January 9, 2013

నేటి నుంచి ఖమ్మం జిల్లాలో వస్తున్నా... మీకోసం పాదయాత్ర





చంద్రబాబు 'వస్తున్నా.. మీ కోసం' పాదయాత్ర మంగళవారం రాత్రి 10.10 గంటలకు జిల్లాలోకి ప్రవేశించింది. ఖమ్మం, వరంగల్ జిల్లా సరిహద్దుల్లో తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం వద్దకు చంద్రబాబు చేరగానే టీడీపీ నేతలు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ జిల్లా అధ్యక్షులు కొండబాల కోటేశ్వరరావు, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, ఊకే అబ్బయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, జిల్లా టీడీపీ నాయకులు స్వర్ణకుమారి కోనేరు చిన్ని తదితరులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య బాబు జిల్లాలో పాదం మోపారు.

అప్పటివరకు తన వెంట రక్షణగా వచ్చిన వరంగల్ జిల్లా పోలీసులకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ జిల్లాకు చెందిన టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కడియం శ్రీహరి, గుండు సుధారాణి తదితరులు పాదయాత్రతోపాటే మాదిరిపురం చర్చి పాఠశాలకు చేరుకున్నారు. అక్కడే అప్పటివరకు చంద్రబాబు రాక కోసం ఎదురుచూస్తున్న కార్యకర్తలు మరోసారి రెట్టించిన ఉత్సాహంతో నినాదాలతో హోరెత్తించారు.

నేటితో బాబు పాదయాత్ర వందరోజులు పూర్తవుతున్న సందర్భంగా.. మాదిరిపురంలో జిల్లా టీడీపీ నేతలు బుధవారం విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ విజయోత్సవానికి గుర్తు గా.. వందడుగుల ఎత్తయిన విజయ స్తూపాన్ని కేవలం వందగంటల్లోనే నిర్మించారు. ఇక్కడే..రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నారు.

ఆ స్తూపమే ప్రధానాకర్షణ

బాబు వందరోజుల పాదయాత్ర విజయానికి గుర్తుగా.. ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు సహకారంతో వంద అడుగులు భారీ స్తూపాన్ని మాదిరిపురంలో నిర్మించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, విదేశాల నుంచి దిగుమతైన నిర్మాణసామగ్రితో ఇంత భారీ నిర్మాణాన్ని కేవలం వందగంటల్లో పూర్తిచేశారు. 5 అంతస్తులుగా నిర్మించిన ఈ స్తూపం కింద మూడు అంతస్తుల్లో గ్రానైట్ ఫలకాలను అమర్చారు. వీటి నిర్మాణానికి ఉపయోగించిన ఇటుకలు కూడా చాలా ప్రత్యేకమైనవి. జిప్సమ్, ఫ్లైయాష్‌తో తయారైన ఈ ఇటుకలు బరువు చాలా తక్కువగా ఉంటాయి. ఇక.. పైలాన్ పై భాగంలో చైనా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అల్యూమినియం కాంపోజిట్ ప్యానల్ ఏసీబీ టైప్ మెటీరియల్‌తో స్ట్రక్చర్ నిర్మించారు. దీనికి మరోసారి రంగు వేయాల్సిన అవసరం లేదు. పసుపు రంగులో ఆకర్షణీయంగా ఉన్న స్తూపానికి పైన పార్టీ జెండాను ఏర్పాటు చేశారు. ఈ స్తూపానికి పక్కనే పది అడుగుల ఎత్తున్న ఎన్టీఆర్ విగ్రహంతోపాటు పార్టీ జెండా దిమ్మెను ఏర్పాటుచేశారు. చంద్రబాబు ఈ విగ్రహంతోపాటు, విజయ స్తూపాన్ని ఆవిష్కరిస్తారు. నామ నాగేశ్వరరావు పర్యవేక్షణలో స్తూపం నిర్మాణ పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇంజనీరింగ్ నిపుణులు పీఎస్ఆర్ రెడ్డి, సజీవన్‌పిళ్లై సలహాలు, సూచనల మేరకు 400 మంది కార్మికులు, 50 మంది సుతారీ మేస్త్రీలు, 50 మంది నిపుణులైన సిబ్బంది వందగంటలపాటు శ్రమించి ఈ మహాస్తూప నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తి చేయగలిగారు. ఇప్పటివరకు రాష్ట్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన స్తూపాలన్నింటిలోకీ ఇదే అతిపెద్దది. అక్టోబర్ 2న చంద్రబాబు ప్రారంభించిన పాదయాత్ర పది జిల్లాల్లో 1600 కి.మీ. మేర సాగింది

జిల్లాలో తొలిరోజు పాదయాత్ర 10.9కి.మీ.

చంద్రబాబు వస్తున్నా మీ కోసం పాదయాత్ర బుధవారం జిల్లాలో తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుంచి ప్రారంభమై సుబ్లేడు, హస్నాబాద్, బచ్చోడు వరకు కొనసాగుతుంది. బచ్చోడులో రాత్రి బస చేయనున్నారు.

భారీ బందోబస్తు

చంద్రబాబు పాదయాత్ర సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇప్పటికే బాబు యాత్ర సాగే రహదారుల వెంట తనిఖీలు పూర్తి చేశారు. జిల్లా అడిషనల్ ఎస్పీ పర్యవేక్షణలో నలుగురు డీఎస్పీలు, 13 మంది సీఐలు, 50మంది ఎస్ఐలు, 80 మంది ఏఎస్ఐలు, 260 మంది కానిస్టేబుళ్లు, 176మంది హోంగార్డులు, 120 మంది ఏఆర్ బలగాలు, 60 మంది మహిళా కానిస్టేబుళ్లు, రెండు స్పెషల్‌పార్టీ బృందాలు బాబు పాదయాత్ర బందోబస్తులో పాల్గొంటున్నాయి. చంద్రబాబు జిల్లా సరిహద్దులకు చేరుకోగానే.. అప్పటి వరకు ఆయనకు రక్షణగా వచ్చిన వరంగల్ జిల్లా పోలీసులు వెనుదిరిగారు. చంద్రబాబు అధికారులందరినీ భుజం తట్టి పలకరించి కృతజ్ఞతలు తెలిపారు. ఆ వెంటనే ఖమ్మం ఏఎస్పీ ప్రకాష్ జాదవ్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా పోలీసులు బందోబస్తు బాధ్యతలు స్వీకరించారు.