December 27, 2012

ఒంటరితనాన్ని ఎలా మోస్తున్నారో!



నడవలేని వాళ్లు సైతం కర్ర సాయంతో ఎదురు వస్తున్నారు. గ్రామాల్లో నా సభలు జరుగుతున్న చోటుకు వచ్చే సత్తువ లేనివారు.. ఆ దారిలో వెళుతుంటే గుమ్మంలోకి వస్తున్నారు. చలికి చిగురుటాకులా వణికిపోతూ కూడా నా రాక కోసం నిలువుగాళ్లపై నిలబడి చూస్తున్నారు. కొన్ని చోట్ల అయితే చలి మంటలు వేసుకొని వేచిచూస్తున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఆ పూరిపాకల్లో..ఎప్పుడు తెల్లారిపోతారా అన్నట్టు ఆ వృద్ధులు కనిపిస్తున్నారు. ఈ వయసులో అంత ఒంటరితనాన్ని ఎలా మోస్తున్నారో?

ఆర్థిక వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అయిన ఫలితాన్ని గ్రామాల్లో ముందు వృద్ధులు, ఆ తరువాత వితంతువులే ఎక్కువగా అనుభవిస్తున్నారనిపిస్తోంది. వాళ్లంతా జీవచ్ఛవాలుగా పడిఉన్నారు. పొద్దున పోయిన కొడుకూ కోడలు కూలి పనులు చేసుకొని ఏ రాత్రికో వస్తారు. తల్లివెంట బిడ్డ అన్నట్టు.. మనవళ్లు మనవరాళ్లూ సాయంత్రం దాకా కంటికి కనిపించరు. అందరూ ఉండి ఏమీ లేని వాళ్లలా మిగులుతున్నారు.

చిన్న చిన్న ఆర్థిక అవసరాలకు సైతం ఇతరుల ముందు చేయి చాపాల్సిన పరిస్థితి. పింఛను రూపంలో వారికి లభిస్తున్న ఊరట కొంతే. ప్రభుత్వం ఇచ్చే రూ. 200 పెన్షన్ ఏ మూలకు? అంత్యోదయ పథకం కింద కూడా ఆదరణ లేదు. అర్హులైనా చాలామందికి అవీ లేవు. ఆస్తులు లేక, గూడు లేక, చివరకు పథకాల లబ్ధి కూడా అందక ఆవేదనతో ఉన్నారు. ఐతే, ఈ వయసులోనూ కష్టించి పనిచేసి ముద్ద ముట్టాలనే ఆ అవ్వల పట్టుదల మాత్రం ముచ్చటగొలుపుతోంది.

సమాజంలో ఎక్కువగా నిరాదరణకు గురవుతున్నది వితంతువులే. వయసులో ఉండగా భర్త చనిపోయి.. బిడ్డల బాధ్యత భుజాన పడిన ఆడపడుచుల అవస్థ వర్ణనాతీతం. పింఛను పెంచడంతోనే వారి సమస్యలు తీరిపోవనిపిస్తోంది. ఏ పొద్దున నేను వాళ్ల ఊరుకు వస్తానోనని కళ్ల నిండా ఆశలతో ఎదురుచూస్తున్న వీళ్లను నిరాశపరచకూడదని నిర్ణయించుకున్నాను.