి చంద్రబాబు ప్రారంభించారు.

తన రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర అధిగమించిన గుర్తుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ నేతృత్వంలో దాతల సహకారంతో నిర్మాణం తలపెట్టిన ఎన్‌టీఆర్ కిసాన్ భవన్‌కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండు వేల కిలోమీటర్ల పాదయాత్ర, కిసాన్‌భవన్‌ల శిలాఫలకాలను ఆవిష్కరించారు. అనంతరం స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. సాగునీరు లేక కృష్ణా డెల్టా సర్వనాశనం అయిందన్న ఈదర పూర్ణచంద్రరావు అనే రైతు చేసిన వ్యాఖ్యపై చంద్రబాబు స్పందిస్తూ కాలువల్లో రైతుల కన్నీళ్లు పారుతున్నాయన్నారు.

డెల్టాలో మొక్కజొన్న, పసుపు రెండో పంటగా పండిస్తేనే రైతులు నిలదొక్కుకోగలుగుతారని, అయితే ప్రభుత్వం సాగునీరు ఇవ్వకుండా వేధిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో తాను సోమవారం పాదయాత్ర ఎక్కడికి చేరుకొంటే అక్కడే మహాధర్నాకు దిగనున్నట్లు ఇప్పటికే ప్రకటించానని చెప్పారు. ఇప్పటికే తమ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను నివేదించారని, అలానే హైదరాబాద్‌లో మరో ఎమ్మెల్యేల బృందం గవర్నర్‌ను కలిసి డెల్టా, సాగర్ కాల్వలకు నీరు విడుదల చేసి పంటలను ఆదుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుందన్నారు.

నాగార్జునసాగర్‌లో 490 అడుగులు నీటిమట్టం ఉంటనే మేము సమర్థవంతగా సాగు నీరు ఇచ్చాం. కలెక్టర్, ఎస్‌పీలను కాలువల మీద పెట్టి చివరి భూముల వరకు సాగునీరు వెళ్లేలా చేశాం. ఈ రోజున సాగర్‌లో 515 అడుగులున్నా నీళ్లు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం వరకు చూసి సోమవారం ఉదయం జిల్లా రైతులతో మహాధర్నాకు దిగుతానని స్పష్టం చేశారు. అంగలకుదురు నుంచి పాదయాత్రగా తెనాలికి వెళుతుండగా అనుకోని అతిథి రూపంలో వర్షం ఎదురైంది. దాంతో చంద్రబాబు రోడ్డు పక్కన ఉన్న ఒక పూరిగుడిసెలోకి వెళ్లారు.

వర్షం వెలిసిన తర్వాత తిరిగి నడక ప్రారంభించి మార్గమధ్యలోని జేఎంజే కళాశాల విద్యార్థినులు, అధ్యాపకులతో చంద్రబాబు సంభాషించారు. వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకొన్నారు. మగవాళ్లకు తీసిపోకుండా ఆడపిల్లలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే బాధ్యతను తాను తీసుకొంటానని హామీ ఇచ్చారు. విద్యార్థినులు టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని, విద్యే కాకుండా విలువలూ అవసరమని స్పష్టం చేశారు.

స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ అమలు చేసి పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేలా చేస్తానన్నారు. టీడీపీ హయాంలో విద్యార్థినులను ఎవరైనా ఈవ్‌టీజింగ్ చేయాలంటే భయపడేవారు. రౌడీలు రాష్ట్రం విడిచిపోయేలా చేశాం. ఎవరైనా తప్పు చేస్తే వాళ్లకు చెయ్యాల్సింది చేసేవాళ్లం. నేడు అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. తమ పాలనకు, కాంగ్రెస్ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని గమనించాలని చంద్రబాబు సూచించారు.

జేఎంజే కళాశాల విద్యార్థినులతో సంభాషణ అనంతరం మధ్యాహ్నం విశ్రాంతి తీసుకొన్న చంద్రబాబు తిరిగి పాదయాత్రను ప్రారంభించగా వర్షం మరోసారి ఎదురైంది. ఉదయం 10 నిమిషాల పాటు కురిసిన వాన సాయంత్రం జోరున గంటకు పైగా కురిసింది. అయినాసరే చంద్రబాబు పాదయాత్రను నిలిపేయకుండా గొడుగు సాయంతో ముందుకు కదిలారు. భారీ వర్షం కారణంగా రోడ్లపైకి అడుగు లోతులో వరదనీరు చేరినా చంద్రబాబు లెక్క చేయకుండా చెంచుపేట, రెండు రైల్వేగేట్ల రోడ్డు మీదుగా తెనాలి మునిసిపల్ కార్యాలయ సెంటర్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. చంద్రబాబుకు దారి పొడవునా మహిళలు నీరాజనాలు పలికారు.

చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లు అనగాని సత్యప్రసాద్, తెనాలి శ్రావణ్‌కుమార్, కందుకూరి వీరయ్య, నిమ్మకాయల రాజనారాయణ, చీరాల గోవర్థన్‌రెడ్డి, పార్టీ నాయకులు ముమ్మనేని వెంకట సుబ్బయ్య, పెదకూరపాడు బుజ్జీ, ముమ్మనేని వెంకట సుబ్బయ్య తదితరులు నడిచారు.