January 1, 2013

గులాబీ అధినేతపై చంద్రబాబు ఫైర్



కేసీఆర్.. ఖబడ్దార్
అడ్డంకులు సృష్టిస్తే మీకు, మీ పార్టీకి క్షేమం కాదు
సొంత ప్రయోజనాలకే పార్టీ పెట్టావు
అఖిలపక్షంతోనే మా చిత్తశుద్ధి తేలింది
దాని వల్లే మీ గుండెల్లో రైళ్లు

గులాబీ అధిపతి కేసీఆర్‌పై చంద్రబాబు నేరుగా చెలరేగిపోయారు. అఖిలపక్ష భేటీ అనంతర పరిణామాల్లో తనను, తన పార్టీని దుయ్యబడుతున్న గులాబీ దండుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వరంగల్ జిల్లాలో మూడో రోజు పాదయాత్రలో భాగంగా పరకాలలో జరిగిన సభలో రాజకీయ ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు. "అడ్డంకులు సృష్టిస్తే ఊరుకునేది లేదు. అది మీకు, మీ పార్టీకి క్షేమం కాద''ని హెచ్చరిస్తున్నాం.

అఖిలపక్షంలో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినా, సిగ్గులేకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని దుయ్యబట్టారు. వైఖరిని చెప్పుకోవడం తప్పేమీ కాదని,దాని కోసం తన పాదయాత్రను దెబ్బతీయాలని చూస్తే మాత్రం సహించేది లేదని తీవ్ర స్వరంతో అన్నారు. " తెలంగాణకు అనుకూలంగా మేం లేఖ ఇవ్వడంతో టీఆర్ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తెలంగాణలో ఉనికిని కోల్పోతామని భయపడుతోంది. అందుకే పాదయాత్రలో అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నిస్తోంది'' అని విమర్శించారు. పెత్తందార్లు, భూస్వాముల పార్టీగా టీఆర్ఎస్‌ను దుయ్యబట్టారు. సిద్ధాం తాలను వదిలేసి చిల్లర పార్టీగా కొనసాగుతుందని మండిపడ్డారు.

మరోవైపు కిరణ్ సర్కారు విద్యుత్ విధానాన్నీ పాదయాత్రల్లో చంద్రబాబు ఎండగట్టారు. విద్యుత్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిన పాపం కాంగ్రెస్ పార్టీదేనని విమర్శించారు. అంతకుముందు.. వరంగల్ జిల్లా ఇస్సిపేట వద్ద ఆయన సోమవారం పాదయాత్ర ప్రారంభించారు. రంగాపురం, నాగారం గ్రామాల్లో ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

" రైతాంగానికి విద్యుత్ సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైంది. మా హయాంలో రైతులకు 20 వేల కోట్ల రూపాయల రాయితీ ప్రకటించాం. నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేశాం. దీనికి భిన్నంగా కిరణ్ ప్రభుత్వం..రైతాంగంపై రూ.6,500 కోట్ల సర్‌చార్జీలను మోపింది. ముఖ్యమంత్రి అసమర్థ విధానాలతో విద్యుత్ సరఫరా విధానం లోపభూయిష్టంగా మారింది. కరెంట్ బిల్లులు బలవంతంగా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఇంటి బిల్లు చెల్లించలేకపోతే వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నారు'' అని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగుదేశం హయాంలో రాష్ట్రం మొత్తం వెలుగులు నిండితే.. కాంగ్రెస్ ప్రభుత్వం దాన్నంతా అంధకారం చేసిందని విమర్శించారు. 18 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను తాము ఇస్తే.. కిరణ్ అసమర్థ ప్రభుత్వం 18గంటల నిరంతర సరఫరాను నిలిపివేసిందన్నారు. "ఈ ముఖ్యమంత్రి కరెంట్ పరిస్థితిపై సమీక్ష చేయడు. పోనీ సమీక్షించేందుకు విద్యుత్ శాఖకు మంత్రే లేడు. ఇక కరెంట్ సమస్యలు ఎట్లా తీరుతాయి?'' అని ప్రశ్నించారు. కొండా మురళి దంపతులపై వరసగా మూడో రోజు కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. "గ్రామానికొక కీచకుడు..నియోజక వర్గానికొక మాఫియా లీడరును వైఎస్ తన పాలనలో తయారుచేశారు.

పెంట్రోల్ బంకులూ వారికే..భార్యాభర్తలు మధ్య పంచాయితీ వస్తే, ఆ సెటిల్‌మెంట్లు వారే చేస్తారు. దేన్నీ వదిలిపెట్టరు' అంటూ నిప్పులుచెరిగారు. కాగా, పరకాల మండలం లక్ష్మీపురంలో కొందరు మహిళలు.. చంద్రబాబు సమక్షంలో జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చం ద్రబాబు రంగాపురంలో సభలో మాట్లాడిన తర్వాత లక్ష్మీపురం చేరుకున్నారు. గ్రామంలో చేనేత కార్మికుల మగ్గాలను పరిశీలించారు. పెరుక సంఘం వారిని కలుసుకున్నారు. వారితో మాట్లాడుతుండగా, రోడ్డు పక్కన కొందరు మహిళలు జై తెలంగాణ అంటూ నినాదాలు చేయడం మొదలుపెట్టారు. పోలీసులు వెంటనే రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు.

బాబు కాలికి గాయం
పరకాల మండలం నాగారంవద్ద చంద్రబాబు కాలువేలికి స్వల్ప గాయమైంది. నడుస్తుం డగా కాలుకు రాయి తగిలింది. నడక సౌకర్యం కోసం కాస్త కత్తించిన బూటుభాగాన్నే రాయి తాకడంతో అక్క డే కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఫిజియో థెరపిస్టుల చికిత్స అనంతరం యాత్ర సాగించారు.