November 22, 2012

స్థానికులకే ఉద్యోగాలు పరిశ్రమలన్నీ అమలు చేయాలి.. లేకుంటే ఉద్యమానికి సిద్ధం

స్థానికులకే ఉద్యోగాలు
పరిశ్రమలన్నీ అమలు చేయాలి.. లేకుంటే ఉద్యమానికి సిద్ధం
విత్తనాలు, ఎరువులు పోలీస్ స్టేషన్‌లోనా?
ఇంత దుస్థితి ఇంతకు ముందెప్పుడైనా చూశారా?
ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టి.. కాంగ్రెస్ నేతలు బలిసిపోయారు
హైదరాబాద్‌ను పునర్ నిర్మించాలి.. పాదయాత్రలో చంద్రబాబు

సంగారెడ్డి, నవంబర్ 21: 'ఎక్కడ పరిశ్రమలు పెట్టారో.. అక్కడి వారికే ఉద్యోగాలివ్వండి'.. టీడీపీ అధినేత చంద్రబాబు తాజా నినాదమిది. పరిశ్రమలలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలంటూ పోరాటానికి సిద్ధమవుతామని ఆయన ప్రకటించారు. మెదక్ జిల్లా సదాశివపేట ప్రాంతంలో జిన్నింగ్, టెక్స్‌టైల్ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయని, అయితే వాటిలో ఇతర ప్రాంతాల వారికే ఉద్యోగాలు ఇచ్చారని అన్నారు.

'వస్తున్నా మీకోసం' పాదయాత్ర జిల్లాలో నాలుగో రోజు కొనసాగింది. బుధవారం సదాశివపేట సమీపంలోని మద్దికుంట చౌరస్తా నుంచి మునిపల్లి మండలం పెద్దచల్మెడ వరకు 18.6 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ధరల సలహా మండలి లేకుండా చేసిందని ఈ సందర్భంగా విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ధరల సలహా మండలిని ఏర్పరుస్తామని హామీనిచ్చారు.

డీఏపీ బస్తా ఒక్కటి రూ.1,300 కు అమ్ముతున్నారని, అదీ పోలీస్ స్టేషన్‌లో పెట్టి నాలుగు లాఠీ దెబ్బలు తిన్నాకే రైతులకు అందుతోందని మండిపడ్డారు. విత్తనాలు కూడా పోలీస్‌స్టేషన్‌లోనే అమ్మే దుస్థితి దాపురించిందని అన్నారు. తాము అధికారంలోకి రాగానే తిరిగి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని ఎరువుల ధరలు తగ్గిస్తామని చెప్పారు. అలాగే తొమ్మిది గంటలు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రజలందరి బతుకులు చితికిపోయాయన్నారు. నాయకులు బలిసిపోయాయన్నారు.

ప్రజల బాధలు చూస్తే కోపం వస్తొందని, అయితే సంస్కారం అడ్డు వస్తొందన్నారు. హైదరాబాద్‌ను మళ్లీ పునర్నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మల్కాజిగిరి కార్పొరేటర్ సుమలతారెడ్డి ఆధ్వర్యంలో పలువురు ఆరూర్ శివారులోకి వచ్చి ఆయనను కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, టీడీపీ హయంలో హైదరాబాద్‌ను అభివృద్ధి చేసి, ప్రపంచ పటంలో చోటు కల్పించామన్నారు. అలాంటి హైదరాబాద్‌లో ఇప్పుడు అన్నీ అవస్థలేనన్నారు. వీటన్నిటికి కారణమైన తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను తరిమికొట్టాలని బాబు పిలుపు ఇచ్చారు.

బాబు వచ్చినా గేటు తీయని ఎంఆర్ఎఫ్
సదాశివపేట సమీపంలోని ఎంఆర్ఎఫ్‌కు బాబు వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్రగా వెళ్తున్న బాబును ఎంఆర్ఎఫ్ వద్ద కార్మికులు 'అన్నా రండి' అంటూ పిలిచారు. మీరే రోడ్డుపైకి రావాలంటూ పార్టీ నాయకులు కోరడంతో.. గేటు తీయడం లేదని వారు తెలిపారు. దాంతో బాబు ఎంఆర్ఎఫ్ గేట్ వద్దకు వచ్చారు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గేటు తీయలేదు. గేటు బయట నుంచే బాబు ఎందుకు తీయడం లేదని కార్మికులను అడిగారు. డ్యూటీ సమయంలో గేటు తీయరని కార్మికులు చెప్పడంతో ఇదేమన్నా జైలా అని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక ఎంఆర్ఎఫ్ సంగతి చూస్తానని హెచ్చరించారు.
No comments :

No comments :