December 27, 2012

కెసిఆర్‌కు బాబు షాక్ .................

ఈ నెల 28న(రేపు) జరగనున్న అఖిల పక్ష సమావేశంలో ఏం చెప్పాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఓ నిర్ణయానికి వచ్చారా? అంటే అవుననే చెప్పవచ్చు. ఇప్పటి వరకు అధికారికంగా ఏం చెప్పాలనే నిర్ణయాన్ని ప్రకటించలేదు. ఈ రోజు కరీంనగర్  జిల్లాలో పోలిట్ బ్యూరో సమావేశమై దీనిపై మరింత చర్చించి నిర్ణయాన్ని వెలువర్చనుంది. అయితే టిడిపి ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణకు ఓకె చెప్పాలని టిడిపి నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఇన్నాళ్లూ అందరూ భావిస్తున్నట్లుగా తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని మాత్రమే చెప్పకుండా తెలంగాణకు తాము ఓకే అని... అయితే దానిని ఎలా చెప్పాలనే అంశం పైనే టిడిపి తర్జన భర్జన పడుతోంది. దానిపై చంద్రబాబు, పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు. 18 అక్టోబర్ 2008 నాడు తెలంగాణకు ఓకె చెబుతూ టిడిపి నాటి కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీకి లేఖను ఇచ్చింది. అయితే అప్పుడు రాసిన లేఖనే యథాతధంగా తిరిగి రాసి ఇవ్వాలా లేక ఆ లేఖ తాము తిరిగి తీసుకోలేదని, దానికే కట్టుబడి ఉన్నామని చెప్పాలా అనే అంశంపై పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. సీమాంధ్ర టిడిపి నేతలతో చంద్రబాబు నిన్న భేటీ అయ్యారు. వారు కూడా తెలంగాణకు తాము వ్యతిరేకం కాదని అయితే ఆ ప్రాంతంలో ఎదురయ్యే వాటిని పరిగణలోకి తీసుకొని నిర్ణయించాలని బాబుకు సూచించారు. వారు తెలంగాణకు విముఖత చూపలేదు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాల తీవ్రతలోని బేధాలను గుర్తించిన సీమాంధ్ర తెలుగు తమ్ముళ్లు తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని బాబుతో చెప్పారని తెలుస్తోంది. తెలంగాణపై టిడిపికి ఓ క్లారిటీ వచ్చింది. ఇప్పుడు లేఖ విషయంలోనే వారు తర్జన భర్జన పడుతున్నారు. అయితే కొత్తగా లేఖ కాకుండా పాత లేఖకే కట్టుబడి ఉన్నామని, దానిని తాము తిరిగి వెనక్కి తీసుకోలేదని అఖిలపక్షంలో నిర్ణయించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. టిడిపి ఈ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పెద్ద షాక్ తప్పదని అంటున్నారు. అలాగే కాంగ్రెసు పార్టీని కూడా ఇరకాటంలోకి మరింత నెట్టినట్లవుతుందని చెబుతున్నారు. టిడిపి నుండి సీమాంధ్ర ప్రాంతం నేతగా యనమల రామకృష్ణుడు, తెలంగాణ నేతగా రేవూరి ప్రకాశ్ రెడ్డి లేదా రమేష్ రాథోడ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక అఖిల పక్ష భేటీ విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తర్జన భర్జన పడుతూనే ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక బిల్లు విషయంలో జగన్ పార్టీ అనుభవరాహిత్యం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. ఓ వైపు కాంగ్రెసు, టిడిపిలు అఖిలపక్ష భేటీపై తీవ్రంగా భేటీలు, చర్చలు జరుపుతుంటే... వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఆ వేడి అంతగా కనిపించడం లేదనే చెప్పవచ్చు.. తెలంగాణపై జగన్ పార్టీ అనుభవరాహిత్యం అఖిల పక్ష భేటీలో మరోసారి కనిపిస్తుందా అనే ప్రశ్న పలువురిని తొలుస్తోంది.