January 4, 2013

మన ఇంటి మాలక్ష్ములు



మా ఇంటి మహాలక్ష్మి! కూతురు కాదు.. ఇది మా అమ్మ! ఆడపిల్లను ఉద్దేశించి ఇలాంటి మాటలు దాదాపు ప్రతి ఇంట్లోనూ వింటూనే ఉంటాం! కానీ, వారి పట్ల వివక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది! గిర్నిబావి దాటిన తర్వాత ఓ ప్రైవేటు స్కూల్లోకి గురువారం అడుగు పెట్టాను. అక్కడ మొత్తం విద్యార్థులు 480! కానీ, వారిలో విద్యార్థినులు కేవలం 180 మాత్రమే! పాదయాత్రలో ఇలాంటి పాఠశాలలు చాలానే చూశాను. మెజారిటీ పాఠశాలల్లో ఆడ, మగ నిష్పత్తి దాదాపు ఇలాగే ఉంది. ఆడపిల్ల విషయంలో ఈ సమాజంలో ఎంత వివక్ష ఉందనడానికి ఇదే నిదర్శనం. పేదరికంతో మగ్గుతున్న కుటుంబాల్లో ఆడపిల్ల చదువుకు అస్సలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అదే సమయంలో, రాను రాను ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయి. ఇక, ఆడపిల్లల చదువు సాగేదెలా!?

ఇవే ఆలోచనలతో దస్రూనాయక్ తండా దిశగా అడుగులు వేస్తున్నాను. ఆ తండాకు చేరుకుంటున్న సమయంలో ఇంజనీరింగ్ విద్యార్థినులు ర్యాలీగా వచ్చి కలిశారు. ఢిల్లీ గ్యాంగ్‌రేప్ ఘటన నేపథ్యంలో తలపెట్టిన భారత్ బంద్‌లో భాగంగా వాళ్లంతా ర్యాలీ చేశారు. ఇంతటి కుగ్రామంలోనూ బంద్ ప్రభావం స్పష్టంగా కనిపించింది. వాళ్ల వెనక ఏ నాయకుడూ ఉండి నడిపించడం లేదు. స్వచ్ఛందంగానే చేయీ చేయీ కలిపి బంద్‌ను విజయవంతం చేశారు. వారిలో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశాను.

ఒకవైపు, చదువుకున్న విద్యార్థినుల్లో చైతన్యం! మరొకవైపు వారు చదువుకోనివ్వకుండా సవాలక్ష ఆటంకాలు! ఆడపిల్లలను సంరక్షించుకోవాలన్న ఉద్దేశంతో నా హయాంలో బాలికా సంరక్షణ పథకం పెట్టా. మగవారితో సమానంగా ఉద్యోగావకాశాలు కల్పించా. కానిస్టేబుళ్లు, కండక్టర్లుగా వారికి ప్రాధాన్యం ఇచ్చాను. వారు శారీరకంగా బలహీనులు కావచ్చు. కానీ, మానసికంగా శక్తిమంతులు. ఏదైనా సాధించగల తెలివితేటలు వారి సొంతం. అవకాశాలు కల్పిస్తే మగవారితో దీటుగా ప్రతిభ కనబరుస్తారు. నాయకులు చేయాల్సిందదే!!