January 1, 2013

దూబగుంట రోశమ్మే ఆదర్శం!



రంగాపురం, లక్ష్మీపురం గ్రామాల మీదుగా వెళుతుండగా కొందరు మహిళలు ఎదురొచ్చారు. వారంతా సమీపంలోని పొలంలో పనిచేసుకుంటున్న కూలీలు. నేను వస్తున్నట్టు తెలుసుకొని చేతుల్లో పని వదిలేసి పరుగున రోడ్డుమీదకు వచ్చారు. చూస్తే ఒక్కరి ముఖంలో కూడా కళాకాంతీ లేవు. అదే అడిగాను.

" ఊళ్లోకి బెల్టు షాపులు వచ్చాక మా బతుకుల్లో అశాంతి తప్ప కాంతులేముంటాయి సారూ.. కాయకష్టం చేసి ఇంటికి కూలి డబ్బులు తీసుకెళితే, ఇంట్లోకి గంజికైనా ఉందా అని చూడకుండా మా మొగుళ్లు ఆ మాయదారి సారాకే తగలేస్తున్నారు'' అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈపరిస్థితిని ముందే గ్రహించి.. నేను బెల్టు షాపుల రద్దు నిర్ణయం తీసుకున్నాను. అదే విషయం చెబితే వాళ్లు కాస్త ఊరడిల్లారు. ప్రతి మహిళా దూబగుంట రోశమ్మను ఆదర్శంగా తీసుకోవాలని ధైర్యం చెప్పి ముందుకు కదిలాను.

రంగాపురంలో మిర్చి రైతులను చూస్తే నాకు ముచ్చటేసింది. రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్ తరహాలో బిందుసేద్యం చేయాలన్న నా ఆలోచన ఇప్పుడీ గ్రామంలో సాకారమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం నుంచి అరకొర సాయమే అందుతున్నా ఈ గ్రామంలోని రైతులు పట్టుదలతో ముందడుగు వేస్తున్నారు. శక్తిమేరకు ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్నారు. సాగునీరు తక్కువగా వాడి.. దిగుబడి ఎక్కువ తీయడానికి బిందు సేద్యం అనువైన పద్ధతి. సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాల అందుబాటు తక్కువగా ఉన్న చోట బిందు సేద్యం నిజంగా సాగుకు నైవేద్యమే.

ఈ పద్ధతిలో ఒక ఎకరాకు పట్టే నీటితో రెండు ఎకరాలను పండించవచ్చు. కాకపోతే పైపులు మార్చుకోవడమే సమస్య. ఈ కాస్త సాయం ప్రభుత్వం చేయాలనేది ఈ రైతుల డిమాండ్. కానీ, వినేదెవరు? మరికొందరు రైతులు మిరప చేలల్లోకి తీసుకెళ్లారు. తెగులు కారణంగా పాడైపోయిన పంటను చూపించారు. ఆ మొక్కలను పీకి.. సొంత బిడ్డే జబ్బు పడినట్టుగా గుండెలు బాదుకున్నారు. "మందూ లేదు.. మంచీచెడ్డ చూసే అధికారి కూడా లేడు సార్'' అని వాపోయారు. కష్టాల్లో ఉన్న రైతునే కాదు.. కష్టం చేస్తున్న రైతునూ పట్టించుకునే సంస్కారం ఈ సర్కారుకు ఎక్కడ?