December 26, 2012

తెలంగాణపై చంద్రబాబు స్పష్టీకరణ



సానుకూలమే
 ఆనాడే చెప్పాం.. దానికే కట్టుబడి ఉన్నాం

"మేం కేంద్రానికి 2008లోనే లేఖ ఇచ్చాం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని చెప్పాం. తెలంగాణను ఏర్పాటు చేయాలని లేఖలో కోరాం. మేం చెప్పాల్సిన అభిప్రాయం ఎప్పుడో 2008లోనే చెప్పేశాం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందని ఆరోజే తెలిపాం''

- చంద్రబాబు

 తెలంగాణకు తెలుగుదేశం సానుకూలమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కుండ బద్దలుకొట్టారు. ఈ విషయాన్ని ఎప్పుడో 2008లోనే స్పష్టం చేశామని, ఆ మేరకు ప్రణబ్ ముఖర్జీకి లేఖ కూడా ఇచ్చామని గుర్తు చేశారు. కరీంనగర్ జిల్లా పాదయాత్రలో బుధవారం ఆయన ఈ విషయం ప్రస్తావించారు. "మేం కేంద్రానికి 2008లోనే లేఖ ఇచ్చాం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని చెప్పాం. తెలంగాణను ఏర్పాటు చేయాలని లేఖలో కోరాం. దీనికి ఎవరు కాలయాపన చేశారు? కాంగ్రెస్ పార్టీ చేసింది.

రాష్ట్రం ఇచ్చే అధికారం మాకు లేదు.. కాంగ్రెస్‌కే ఉందని మేం చాలాసార్లు చెప్పాం. మేం చెప్పాల్సిన అభిప్రాయం ఎప్పుడో 2008లోనే చెప్పేశాం. తెలంగాణకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందని ఆరోజే తెలిపాం'' అని విస్పష్టంగా తెలిపారు. అయినా తెలుగుదేశం పార్టీని రాజకీయంగా దెబ్బ తీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు. "టీఆర్ఎస్ వాళ్లు తెలంగాణ గురించి సోనియాను మాత్రం అడగరు. పేదల పార్టీ టీడీపీని దెబ్బతీయాలని వారు చూస్తున్నారు. తెలంగాణ ఇచ్చే బలం కాంగ్రెస్‌కే ఉంది. బిల్లు వారే పెట్టాలి కానీ మీరు మాత్రం అభిప్రాయం చెప్పండని ప్రశ్నిస్తున్నారు'' అని మండిపడ్డారు.

ప్రణబ్ ముఖర్జీకి తాము లేఖ ఇచ్చిన తర్వాతే.. 2009లో కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు కదా.. మరి టీడీపీ విషయంలో ఇప్పుడెందుకు అలా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. తానెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. భవిష్యత్తులో కూడా మాట్లాడనని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాంగ్రెస్ దొంగ ఆటలు ఆడుతూ తెలంగాణను ఇవ్వకుండా.. టీడీపీపై బురద చల్లుతోందని విమర్శించారు. టీడీపీ ఒక పక్క దెబ్బతింటే మరో పక్క కూడా దెబ్బతింటుందన్న కుట్రతోనే ఆ పార్టీ ఇలా వ్యవహరిస్తోందన్నారు. "ప్రజలే అంతిమ నిర్ణేతలు.. మీరు ఆలోచించండి.. నేను చెప్పినవి విన్నారు.. చర్చించండి'' అని ఆయన పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఒకటిన్నర సంవత్సరాలు కాంగ్రెస్‌తో కలిసి అధికారంలో ఉందని, ఈ ప్రాంతానికి వారేం చేశారో చర్చకు సిద్ధమేనా అని చంద్రబాబు ప్రశ్నించారు.