November 9, 2012

మీ మధ్యనే ఉంటా...ప్రజాశక్తి



 

 

 

మీ మధ్యనే ఉంటా...



అందరిలా హైదరాబాద్‌లో ఉండకుండా.. మీ మధ్యనే ఉంటానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమస్యలు ఎక్కడుంటే అక్కడికొచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రంగారెడ్డి జిల్లా గండ్వీడ్‌ మండలం సల్కర్‌పేట గ్రామం నుంచి ఉదయం 11 గంటలకు చంద్రబాబు పాదయాత్ర రెండోరోజు ప్రారంభమైంది. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లర్పించారు. అనంతరం రెడ్డిపల్లి, గండ్వీడ్‌, రుసుంపల్లి చౌరస్తాల మీదుగా కుల్కచర్ల మండలం పుట్టాపాడ్‌ గ్రామానికి యాత్ర చేరుకుంది. ఈ పాదయాత్ర సందర్భంగా పలుచోట్ల బాబు ప్రసంగిస్తూ ఎరువులు, విత్తనాల ధరలు పెంచి కాంగ్రెస్‌ సర్కారు రైతుల నడ్డి విరగొట్టిందన్నారు. బ్యాంకు రుణాలను రైతులు చెల్లించొద్దనీ, ఎవరైనా అడిగితే తనపేరు చెప్పాలనీ బాబు సూచించారు. ఈ పనికిమాలిన ప్రభుత్వంలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచపటంలో పెట్టిన ఘనత టిడిపికే దక్కుతుందన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో చోటా, మోటా నాయకులు ఆయా స్థాయిల్లో ప్రజలను మోసం చేస్తూ నిధులను పందికొక్కుల్లా మేస్తున్నారన్నారు. రూ.43 వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్నారు. టిడిపి హయాంలో అవకాశమున్న రంగాలన్నింటిలోనూ ఉద్యోగాలు కల్పించామన్నారు. నాడు అభివృద్ధిలో రాష్ట్రం పేరు తెచ్చుకుంటే... నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో పేరుమోసిందనీ ఎద్దేవ చేశారు.
30 ఏళ్లుగా పోరాడుతున్నాననీ, తెలంగాణలో ఏ పార్టీ అభివృద్ధి చేసిందో ప్రజలు గ్రహించాలన్నారు. పాదయాత్రలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, నామా నాగేశ్వరరావు, టిడిపి జిల్లా అధ్యక్షులు మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్‌, రత్నం, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
సర్దార్‌ ఆలీఖాన్‌ మృతికి బాబు సంతాపం
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సర్దార్‌ ఆలీఖాన్‌ మృతి పట్ల టిడిపి అధినేత చంద్రబాబు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. న్యాయమూర్తిగా, మానవ హక్కుల కమిషన్‌ సభ్యునిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆలీఖాన్‌ కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
No comments :

No comments :