January 1, 2013

టీఆర్ఎస్ నాయకులకు కాలం చెల్లింది





అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపై టీడీపీ స్పష్టమైన వైఖరిని ప్రకటించడంతో టీఆర్ఎస్్‌కు ఆ పార్టీ నాయకులకు కాలం చెల్లిందని గుర్తించి మా పార్టీపై, నాయకులపై బురుద చల్లుతున్నారని టీడీపీ స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని నాలుగు మండల పార్టీల అధ్యక్షులు మారబోయిన ఎల్లయ్య, హ్మనంతరావు, వంగ నాగరాజు, హుస్సెన్ నాయక్‌లు ధ్వజమెత్తారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2008లో ప్రణబ్‌ముఖర్జీకి ఇచ్చిన లేఖకు కట్టుబడి పార్టీలో తెలంగాణ వాదాన్ని ముందస్తు ఎత్తుకున్న కడియం శ్రీహరిని అఖిలపక్ష సమావేశానికి పంపడం అంటేనే టీడీపీ తెలంగాణ ఏర్పాటుకు కట్టుబడి ఉందన్నారు.

అఖిల పక్ష సమావేశానికి ఇద్దరు నేతలు వెళ్ళినప్పటికి ఒక్కటే అభిప్రాయాన్ని వె ళ్ళడించడంతో తెల్లమొఖం వేసిన కేసీఆర్ అసలు వారి వైఖరి ఏమిటో చెప్పని మజ్లీస్, కాంగ్రెస్‌ను నిలదీయకుండా టీడీపీని టార్గెట్ చేయడంలో కుట్ర ఉందన్నారు.

తొమ్మిదేళ్ళు అధికారంలో ఉండి జిల్లాతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కడియం శ్రీహరిని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్ శ్రేణులకు లేదన్నారు. 2008 పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్న మాఅధినేత చంద్రబాబును టీడీపీని విమర్శించే స్థాయి మీకు అంతకన్నా లేదన్నారు. ఇప్పటికైనా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై ఏ పార్టీకి చిత్తశుద్ధ్ది ఉందనే వాస్తవాలను గుర్తించి విమర్శిలు మానుకోవాలని లేదంటే పార్టీ, ప్రజలు టీఆర్ఎస్‌కు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి బూర్ల శంకర్, కొంతం శ్రీను, నీల గట్టయ్య, చింత భరత్‌కుమార్, ఉమ్మగోని నర్సయ్యగౌడ్, కునూరు రాజు, సముద్రాల అశోక్, సింగపురం రవి, మాజీ ఎంపీటీసీ యాకూబ్‌పాషా, బాలస్వామి, మల్లారెడ్డిపాల్గొన్నారు.