November 22, 2012

ప్రజల కష్టం ముందు నా ఇబ్బంది ఏ పాటి

ఇప్పటి వరకు సుమారు 800 కిలోమీటర్ల పాదయాత్ర చేసిన తాను కాళ్లు నొప్పులు.. పాదాలకు బొబ్బలతో ఇబ్బందులు పడుతున్నానని చంద్రబాబు తెలిపారు. నడిచి నడిచి కాలు, ఒక వేలు నొప్పి ఎక్కువగా ఉందన్నారు. ప్రతిరోజూ సాయంత్రానికి కుంటుకుంటు నడుస్తున్న రాత్రి నిద్రకుపక్రమించే సమయంలో పాదయాత్రపై పట్టుదల మరింత పెరుగుతోందని చెప్పారు.

తాను ఇప్పటి వరకూ నడిచిన 51 రోజులలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రజలు కష్టాలు పడుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని, వాటి ముందు తాను పడుతున్న ఇబ్బంది పెద్దదేం కాదని చంద్రబాబు అన్నారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ అందోల్ నియోజకవర్గం మునిపల్లి మండలం బుధేర చౌరస్తాలో పలువురు ఆయన దృష్టికి తీసుకవచ్చారు. ఇందుకు స్పందించిన చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుందని హెచ్చరించారు.

రూపాయి బియ్యమిచ్చి రూ.60 లాక్కుంటున్నారు.. ఆరూర్ సభలో రైతులు చంద్రబాబు మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. 'రూపాయికి కిలో బియ్యం కావాలని మేం అడగనే లేదు. అయినా కాంగ్రెస్ వాళ్లు ఇస్తున్నారు. అయితే ఇలా బియ్యం ఇచ్చి మిగతా సరకుల పేరిట రూ.60లు లాక్కుంటున్నారు. ఈ ప్రభుత్వం వ్యాపారిలా వ్యవహరిస్తోంది' అని కోనాపూర్‌కు చెందిన రైతు ఎండి అక్బర్ ఆరూర్ సభలో చంద్రబాబు దృష్టికి తెచ్చారు.

ఉపాధి హామీ పథకం డబ్బులను కాంగ్రెస్ నాయకులు స్వాహా చేస్తున్నారని, ఇది దొంగ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న కాంగ్రెస్‌కు ఓటేయరాదని అక్బర్ అనడంతో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపయింది. దీని తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో రాత్రి విద్యుత్ వల్ల రాష్ట్రంలో నాలుగు వేల మంది చనిపోయారని చంద్రబాబు తెలిపారు.
No comments :

No comments :