December 26, 2012

రాష్ట్రాన్ని పట్టించుకునే నాథుడే లేడు



అనాథలా ఆంధ్ర!

స్కాంల రాజధానిగా హైదరాబాద్

బయట నుంచి పెట్టుబడులు లేవు

బీహార్, గుజరాత్‌ల పైనే అందరి చూపు

ధరల పెంపు తప్ప కాంగ్రెస్ చేసిందేం లేదు

కరీంనగర్ పాదయాత్రలో చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ అనాథగా మారిందని, హైదరాబాద్ కుంభకోణాల రాజధానిని తలపిస్తోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంతా గుజరాత్, బీహార్‌లకు పోతున్నారు తప్ప హైదరాబాద్ వైపు చూసే నాథుడే లేకుండా పోయారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా గంగారాం వద్ద ఆయన పాదయాత్ర ప్రారంభించారు. ఊషన్నపల్లి, లక్షీపురం, పందిళ్ల, కొమిరె, జీలకుంట, పోత్కపల్లి గ్రామాల వరకు 12.5 కిలోమీటర్లు నడిచారు. దారిపొడవునా ప్రజలను పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ.. వాటిని పరిష్కరిస్తామని హామీ ఇస్తూ వెళ్ళారు.

గంగారంలో మత్స్యకారులు వలలు, బుట్టలు అందివ్వగా వాటిని ప్రదర్శిస్తూ.. తాము అధికారంలోకి వస్తే కులవృత్తులను చేతివృత్తులను ప్రొత్సహిస్తానని, బడుగు, బలహీనవర్గాలను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. గంగారం జడ్‌పీ హైస్కూల్‌లో టాయిలెట్లు లేవని విద్యార్థులు బాబు దృష్టికి తేగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి రూ.2.5 లక్షలు మంజూరు చేస్తున్నానని ప్రకటించారు. ఊషన్నపల్లిలో కొత్తగా పెళ్లి చేసుకున్న రెండు జంటలను ఆశీర్వదించారు.

అక్కడే ఇద్దరు మహిళలు జై తెలంగాణ నినాదాలు చేస్తూ తమకు తెలంగాణ కావాలనగా.. కేంద్రం సహకరిస్తే తెలంగాణ వస్తుందని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పారు. ఎరువుల ధరలు తగ్గించి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తెలుగుదేశం హయాంలో మిగులు కరెంట్ సాధించి తొమ్మిది గంటల పాటు కరెంట్ ఇస్తే.. ఈ రోజు కాంగ్రెస్ హయాంలో ఏం జరుగుతున్నదో ఆలోచించాలని ప్రజలను కోరారు.

"టీడీపీ హయాంలో క్వింటాలు పత్తిని రూ.4 వేలకు అమ్మితే.. ఇప్పుడు రూ.3500 అన్నా పలికే నాథుడు లేడు. డిసెంబర్ వచ్చినా సాగునీరు వదలట్లేదు'' అని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని, సర్‌చార్జీలు తగ్గిస్తుందని హామీ ఇచ్చారు. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో ధరలు తగ్గిస్తానని చెప్పినా ఇప్పటికీ ధరలు తగ్గకపోగా ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు.

"వంటగ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. టీడీపీ హయాంలో చక్కెర కిలో రూ.12కు అమ్మితే ఇప్పుడు రూ.25కు చేరింది. రూ.4 ఉండే ఉల్లి రూ.18 అయింది. వంటనూనెలు అప్పుడు రూ.40 ఉంటే ఇప్పుడు రూ.120కి అమ్ముతున్నారు'' అని పోల్చారు. తమ హయాంలో ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేసి నిత్యావసర వస్తువులు కొని మార్కెట్‌లో సరఫరా చేసేవారమని గుర్తుచేశారు. వైఎస్ ఏపీపీఎస్సీలో తనకు కావల్సినవారిని నియమించుకుని.. తాను చెప్పిన వారికి ఉద్యోగాలు ఇప్పించుకుని అర్హులకు అన్యాయం చేశాడని ఆరోపించారు.