January 4, 2013

చంద్రబాబు @1480 పాదయాత్రలో వైఎస్‌ను దాటిన బాబు



1468 కిలోమీటర్ల మైలురాయి బ్రేక్

90 రోజుల్లో 1480 కిలోమీటర్లు

మరో వెయ్యి కిలోమీటర్లు నడిచే అవకాశం

కింద పడినా వదల్లేదు. కాలు నొచ్చినా ఆగలేదు. షుగర్ పెరిగినా రాజీలేదు. అడుగు ముందుకు పడుతూనే ఉంది. రాష్ట్రంలో రాజకీయ పాదయాత్రల్లో కొత్త రికార్డు నమోదైంది. 54 ఏళ్ల వయసులో వైఎస్ 68 రోజులపాటు 1468 కిలోమీటర్లు నడిచిన రికార్డును... 63 సంవత్సరాల చంద్రబాబు బద్దలు కొట్టారు. 1480 కిలోమీటర్ల మార్కును దాటారు. ఆయన మరో వెయ్యి కిలోమీటర్లు నడిచే అవకాశముంది. అంటే... సమీప భవిష్యత్తులో బాబు రికార్డును ఎవరూ బద్దలు కొట్టలేరేమో!

హైదరాబాద్, జనవరి 3 : పాదయాత్ర...ప్రజల్లో కలిసిపోయేందుకు ఓ మార్గం! అధికార పీఠానికి దగ్గరయ్యేందుకు నేతలు ఎంచుకునే సాధనం! దాదాపు పాతికేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కోసం కలవరించి, పలవరించిన వైఎస్ రాజశేఖర రెడ్డి... పాదయాత్ర ద్వారానే తాను అనుకున్నది సాధించగలిగారు. చేవెళ్ల నుంచి ఇచ్ఛాపురం వరకు నడిచిన 1,468 కిలోమీటర్ల 'ప్రజా ప్రస్థానం' అప్పటికి 'న భూతో!'. ఇప్పుడు వైఎస్ రికార్డును చంద్రబాబు బద్దలు కొట్టారు.

వరుసగా రెండుసార్లు అధికారానికి దూరమై, రాష్ట్రంలో తీవ్ర రాజకీయ పోటీ ఎదుర్కొంటున్న చంద్రబాబు 'వస్తున్నా... మీకోసం' అంటూ నడక మొదలుపెట్టి 1480 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. అయితే, 1,468 కిలోమీటర్ల దూరాన్ని వైఎస్ 68 రోజుల్లోనే పూర్తి చేయగా, పాదయాత్రకు తోడు పార్టీ వ్యవహారాలూ చూడాల్సి రావడం, నడకలో గాయపడటం, నీలం తుపాను, సీనియర్ నేత ఎర్రన్నాయుడు దుర్మరణం వంటి కారణాలతో 90వ రోజుకు గానీ ఆ మైలురాయిని దాట లేకపోయారు. దస్రూనాయక్ తండా క్రాస్ వద్ద ఆయన వైఎస్‌ను దాటేశారు. దీనికి గుర్తుగా క్రాస్ వద్ద టీడీపీ కార్యకర్తలు స్థూపం నిర్మించారు.

వైఎస్ తన 54వ ఏట పాదయాత్ర చేపట్టగా... చంద్రబాబు 63ఏళ్ల వయసులో మొదలుపెట్టారు. ఇప్పటికే అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్) యాత్ర పూర్తిచేసి డిసెంబర్ 28వ తేదీనుంచి వరంగల్‌లో తిరుగుతున్నారు. యాత్ర ముగిసేనాటికి మరో తొమ్మిది జిల్లాల్లో ( ఖమ్మం, నల్లగొండ, గుంటూరు, కృష్ణ, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం) నడవనున్నారు. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలో యాత్రను ముగించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. నాటి వైఎస్ పాదయాత్రకు, నేటి చంద్రబాబు పాదయాత్రకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టీడీపీ నేత వైవీబీ రాజేంద్రప్రసాద్ హైదరాబాద్‌లో వ్యాఖ్యానించారు.