December 7, 2012

ఆపార్టీలన్నీ కాంగ్రెస్‌లో కలిసేవే

కేంద్రంలో జగన్ పార్టీ బేరసారాలు
ప్రజావిశ్వాసం లేని వైసీపీ, టీఆర్ఎస్
నిలిచేది... పోరాడేది మేమే
ఆదిలాబాద్ పాదయాత్రలో చంద్రబాబు
ఈ రాక్షస పాలనను అంతం చేద్దాం
గజదొంగల్లా దోస్తున్న కాంగ్రెస్ నేతలు
చిల్లర పద్ధతుల్లో ఎఫ్‌డీఐపై నెగ్గిన యూపీఏ
కట్టని ఇల్లుకూ బిల్లులా..?: టీడీపీ అధినేత ప్రశ్న
యాత్రను అడ్డుకునేందుకు మాల మహానాడు యత్నం

ఆదిలాబాద్, నవంబర్ 7  : రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు రాక్షస పాలన చేస్తున్నారని, దానికి చరమగీతం పాడాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇల్లు కట్టుకున్నపేదలకు బిల్లులు ఇవ్వడం లేదనీ, ఇల్లు కట్టకుండానే కాంగ్రెస్ నేతలు బిల్లులు తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. అధికారం అప్పగిస్తే ఇంటికి పెద్దకొడుకులా రాష్ట్ర ప్రజల కష్టాలను తీరుస్తానని హామీ ఇచ్చారు. కేసులు ఎత్తేస్తే జగన్ పార్టీ కాంగ్రెస్‌లో కలిసిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు.

ఆదిలాబాద్ జిల్లా నియోజకవర్గ కేంద్రం ముథోల్ ప్రభుత్వ పాఠశాల మైదానం నుంచి తరోడ, దేగాం, బోకర్‌క్రాస్, బైంసాక్రాస్, బైంసా పట్టణం వరకు శుక్రవారం యాత్ర సాగింది. మొత్తం 15.9 కిలోమీటర్లు నడిచారు. రెండో రోజు కూడా పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. రోడ్ల పక్కన ఉన్న వారిని, పాఠశాల, కళాశాల విద్యార్థులను, పంట చేన్లలోని రైతులను పలకరించారు. విద్యార్థులు ఆయనతో కరచాలనం చేసేందుకు ఎగబడ్డారు.

ముథోల్‌లోని ఒక హెటల్‌లో చాయ్ తాగి యజమాని చాంద్‌మియాను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. మార్గమధ్యలో ఎదురైన ఒక వృద్ధురాలు, మరో వికలాంగుడిని పలకరించారు. నాలుగు వేలరూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు. ముథోల్ సమీపంలోని ఓ పత్తి చేనులోకి వెళ్లి రైతును పలకరించారు. కూలీలను పలకరించగా వారు మరాఠీలో మాట్లాడారు. వారి మాటలను చంద్రబాబుకు ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్‌రాథోడ్ అనువదించి చెప్పారు.

ఈ సందర్భంగా ముథోల్ పాతబస్టాండ్, ముథోల్, తరోడ, సరస్వతీనగర్, బైంసాలో జరిగిన సభల్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పాలకులు గజదొంగల్లా వ్యవహరిస్తూ అందినకాడికి దండుకుంటున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని పేదలందరికీ రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వ్యయంతో ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామన్నారు. వృద్ధులకు రూ. 600, వికలాంగులకు రూ. 15 వందలు పింఛన్ ఇస్తామని చెప్పారు.

ఎంతో మంది పేదలు కష్టపడి తమ పిల్లలను చదివిస్తున్నారనీ, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఉద్యోగాలు కల్పించలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉద్యోగాలు కల్పిస్తామనీ, ఉద్యోగాలు రాని వారికి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన సమయంలోనే బీడీ కట్టలపై పుర్రెగుర్తు పెట్టారనీ, తాము ఢిల్లీ వెళ్లి ఆందోళన చేయడంతో దాన్ని తొలగించారని గుర్తుచేశారు. వెయ్యి బీడీలు చేస్తే రూ. 110 చెల్లిస్తున్నారనీ, దాన్ని 150 రూపాయలు ఇచ్చేలా చూస్తామని, నెలకు 26 రోజులు పని కల్పించేలా చర్యలు తీసుకుంటానన్నారు.

గిట్టుబాటు ధర లేక పత్తి రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారనీ, తన ప్రభుత్వ హయాంలో నాలుగు వందలకు డీఏపీ బస్తా లభించగా, క్వింటాలు పత్తికి రూ. 5 వేల ధర లభించిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం డీఏపీ 13 వందలు ఉండగా క్వింటాలు పత్తికి రూ. 3500 కూడా రావడం లేదని చెప్పారు. ఎరువులు, పురుగుమందుల ధరలు పెరగగా, రైతు పండించిన పంటలకు ధర తగ్గుతుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి, రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తానన్నారు. చిల్లర వ్యాపారంలో విదేశీ పెట్టుబడులను ప్రోత్సహించి చిరు వ్యాపారుల భవిష్యత్తును బుగ్గిపాలు చేసేందుకు కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకుందని విమర్శించారు.

