January 4, 2013

జిల్లాకో పులివెందుల రౌడీ





రాజకీయాలను వైఎస్ కలుషితం చేసేశారు
పొట్టగొట్టే నగదు బదిలీని అమలు కానీయబోం
మహిళల పక్షపాతిగానే ఉంటా
వరంగల్ జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

"పులివెందుల రౌడీలతో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేశారు. తన పాలనలో అవినీతి, రౌడీయిజానికి పెద్ద పీట వేసి జిల్లాకి ఓ రౌడీ చొప్పున తయారు చేశారు'' అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. వరంగల్ జిల్లాలోనూ పులివెందుల రౌడీలతో హత్యా రాజకీయాలు చేశారంటూ కొండా మురళి దంపతులపై పరోక్షంగా నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో పాదయాత్రను కొనసాగించిన ఆయన, మహిళల పక్షపాతిగా తనను తాను ప్రకటించుకున్నారు.

వరంగల్ జిల్లా కొమ్మాల స్టేజీ వద్ద ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా చేసినట్టుగానే, వరంగల్ జిల్లాలోనూ వైఎస్..ఓ రౌడీ రాజకీయ నాయకుడిని పెంచి పోషించారని, కొల్లి ప్రతాపరెడ్డి లాంటి తెలుగుదేశం నాయకులు వారి చేతుల్లో దారుణ హత్యకు గురయ్యారని మండిపడ్డారు. ఇలాంటివారిని తయారు చేసి రాష్ట్రవ్యాప్తంగా ఇదే ఒరవడి కొనసాగించారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వైసీపీ.. తోక పార్టీ అని ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీలకు అవినీతి తప్ప,అభివృద్ధి అక్కరలేదని విమర్శించారు.

తండ్రిని అడ్డంపెట్టుకుని జగన్ లక్ష కోట్లు దోచేశారని దుయ్యబట్టారు. 2004 కంటే ముందు రాజశేఖరరెడ్డి కుటుంబం ఆస్తులతో ఇప్పటి వారి ఆస్తులను పోల్చితే ఎంతో దోపిడీ చేశారనేది అర్థం అవుతుందన్నారు. నగదు బదిలీ పేరుతో పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నగదు బదిలీని మగవాళ్ల ఖాతాలో జమ చేస్తున్నారని, ఇదే జరిగితే ఆ డబ్బు బెల్టు షాపుల్లో ఖర్చవుతుందని చెప్పారు. మరోవైపు పేద ప్రజలు గంజికి కూడా నోచుకోని స్థితి దాపరిస్తుందని ఆందోళన వ్యక్త ం చేశారు. ఇలాంటి పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దని కోరారు.

పేదల బతుకులను ఆగం చేస్తే టీడీపీ ఊరుకోబోదని హెచ్చరించారు. కిరణ్ ప్రభుత్వం రైతాంగాన్ని నిండా ముంచిందని మండిపడ్డారు. విత్తనాలు, ఎరువుల కొరత రైతాంగాన్ని తీవ్రంగా ఇబ్బందులపాలు చేసిందని, విద్యుత్ సమస్య మరింత సమస్యల్లోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్ చార్జి పేరుతో మరోసారి ప్రజల నెత్తిన బాంబు వేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని తెలిపారు.

పత్తికి రూ.5వేల నుంచి 6వేల రూపాయల మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రజలు చేసిన పొరపాటు వల్ల ఇప్పుడందరమూ ఫలితం అనుభవించాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. ఆయన మాట్లాడుతుండగా సభలో కొంతమంది యువకులు సెల్ ఫోన్‌లో మాట్లాడుతూ కనిపించారు. " తమ్ముళ్లూ..ఆ సెల్ తెచ్చిందీ నేనే'' అని ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించడం ద్వారా యువతకు ఉపాధి అవకాశాలను పెంచామన్నారు.