January 4, 2013

చిన్న లోపము లేకుండా సాగుతున్న యాత్ర



అడుగడునా.. పక్కా ప్లానింగ్
పాదయాత్రలో విజయవంతం వెనుక కఠోర క్రమశిక్షణ
నిర్వహణలో వందలాది మందికి భాగస్వామ్యం


పటిష్టమైన నిర్వహణ నైపుణ్యానికి నిజమైన నిదర్శనం అన్నట్టు చంద్రబాబు పాదయాత్ర అప్రతిహతంగా ముందుకు సాగుతోంది. పకడ్బందీ ప్లానింగ్ ఉంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా విజయవంతంగా నిర్వహించవచ్చుననడానికి బాబు నడక ఒక ప్రత్యక్ష ఉదాహరణ. పాదయాత్ర నిర్వహణ వెనుక ఉన్న వ్యూహం, లక్ష్యం ఏమైనా .. ఒక రాజకీయ పార్టీ ఎలాంటి ఒడుదొగుకులు లేకుండా, ఎక్కడా అంతరాయం కలుగకుండా గత 90 రోజులకుపైగా నిర్వహిస్తున్న పాదయాత్ర.. మేనేజ్‌మెంట్ విద్యార్థులకు ఒక పాఠం వంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రతి రోజు ఉదయం 11 గంటలకు మొదలవుతున్న యాత్ర రాత్రి సుమారు 11 గంటలకు ముగుస్తోంది. మధ్యలో గంటా రెండు గంటలు విరామం. బాబు రాత్రి బస ముందే నిర్ణయమైపోతుంది. ఆయన ప్రత్యేక బస్సులో బస చేస్తారు. దాని చుట్టూర ఐదారు గుడారాలు.. 30కిపైగా వాహనాలు.. యాత్ర నిర్వహణలో పాలుపంచుకునే 500మందికిపైగా సిబ్బంది.. వంద మందికిపైగా వలంటీర్లు..

మరో 300ల మందికిపైగా పోలీసులు.. రోప్ పార్టీ.. కమెండోలు.. సొంత రక్షణ సిబ్బంది.. బాబు వ్యక్తిగత సహాయకులు.. వైద్య సిబ్బంది.. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే రెస్క్యూ టీం.. ఇవి కాకుండా బాబును కలిసేందుకు, పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వచ్చే నాయకులు.. వారి వాహనాలు.. వీరందరి కోసం వంటవాళ్లు.. వంట సామాగ్రి... ఇంత పెద్ద వ్యవస్థ రోజూ బాబు వెంట సాగుతుంటుంది.

ఏర్పాట్లు ఒక ఎత్తు అయితే.. దీన్నంతా సమన్వయం చేయడం మరో ఎత్తు. పాదయాత్ర సజావుగా సాగడం వెనుక అనేక అంశాలు సమ్మిళితమై ఉన్నాయి. రవాణా, కమ్యునికేషన్ వ్యవస్థ ఏర్పాట్లు, భద్రత, సమయ పాలన, టీం వర్క్, మార్గదర్శనం, అవసరాల గుర్తింపు, సదా సన్నద్ధత, అన్నిటికీ మించి పార్టీ పట్ల, నాయకుడి పట్ల కార్యకర్తల్లో విధేయత. ఇవీ పాదయాత్రలో ప్రస్ఫుటంగా కనిపించే అంశాలు. టెంట్ల విషయాన్నే తీసుకుంటే బాబు బస చేసిన చోట నిముషాల్లో టెంట్లు వేయడం, తీయడం కనిపిస్తుంది. అస్సాంకు చెందిన ఐదుగురు కూలీలు ఇందులో పాలు పంచుకుంటున్నారు.

వంటలు పూర్తి చేసే బాధ్యతను స్థానిక నాయకులు, కార్యకర్తలే సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు క్షణాల మీద చేరవేయడానికి హైదరాబాద్‌లోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నిరంతరం సంబంధాలను కొనసాగిస్తోంది. బాబు తన ప్రసంగాల్లో ప్రస్తావించే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలనూ సమకూరుస్తోంది. ఇందుకు ఆధునాతనమైన కమ్యూనికేషన్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. బాబు ఏ మూలన ఉన్నా మాట్లాడేందుకు వీలుగా శాటిలైట్ వ్యవస్థ నిరంతరం అందుబాటులో ఉంటుంది.

పాదయాత్ర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా వలయాన్ని రూపొందించారు. జామర్, మైనింగ్ డిటెక్టర్ వాహనాలు, ప్రత్యేకమైన బుల్లెట్‌ప్రూఫ్ వాహనం, మరో అత్యవసర వాహనంతో పాటు మరికొన్ని ప్రత్యేక రక్షణ పరికరాలున్న వాహనాలు ఈ వ్యవస్థలో ఉన్నాయి.

బాబు ప్రసంగం స్పష్టంగా వినపడేలా డీజే సౌండ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. పాత్రికేయుల కోసం, కరెంట్‌కు ఇబ్బంది లేకుండా అధిక సామర్థ్యం కలిగిన జనరేటర్, లైటింగ్ వ్యవస్థను కూడా అందుబాటులో ఉంచుకున్నారు. "టీమ్ వర్క్ వల్లే వ్యవస్థలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయి. పార్టీ పట్ల, నాయకుడి పట్ల కార్యకర్తల్లో ఉన్న అపారమైన అభిమానం, గౌరవం, చిత్తశుద్ధి ఇందుకు కారణమ''ని పాదయాత్రను మొదటి నుంచి సమన్వయపరుస్తున్న టీడీపీ సీనియర్ నాయకుడు గరికపాటి మోహన్‌రావు అన్నారు.