తమ పార్టీ విదేశీ పెట్టుబడుల బిల్లును వ్యతిరేకించినప్పటికీ యూపీఏ సర్కార్ చిల్లర పద్ధతులతో ఆ బిల్లును పాస్ చేయించుకుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతికి మారుపేరుగా నిలిచిందని దుయ్యబట్టారు. కేసులను ఉపసంహరించుకుంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యేందుకు ఆ పార్టీ అధినేత సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. దీనిపై బేరసారాలు సాగుతున్నాయని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రజా సమస్యల పరిష్కారానికి ఏనాడూ కూడా చర్యలు చేపట్టిన దాఖలాలు లేవన్నారు.

ఆరు నెలల పాటు కుంభకర్ణుడిలాగా నిద్రపోయి కొంతకాలం తప్పుడు ప్రకటనలు చేస్తూ ప్రజలను మోసం చేస్తూ కాలం వెల్లదీస్తాడని పేర్కొన్నారు. టీఆర్ఎస్ కూడా కాంగ్రెస్‌లో విలీనం అయ్యేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. మంత్రి పదవితో చిరు పార్టీ (పీఆర్పీ) సామాజిక న్యాయాన్ని పక్కన బెట్టి సొంత లాభానికి పరిమితమైందన్నారు.తాము మాత్రం ప్రజాసంక్షేమం కోసం, సమన్యాయం కోసం స్వచ్ఛమైన పాలన అందించేందుకు ద్రుఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు.

అవాంతరాలు, అడ్డంకులు ఎన్ని కలిగినా వాటిని అధిగమించి రాష్ట్ర సంక్షేమం కోసం చిత్తశుద్ధితో ముందుకు సాగుతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ చతికిలపడిపోయిందని, టీఆర్ఎస్, వైసీపీ ప్రజా నమ్మకాన్ని కోల్పోయాయని ధ్వజమెత్తారు. కాగా, కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పై స్పష్టమైన వైఖరిని వెల్లడించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా సమస్యను పక్కదోవ పట్టించి తమ పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకు కుట్ర పన్నుతోందని చంద్రబాబు ఆరోపించారు. అఖిలపక్షంలో పార్టీ వైఖరి చెబుతామని పునరుద్ఘాటించారు.

మరోవైపు, మైనారిటీ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతానని చంద్రబాబు అన్నారు. రూ. 2500 కోట్లతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వారిని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చారు. వడ్డీ లేని రుణం అందించి వారిని ఆర్థికపరంగా ముందుకు తీసుకెళ్తామని, అసెంబ్లీ ఎన్నికల్లో 15 సీట్లు కేటాయిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని బీసీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పేదలందరికి న్యాయం చేస్తామన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు న్యాయం జరిగే వరకు పాటు పడతామని తెలిపారు. అగ్రకులాల్లోని పేదలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించేందుకు చర్యలు చేపడుతామన్నారు.

ఏబీవీపీ కార్యకర్తల హల్‌చల్
పాదయాత్రకు శుక్రవారం ముథోల్‌లో తెలంగాణ సెగ తగిలింది. ఉదయం వేళలో చంద్రబాబు పాదయాత్ర స్థానిక ప్రభుత్వ పాఠశాల ఆవరణ నుంచి ప్రారంభం కాగానే ముథోల్ ఏబీవీపీ ప్రతినిధి రాహుల్ ఆధ్వర్యంలో పలువురు ఆందోళనలు చేపట్టారు. నినాదాలు చేస్తూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'చంద్రబాబు గోబ్యాక్', 'తెలంగాణ పై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి', 'జై తెలంగాణ జైజై తెలంగాణ' అని నినదిస్తూ పాదయాత్రను అడ్డుకునేందుకు ముందుకు దూసుకెళ్లారు. ఇది గమనించిన పోలీసులు వారిని ముందుకు పోకుండా అడ్డుకుని పక్కకు తోసుకెళ్లారు. ఏబీవీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.

షెడ్యూల్ మార్చొద్దు
ముథోల్ నుంచి బైంసాకు వస్తుండగా ముథోల్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కొద్దిసేపు ఆగాలని, అక్కడి విద్యార్థులతో మాట్లాడాలని స్థానిక నేతలు చంద్రబాబును కోరారు. అయితే, 'షెడ్యూల్ మార్చోద్దు'' అని వారికి సూచించి ఆయన ముందుకు వెళ్లిపోయారు. ఈ సమయంలో వారిపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు.