November 9, 2012

ప్రజలను దోచేస్తున్నారు- విశాలాంధ్ర


 
 
 
 
Fri, 9 Nov 2012, IST    vv

చంద్రబాబు మండిపాటు


రంగారెడ్డి(వి.వి) : నిత్యావసర వస్తువులు, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచుతున్న పాలకులు ప్రజల కనీస అవసరాలైన మరుగుదొడ్లను కూడా నిర్మించి ఇవ్వలేకపోతున్నారని టిడిపి అధ్యక్షులు ఎన్‌.చంద్రబాబునాయుడు విమర్శించారు. రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం ఉందని నిప్పులు చెరిగారు. కిరణ్‌కుమార్‌ పనికిమాలిన ముఖ్యమంత్రని ఆయన నిందించారు. పాలన పూర్తిగా పక్కదారి పట్టిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా గండీడ్‌ మండలం సల్కార్‌పేట నుంచి శుక్రవారం ఆయన పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన సల్కార్‌పేట చౌరస్తా, గండీడ్‌లలో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 150 రోజులు కూలీలకు పని కల్పించాల్సింది పోయి, వాటిని 30 రోజులకు మాత్రమే కుదించి, మిగతా మొత్తాన్ని కాంగ్రెస్‌ నాయకులంతా కలిసి మెక్కుతున్నారని దుయ్యబట్టారు. లక్షలు తిని బొజ్జలు పెంచుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి కాంగ్రెస్‌ చేస్తున్నదేమి లేదన్నారు. తన పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో మొదటిస్థానంలో నిలిపితే, కాంగ్రెస్‌ మాత్రం అవినీతిలో ప్రథమ స్థానంలో నిలిపిందన్నారు. రైతులు అధిక పెట్టుబడి పెట్టి పంటలు పండించినా కూడా వాటిని కొనే నాథుడే లేకుండా పోయాడని అన్నారు. ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలతో రైతులు దివాళా తీస్తున్నారని ఆవేదన చెందారు. వర్షాకాలంలోనే కరెంట్‌ కోతలు విధిస్తే ఇక వేసవిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించవచ్చన్నారు. తెలంగాణపై కాంగ్రెస్‌ దొంగటాడుతున్నదని చంద్రబాబు విమ ర్శించారు. అన్ని పార్టీలు కాంగ్రెస్‌లో కలిసిపోయేవే అని, ప్రజలకు మిగిలేది టిడిపి ఒక్కటేనని ఆయన తేల్చిచెప్పారు. టిడిపి చచ్చిపోయిందని కొందరంటు న్నారని, అయితే ఎవరి పార్టీ చచ్చి పోతుందో కాలమే చెబుతుందని వ్యాఖ్యానించారు. దోచుకున్న డబ్బును దాచుకోవటానికి జగన్‌ పార్టీ పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కోట్ల రూపాయలు తీసుకుని కొందరు జగన్‌ పార్టీలో చేరుతున్నారని ఆయన ఆరోపించారు. వస్తున్నా...మీకోసం పాదయాత్ర శుక్రవారంతో 35వ రోజుకు చేరుకున్నది. సల్కార్‌పేట్‌ నుంచి మొదలుపెట్టి గండీడ్‌, నంచర్లగేట్‌ల గుండా ఆయన సాయంత్రంలోగా 7 కి.మీ పాదయాత్ర జరిపారు. అటు తర్వాత గడ్డిర్యాల్‌ నుంచి పుట్టపహాడ్‌ వరకు 7 కి.మీ పాదయాత్ర చేసి, రాత్రి అక్కడే బస చేస్తారు. బాబుతో పాటు టిడిపి జిల్లా అధ్యక్షులు పి.మహేందర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సుభాష్‌ యాదవ్‌, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, రత్నం, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
No comments :

No comments :