December 26, 2012

తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదు, టీడీపీపై బురద జల్లేందుకు కాంగ్రెస్ కుట్ర



 ప్రత్యేక తెలంగాణపై ఇదివరకే లెటర్ ఇచ్చామని, దానిని ఇంతవరకు వెనక్కి తీసుకోలేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలంగాణకు టీడీపీ వ్యతిరేకంకాదని, ఆ విషయం ఇదివరకే చెప్పానని, ఇప్పుడే కాదు, భవిష్యత్‌లో కూడా వ్యతిరేకంగా మాట్లాడడని చంద్రబాబు మరో మారు స్పష్టం చేశారు.

'వస్తున్నా ..మీకోసం' పాదయాత్ర జిల్లాలో నిర్వహిస్తున్న చంద్రబాబునాయుడు 82వ రోజైన బుధవారం గంగారంలో మాట్లాడుతూ అఖిలపక్షంపై కాంగ్రెస్ పార్టీ తన వైఖరిని తెలపకుండా టీడీపీపై బురద జల్లేందుకు రాజకీయ కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారం ఉన్న కాంగ్రెస్ ముందు తెలంగాణపై అభిప్రాయం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

విద్యార్ధుల్లో ప్రతిభా ఉన్నా ఉద్యోగాలు రావడంలేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీపీఎస్సీలో దివంగత వైఎస్ తనకు అనుకూలమైన వ్యక్తులను పెట్టి వ్యవస్థను భ్రష్టు పట్టించారని విమర్శించారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో విఐపీల దర్శనాలవల్ల సామాన్య భుక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రూ. 10 వేల కోట్లతో పేదలు, చేతివృత్తుల వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలకు శాసనసభ ఎన్నికల్లో 100 సీట్లు, స్థానిక సంస్థల్లో 50 శాతం సీట్లు కేటాయిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

కాగా వస్తున్నా...మీకోసం పాదయాత్రలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం పార్టీ నేతలతో భేటీ అయ్యారు. అఖిలపక్ష సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చించారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ అఖిలపక్షానికి టీడీపీ తరఫు నుంచి ఎవరు వెళ్తారన్నది బుధవారం చంద్రబాబు ఆధ్వర్యంలో జరగనున్న టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం జరుగుతుందని అన్నారు. ఈరోజు తెలంగాణ, సీమాంధ్రా నేతలతో బాబు చర్చలు జరిపారని అన్నారు. ఎవరు వెళ్ళినా అఖిలపక్షంలో ఒకే అభిప్రాయం చెబుతారని యనమల పేర్కొన్నారు.