November 9, 2012

ఒక్క బల్బు .. ఏడు వేల బిల్లు! కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశాం..


ఒక్క బల్బు .. ఏడు వేల బిల్లు!
కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశాం
మరోసారి ఆ తప్పు చేయం
మీరు సీఎం అయి మా బాధలు తీర్చాలి
చంద్రబాబుకు మహిళల మొర, బిల్లుల దహనం
పాదయాత్ర ఆద్యంతం బిల్లులపైనే ఫిర్యాదులు
ఏ పార్టీనీ నమ్మొద్దు, బడుగుల పార్టీ టీడీపీనే
రంగారెడ్డి జిల్లా! గండీడు మండలం కొమిరెడ్డిపల్లి! చంద్రబాబు శుక్రవారం ఉదయం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు! కొద్ది దూరం నడిచిన తర్వాత అదే గ్రామంలో రచ్చబండ నిర్వహించారు! ఎప్పట్లానే.. 'ఏమిటి విశేషాలు!? మీ సమస్యలు చెప్పండి' అని అన్నారు! అంతే..! రెండు రోజుల కిందట కరెంటు బిల్లు వచ్చినప్పటి నుంచీ కడుపులోనే దాచుకున్న ఆగ్రహం.. గుండెల్లో గూడు కట్టుకున్న వేదన.. ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది! "మా ఇంట్లో ఒక్క బల్బు ఉందయ్యా! దానికే ఏడు వేల రూపాయల బిల్లు వచ్చింది'' అని ఓ మహిళ అంటే.. "కరెంటు కోసం రాత్రిళ్లు జాగారం చేయాల్సి వస్తోంది. కరెంటు ఇవ్వకపోయినా వేలల్లో బిల్లులు మాత్రం పంపుతున్నారు'' అని మరో మహిళ మండిపడింది.

"మేం కాంగ్రెస్‌ను గెలిపించి తప్పు చేశాం. మళ్లీ కాంగ్రెస్ మాట ఎత్తం! మళ్లీ మీరే ముఖ్యమంత్రి అయి మా బాధలు తీర్చాలి'' అని మహిళలు ఒకరి తర్వాత మరొకరుగా ముక్తకంఠంతో నినదించారు. ఒక్క కొమిరెడ్డిపల్లి మాత్రమే కాదు. శుక్రవారం చంద్రబాబు పాదయాత్ర అడుగడుగునా ఇదే పరిస్థితి! ప్రతి గ్రామంలోనూ మహిళలు ముందుకు వచ్చి మరీ కరెంటు బిల్లులు చూపి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు చూపించిన బిల్లులు చూసి చంద్రబాబు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. రెండు సర్‌చార్జీల పోటుతో విద్యుత్ బిల్లులు పేలిపోతున్నాయి. దీంతో, శుక్రవారం చంద్రబాబు పాదయాత్రలో ఇదే ప్రధాన అంశమైంది. ఆయన ఎక్కడకు వెళ్లినా దీనిపైనే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.

ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు వారిని ప్రశ్నించగా.. ఇంత డబ్బు ఎక్కడ నుంచి తీసుకువచ్చి కట్టాలి? కరువు వచ్చి తింటానికి తిండి లేక మేము బతుకుతున్నాం. ఈ డబ్బు కట్టేది లేదు'' అని వారు తెగేసి చెప్పారు. దీంతో, "అలానే చేయండి. ఒక బల్బు ఉన్న వారెవరూ అదనపు చార్జీలు చెల్లించవద్దు'' అని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు. సల్కార్‌పేటలో ఆగ్రహాన్ని ఆపుకోలేని కొందరు మహిళలు చంద్రబాబు వెళ్లిన తర్వాత కరెంటు బిల్లులు అన్నిటినీ కాటన్ బాక్స్‌లో పెట్టి తగలబెట్టారు. "బయట ధరలన్నీ పెరిగాయి. ఎలా బతుకుతున్నామో దేవునికే ఎరుక. రూపాయికే కిలో బియ్యం పథకం అమల్లోకి వచ్చిన తర్వాతే ఇలా జరుగుతోంది'' అని గ్రామంలోని మహిళలంతా ఆవేదన వ్యక్తం చేశారు. బియ్యం రూపాయికి ఇచ్చి మిగతా వాటి ధరలు పెంచేశారని ధ్వజమెత్తారు.

కాగా, కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీ ఎప్పటికైనా ఒకటేనని, వాటిని నమ్మవద్దని చంద్రబాబు పిలుపునిచ్చారు. పీఆర్పీలాగే టీఆర్ఎస్, వైసీపీ కాంగ్రెస్‌లో విలీనం కావడం ఖాయమన్నారు. వాటిని నమ్ముకుంటే లాభం ఉండదన్నారు. పాదయాత్రలో భాగంగా వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని పందికొక్కుల్లా దోచుకుతింటుంటే.. టీఆర్ఎస్, వైసీపీ ప్రజలను మోసం చేసి పబ్బం గడుపుకుంటున్నాయని మండిపడ్డారు. జగన్‌పై కేసులు ఎత్తివేస్తే ఏ క్షణమైనా కాంగ్రెస్‌లో కలిసేందుకు వైసీపీ సిద్ధంగా ఉందన్నారు. టీఆర్ఎస్‌కు ప్రజల్లో విశ్వసనీయత లేదని, ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌లో కలిసేందుకు బేరసారాలు సాగిస్తోందని చెప్పారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఇక మిగిలేది టీడీపీనేనని చెప్పారు.

సర్కారుకు ఏడు సూచనలు
ఇటీవలి నీలం తుఫాను, ఆ తర్వాత రాష్ట్రాన్ని ముంచెత్తిన వరదల నేపథ్యంలో బాధితులకు సహాయ చర్యలనందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు.

తుఫాను బాధితులు తలదాచుకున్న పునరావాస కేంద్రాలకు ఆహారం, మంచినీటిని పూర్తి స్థాయిలో సరఫరా చేయడం, చిన్నారులకు వ్యాధి నిరోధక మందుల సరఫరా, వైద్య బృందాలు, పశు వైద్యుల తరలింపు, ఎక్స్‌గ్రేషియా చెల్లింపు, ప్రత్యామ్నాయ పంటలకు వెళ్లేలా రైతులకు తగిన సహకారం, నష్టపరిహారం కోసం కేంద్రానికి లేఖ తదితర అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు తన లేఖలో సూచించారు.


No comments :

No comments :