January 9, 2013

వస్తున్నాడదిగో ...







'వస్తున్నా మీ కోసం' పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర మంగళవారం రాత్రి జిల్లాలోకి ప్రవేశించనుంది. జిల్లాలో ఏడురోజులపాటు చంద్రబాబు యాత్ర కొనసాగుతుంది. వరంగల్ జిల్లా మరిపెడ నుంచి మంగళవారం రాత్రి 9గంటలకు చంద్రబాబు తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం చేరుకుంటారు. జిల్లా సరిహద్దుల్లో పార్టీ అధినేతకు ఘనస్వాగతం పలికేందుకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఊకే అబ్బయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్సీలు పోట్ల నాగేశ్వరరావు, బాలసాని లక్ష్మినారాయణతోపాటు జిల్లాకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేశారు. అనంతరం చంద్రబాబు ఆ రాత్రి మాదిరిపురంలోని మిషన్ స్కూల్‌లో బస చేస్తారు. బుధవారం ఉదయం మిషన్ స్కూల్ ఆవరణలోనే టీడీపీ రాష్ట్ర కమిటీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదే సమావేశంలో.. చంద్రబాబు పాదయాత్ర నల్గొండ జిల్లాలో కొనసాగించాలా లేదా కృష్ణాజిల్లాలో ప్రవేశించాలా అనే విషయాన్ని నిర్ణయం తీసుకుంటారు. అనంతరం చంద్రబాబు పాదయాత్ర వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మాదిరిపురంలో ఏర్పాటు చేసిన భారీ జ్ఙాపిక స్తూపాన్ని, ఎన్టీఆర్ విగ్రహాన్ని, పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 10 కి.మీ మేర పాదయాత్ర చేస్తారు. జిల్లాలో తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మంరూరల్, ఖమ్మం కార్పొరేషన్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాలకే పరిమితమైన ఈ యాత్ర జిల్లా మొత్తం మీద 101.9 కిలోమీటర్ల మేర జరుగుతుంది. సంక్రాంతి పండుగనాటికి చంద్రబాబు పాదయాత్ర ఖమ్మం పట్టణంలోకి ప్రవేశించేలా రూట్‌మ్యాప్‌ను పార్టీ నేతలు సిద్ధం చేశారు. 13న ఖమ్మం పట్టణంలో జరిగే సంక్రాంతి సంబరాల్లో చంద్రబాబు పాల్గొంటారు. ఇందుకోసం ఇప్పటినుంచే నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. చంద్రబాబు యాత్రను జిల్లా టీడీపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గతంలో ఉన్న విభేదాలను పక్కన బెట్టి జిల్లాలో బాబు పాదయాత్రను విజయవంతం చేసేందుకు ఉద్యుక్తులయ్యారు. ఇందులో భాగంగా బాబు పాదయాత్ర సాగే గ్రామాలన్నీ పసుపు మయమవుతున్నాయి. భారీ కటౌట్లు, స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు.

బాబు దృష్టికి జిల్లా సమస్యలు :


చంద్రబాబు పాదయాత్ర జరిగే గ్రామాల్లో ప్రధాన సమస్యలను పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించనున్నారు. ప్రధానంగా జిల్లాలో సాగునీటి సమస్య, జలయజ్ఞం ప్రాజెక్టుల నత్తనడక, యూనివర్శిటీ ఏర్పాటు, శ్రీరాంసాగర్ కాలువ పనుల తీరు, గ్రానైట్ పరిశ్రమ సంక్షోభం, విద్యుత్ కోత, రైతాంగ సమస్యలు వివిధ కులవృత్తులకు సంబంధించి ఆయా కులసంఘాలు వారి వారి సమస్యలను కూడా బాబు దృష్టికి తీసుకువెళ్లనున్నారు. రైతులు, వ్యవసాయకూలీలు, గిరిజనుల, ఎస్సీ, ఎస్టీ వర్గాల అభ్యున్నతికి పార్టీ డిక్లరేషన్‌ను కూడా చంద్రబాబు పాదయాత్ర సభల్లో ప్రజలకు తెలియచేయనున్నారు. చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా జిల్లాలో బహిరంగసభలు, వందరోజుల పాదయాత్ర విజయోత్సవ వేడుకను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఆ పార్టీనేతలు తుమ్మల నాగేశ్వరరావు, నామ నాగేశ్వరావు, కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు ఊకే అబ్బయ్య, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీలు పోట ్లనాగేశ్వరరావు, బాలసాని లక్ష్మినారాయణ తెలిపారు.