December 7, 2012

గల్ఫ్‌కు ప్రత్యేక శాఖ

కూటి కోసం కోటి తిప్పలు అన్నారు పెద్దలు. ఆ కోటి తిప్పలూ పడుతున్నా నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లనివారు ఎందరో!! రోజంతా రెక్కలు ముక్కలు చేసుకున్నా.. జానెడు పొట్ట కోసం వేల కిలోమీటర్లు వెళ్లి రక్తం ధారపోస్తున్నా పొట్ట నిండని వారెందరో!! ఈరోజు పాదయాత్రలో అటువంటి విషాద ఘటనలే నాకు ఎదురయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లిన వారి కుటుంబీకులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.

జీవనోపాధిని వెతుక్కుంటూ వెళ్లిన తమవారు అక్కడ ఎంతటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారో కళ్లకు కట్టారు. ఒక్కొక్కసారి తమవారి కడసారి చూపు కూడా కరువవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణతోపాటు కడప, తూర్పు, పశ్చిమ గోదావరి తదితర జిల్లాల నుంచి వలస వెళ్లినవారు దుర్భర జీవితాలను అనుభవిస్తున్న అంశం నా దృష్టిలో ఉంది. అందుకే, వారి ఆవేదన విన్న తర్వాత ఈసారి అధికారంలోకి వచ్చిన వెంటనే గల్ఫ్ బాధితుల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

బీడీ కార్మికుల వెతలు అన్నీ ఇన్నీ కావు. ఉదయం నిద్ర లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ బీడీలు చుడుతూనే ఉంటారు. దాంతో నిరంతరం వారిని ఆరోగ్య సమస్యలు వెన్నాడుతున్నాయి. అయినా, వారికి కనీస వేతనాలు లేవు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే బీడీ కట్టలపై పుర్రె గుర్తు వేయించారు. కార్మికుల ఉపాధికి ముప్పని తెలిసినా ఆయన నిరోధించలేదు.

అదే వారి పాలిట శాపమైంది. బీడీ కార్మికులకు కూడా పెద్ద పెద్ద కోరికల్లేవు. నా దగ్గర ఆవేదన వ్యక్తం చేసినప్పుడు మూడే మూడు చిన్న కోరికలు కోరారు. తమకు కనీస వేతనంగా రూ.150 ఇప్పించాలని, నెల మొత్తం పని ఉండేలా చూడాలని; పింఛనుగా కనీసం రూ.500 ఇప్పించాలని కోరారు. వారి డిమాండ్లన్నీ సమంజసమే. హేతుబద్ధమే. బీడీ కార్మికుల్లో కొందరు డ్వాక్రా మహిళలు ఉన్నారు.

ఒక వయసు దాటిన తర్వాత వారు బీడీలు చుట్టలేరు. అప్పుడు వారికి ఉపాధి కూడా ఉండదు. అందుకే, వారికి పింఛను ఇవ్వడం తప్పనిసరి అనిపించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ దిశగా ప్రయత్నం చేయాలని సంకల్పం చెప్పుకొన్నాను.